ఆధునిక బస్‌స్టేషన్‌ల నిర్మాణానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.హైదరాబాద్ నగర అందాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా వీటిని నిర్మించడంతో పాటు, అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తారు. ఏసీ సదుపాయం , ఫుడ్‌ప్లాజాలు, షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్‌లు, బ్యాంకులు, తదితర అన్ని వాణిజ్య కార్యకలాపాలకు, వినోదాలకు కేంద్రంగా సిటీబస్‌స్టేషన్‌ల ఏర్పాటుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. నగర వాసులను, పర్యాటకులు సైతం వీటిని సందర్శించేవిధంగా నిర్మించనున్నారు.యూపీ రాజధాని లక్నోలోని ఆలంబాగ్‌లో కట్టించిన హైటెక్ బస్‌స్టేషన్ తరహాలో నగరంలోని గౌలిగూడ, జూబ్లీబస్‌స్టేషన్, తదితర ప్రాంతాల్లో నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇందుకోసం ఆర్టీసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తంతో పాటు మరి కొందరు సీనియర్ అధికారులతో కూడిన బృందం ఫిబ్రవరి ఒకటో తేదీన లక్నోకు వెళ్లనుంది. యూపీలోని పలు నగరాల్లో ఉత్తరప్రదేశ్ ఆర్టీసీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో కట్టించిన బస్‌స్టేషన్‌లను కూడా అధికారులు పరిశీలించనున్నారు. ఈ బస్‌స్టేషన్‌లలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల ద్వారా ఏటా రూ.100 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.
– సాక్షి, హైదరాబాద్
ఆలంబాగ్ ప్రత్యేకతలు..
- మొత్తం 26,500 చదరపు గజాల విస్తీర్ణంలో అక్కడి అందాలను రెట్టింపుచేసే విధంగా నిర్మించారు.
- రోజుకు 80 వేలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగేలా ఏర్పాట్లు . 50 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.
- షాలీమార్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సుమారు రూ.200 కోట్లతో నిర్మించింది. ఇది ఒక అత్యాధునిక టౌన్‌షిప్పులా ఉంటుంది.
- డిజైన్,బిల్డ్, ఫైనాన్స్,ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌ఓటీ) పద్ధతిలో దీన్ని కట్టించారు. 35 ఏళ్ల పాటు దీనిని లీజుకు ఇచ్చారు.
- ఇలాంటివే లక్నో, ఆగ్రా, అలహాబాద్, మీరట్, ఘజియాబాద్, కాన్పూర్‌లలో 21 బస్‌స్టేషన్‌లను యూపీఎస్ ఆర్టీసీ నిర్మిస్తోంది.
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణం..
ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని బస్‌స్టేషన్‌లలో స్టాల్స్, ఇతర వ్యాపార కేంద్రాల నుంచి ఆర్టీసీకి ఏటా రూ.86 కోట్ల ఆదాయం లభిస్తోంది.ఈ ఏడాది రూ.103 కోట్లకు పెంచేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. మరోవైపు పెట్రోల్ బంకుల ద్వారా మరో రూ.25 కోట్లను ఆర్జించేందుకు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో 113 చోట్ల బంకుల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టారు. వీటిలో 9 బంకులు ఆచరణలోకి వచ్చాయి. మరో 5 చోట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇక ఆధునిక బస్‌స్టేషన్‌ల ఏర్పాటు ద్వారా రానున్న రెండేళ్లలో మొత్తంగా వాణిజ్య ఆదాయాన్ని రూ.300 కోట్లకు పెంచుకోవాలని ఆర్టీసీ యోచిస్తోంది.
ఇందులో తొలి విడతగా గౌలిగూడలోని 4.5 ఎకరాలు, జూబ్లీబస్‌స్టేషన్‌కు ఆనుకొని ఉన్న 3.5 ఎకరాల స్థలాల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లో అత్యా ధునిక బస్‌స్టేషన్‌లు నిర్మించనున్నారు. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్‌కు, మహాత్మాగాంధీ మెట్రో స్టేషన్‌కు ఆనుకొని ఉండే ఈ స్థలాల్లో బస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ–మెట్రో కనెక్టివిటీ పెరగడంతో పాటు, రెండు చోట్లా మల్టీప్లెక్స్ థియేటర్‌లు, మాల్స్, ఫుడ్‌ప్లాజాలు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఈ బస్‌స్టేషన్‌లు భాగ్యనగర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మించి 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యాపారులకు లీజుకు ఇస్తారు. అనంతరం చిలకలగూడ, మెట్టుగూడ,కాచిగూడ, ఆర్టీసీ పాత ఎండీ కార్యాలయ స్థలాల్లోనూ పీపీపీ తరహాలో వాణిజ్య భవన సముదాయాలను నిర్మించే ప్రణాళికలో అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment