చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట | COVID-19: Small screen shows take a big leap | Sakshi
Sakshi News home page

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట

Published Thu, Apr 9 2020 12:38 AM | Last Updated on Thu, Apr 9 2020 5:01 AM

COVID-19: Small screen shows take a big leap - Sakshi

లాక్‌ డౌన్‌ కారణంగా కొత్తగా రిలీజ్‌ కావాల్సిన  సినిమాల కంటెంట్‌ అంతా స్టూడియోల్లోనే ఉండిపోయింది. కొంచెం ఆలస్యం అయినా రేపటి రోజుని చూస్తాయి, విడుదలవుతాయనే గ్యారంటీ ఉంది. కానీ ఇబ్బంది అంతా ఆల్రెడీ రిలీజ్‌ అయిన కొన్ని సినిమాలకే. ప్రభుత్వం పూర్తి స్థాయి లాక్‌ డౌన్‌ ప్రకటించిన వారం ముందే థియేటర్స్‌ని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆల్రెడీ థియేటర్స్‌లో ప్రదర్శితం అవుతున్న చిత్రాలకు చిక్కొచ్చి పడింది. థియేట్రికల్‌ రన్‌ పూర్తి కాకుండా మధ్యలోనే  సినిమా ప్రదర్శన ఆగిపోతే నష్టం ఖాయం. అయితే అలాంటి సినిమాలకు ‘డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌’ ఓ ఊరట అని చెప్పొచ్చు. ఇంటి పట్టున కూర్చుని కాలక్షేపం కోసం ఈ ప్లాట్‌ ఫామ్‌ లో వస్తున్న సినిమాలను వీక్షిస్తున్నారు. దాంతో కొన్ని చిత్రాలను నేరుగా డిజిటల్‌ లో విడుదల చేస్తున్నారు. టీవీ, ల్యాప్‌ టాప్, ఫోన్‌.. చిన్ని తెర అయినప్పటికీ పెద్ద ఊరటగా నిలుస్తున్నాయి.

ఓ పిట్ట  కథ
బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. నిత్యా శెట్టి, విశ్వంత్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. చెందు ముద్దు దర్శకత్వంలో ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన  ఈ చిత్రం మార్చి 6న విడుదలయింది. థియేటర్లో ఆడటానికి స్కోప్‌ ఉన్నా లాక్‌ డౌన్‌తో ఆగింది. అందుకే సినిమా విడుదలయిన పదో రోజునే అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.


పలాస 1978
వర్గ బేధాల గురించి శ్రీకాకుళం నేపథ్యంలో తయారయిన రూరల్‌ డ్రామా ‘పలాస 1978’. కరుణ కుమార్‌ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 6న ఈ సినిమా విడుదలయింది. మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రైమ్‌లో ఉంది.


అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి
ధన్య బాలకృష్ణ, త్రిదా చౌదరి, కోమలి, సిద్ధి ఇద్నాని ముఖ్య పాత్రల్లో బాలు అడుసుమిల్లి తెరకెక్కించిన చిత్రం ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం  మార్చి 6నే విడుదలయింది. ఈ సినిమాని కూడా ప్రస్తుతం ప్రైమ్‌లో చూడవచ్చు.


మధ
‘మధ’ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ కాకముందే ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సత్తా చాటింది. సుమారు 26 ఫిల్మ్‌  ఫెస్టివల్స్‌లో అవార్డులు, అభినందనలు గెలుచుకుంది. త్రిష్ణ ముఖర్జీ ముఖ్య పాత్రలో శ్రీ విద్య బసవ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 13న విడుదలయింది. అన్ని అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడి ఉండేది. అయితే మార్చి 15 నుంచి థియేటర్స్‌ క్లోజ్‌ చేశారు. ఈ సినిమా ఏప్రిల్‌ 8 నుంచి ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.


డబ్బింగ్‌ సినిమాలు
డబ్బింగ్‌ సినిమాలదీ అదే కథ. శివకార్తికేయన్‌ హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. తెలుగులో ఈ సినిమాను ‘శక్తి’ టైటిల్‌తో అనువదించారు. మార్చి 20న ఈ సినిమా థియేటర్స్‌లోకి రావాలి. కానీ లాక్‌ డౌన్‌ కావడంతో సినిమాను డైరెక్ట్‌గా అమెజాన్‌లో రిలీజ్‌ చేశారు. విక్రాంత్, అతుల్య, మిస్కిన్‌ నటించిన ‘షూట్‌ ఎట్‌ సైట్‌ ఉత్తర్వు’ అనే అనువాద చిత్రాన్ని కూడా నేరుగా ప్రైమ్‌లోనే రిలీజ్‌ చేశారు.

సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుడికి చూపిస్తేనే అది తయారు చేసిన వాళ్లకు ఆనందం. కానీ అనుకోకుండా వచ్చిన ఈ ‘లాక్‌ డౌన్‌’ వల్ల థియేటర్లకు రాకుండా సినిమాలు లాక్‌ అయ్యాయి. అందరూ ఇంట్లోనే ఉండటంతో వినోదాన్ని డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లోనే వెతుక్కుంటున్నారు. తెర ఏదైనా సినిమా తెరకెక్కేది ప్రేక్షకుడికి వినోదం అందించడానికే. ఒక నెల క్రితం వరకూ సినిమా విడుదలయ్యాక డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లోకి రావాలంటే మినిమమ్‌ 7 నుంచి 8 వారాలు గ్యాప్‌ ఉంటే బాగుంటుందని నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్‌ అధినేతలు భావించారు. కానీ ఎన్ని రోజుల్లో ఆన్‌ లైన్లో సినిమా అందుబాటులోకి రావాలనే వాదన పక్కన పెడితే ఈ పరిస్థితుల్లో, ఆ సినిమాలకు ఊరట అనే అనుకోవచ్చు. థియేట్రికల్‌ రెవెన్యూ పరంగా పలు ఇబ్బందులు ఎదురైనా ప్రేక్షకుడి వరకూ సినిమా వెళ్ళింది అనే ఆనందం అయితే కచ్చితంగా మిగులుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement