చిన్నోడికైనా, పెద్దోడికైనా సినిమా అంటే ఓ ఆనందం.. సినిమాకెళ్లడమంటే మహదానందం.. చూస్తున్నంత సేపు ఆత్మానందం.. బయటకు వస్తుంటే పరమానందం... ఇది కరోనా రాకముందు మాట. యాంత్రిక జీవన ఎడారిలో వినోదాల ఒయాసిస్సు దక్కేది ఒక్క సినిమా హాలులోనే. అలాంటి సినిమా టాకీసులు ఇవాళ కరోనా దెబ్బకు బిక్కుబిక్కుమంటున్నాయి. ఓ మూడు గంటలపాటు ఆనందడోలికల్లో ఓలలాడించే ఈ సినిమాహాళ్లలో తెరపైకి లేచి, టికెట్లు తెగి ఇవాల్టికి సరిగ్గా వందరోజులు. వాటినే నమ్ముకున్న యజమానులు, లీజుదారులు, పనిచేసే సిబ్బంది, పంపిణీదారులు అంతా బొమ్మపడక సతమతమవుతున్నారు.
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): థియేటర్ల వద్ద కొత్త సినిమాల విడుదల సందడి లేదు. అభిమాన సంఘాల హడావిడి అంతకంటే లేదు. విజయోత్సవ ర్యాలీలు లేవు. సినిమా హాళ్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం లేదు. కరోనా కారణంగా సినిమా హాళ్లు మూతపడి నేటికి వంద రోజులు. నిత్యం ప్రేక్షకులు, అభిమాన సంఘాలతో కళకళలాడే థియేటర్లు వంద రోజులుగా వెలవెలబోతున్నాయి. ఏ థియేటర్ గేటు దగ్గర చూసిన కరోనా లాక్‌డౌన్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. సినిమాల ప్రదర్శన నిలిచిపోవడంతో యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. థియేటర్లలో పనిచేసే సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా పంపిణీదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సినిమా ప్రదర్శనలు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
కృష్ణా జిల్లాలో 90 థియేటర్లు, విజయవాడ నగరంలో 45 సింగిల్ స్క్రీన్లు, మల్టిఫ్లెక్స్‌లు ఉన్నాయి. 60 రిజిస్టర్డ్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. వీటిలో 12 పూర్తిగా యాక్టివ్‌గా ఉన్నాయి. థియేటర్లు,పంపిణీ సంస్థలపై ఆధారపడి పత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి పైగా సిబ్బంది జీవనం సాగిస్తున్నారు. ఒక్కో థియేటర్‌లో టెక్నికల్ స్టాఫ్, లైట్‌మెన్, వాచ్‌మెన్లు, టికెట్ బుకింగ్ సిబ్బంది, రిప్రజెంటేటివ్స్ పనిచేస్తుంటారు. ఇక మల్టిఫ్లెక్స్‌లో సుమారు 25 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 20 నుంచి థియేటర్లు, మల్టీ ఫ్లెక్స్‌లు మూతపడ్డాయి. లాక్ డౌన్‌లో సడలింపులు ఇచ్చినప్పటికీ అవి థియేటర్లు మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందే థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సిబ్బంది వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
యాజమాన్యానికి తీరని నష్టం
మూడు నెలలుగా సినిమా ప్రదర్శనలు నిలిచిపోవడం యాజమాన్యం దిక్కుతోచని స్థితిలో పడిండి. దాదాపు జిల్లాలోని 90 శాతం థియేటర్లు లీజుదారుల చేతిలోనే ఉన్నాయి. సినిమాలు ప్రదర్శిస్తేనే లీజు చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటారు. ఒక్కో థియేటర్ క్లాస్‌ను బట్టి వారానికి రూ.1 లక్షల నుంచి 3.50 లక్షల వరకు లీజు వస్తుంది. ప్రస్తుతం ప్రదర్శనలు లేకపోవడంతో యజమానులకు లీజు రావడం లేదు. ఒక్కో యజమాని నెలకు రూ. 4 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చింది. దీనికి తోడు థియేటర్ల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ చార్జీల రూపంలో అదనపు భారం పడింది.. కొన్ని థియేటర్ల యాజమాన్యం 50 శాతం సిబ్బందిని తప్పించి వారికి నిత్యావసరాలు, వారానికి కొంత మొత్తం నగదు చెల్లిస్తున్నారు.
పంపిణీదారుల పాట్లు
సాధారణంగా ఏ సినిమాకైనా పంపిణీదారుడే కీలకం. సినిమా థియేటర్లకు మార్చి నుంచి జూన్ వరకు మంచి సీజన్. ఈసారి సీజన్ అంతా లాక్‌డౌన్‌లోనే గడిచిపోయింది. మార్చి 25 తర్వాత పెద్దా, చిన్నా అన్ని కలిపి 20కు పైగా సినిమాలు విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ పుణ్యమాని అవి నిలిచిపోయాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు పనిలేకుండా పోయింది. సినిమా హిట్ అయితే నాలుగు రూపాయలు మిగిలేవి, కానీ సినిమా ప్రదర్శనే లేకపోవడం, సిబ్బంది జీతాలు, కార్యాలయ అద్దెలు చెల్లించాల్సి రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
వంద రోజులుగా మూతపడింది
ఇరవై ఏళ్లుగా సినిమా పంపిణీ సంస్థ నడుపుతున్నా. ఎన్నో సినిమాలకు వంద రోజుల çఫంక్షన్స్ నిర్వహించాం. ఏనాడు థియేటర్లు మూత పడలేదు. ఈ సారి కరోనా మహమ్మారి కారణంగా హండ్రెడ్ డేస్ లాక్‌డౌన్ చూడాల్సి వచ్చింది. దీంతో పరిశ్రమపై ఆధారపడిన మా లాంటి వాళ్లు తీవ్రంగా నష్టపోతున్నాం –ఎన్.సర్వేశ్వరరావు, కామాక్షి డిస్ట్రిబ్యూటర్స్
కోలుకోలేని దెబ్బ
లాక్‌డౌన్ కారణంగా థియేటర్ల లీజు యాజమాన్యం కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఒక్కో థియేటర్‌కు రెంట్, సిబ్బంది జీతాలు, ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ కలుపుకుని రూ. 5 నుంచి 10 లక్షల వరకు నష్టం వచ్చింది. జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. సిబ్బందికి మొదటి నెల పూర్తి జీతం చెల్లించాం. తర్వాత నుంచి వారికి అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తు న్నాం. కొన్ని థియేటర్లు ఈ నెల నుంచి జీతాలు కూడా ఇవ్వడం లేదు. –ఎం బాబీ, మేనేజర్, శైలజా థియేటర్
Comments
Please login to add a commentAdd a comment