మల్టీప్లెక్స్‌... బాక్సాఫీస్‌ హిట్‌! | Expanding multiplex culture in the country | Sakshi
Sakshi News home page

మల్టీప్లెక్స్‌... బాక్సాఫీస్‌ హిట్‌!

Published Fri, Mar 29 2019 5:09 AM | Last Updated on Fri, Mar 29 2019 5:09 AM

Expanding multiplex culture in the country - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో మల్టీప్లెక్స్‌ కల్చర్‌ విస్తరిస్తోంది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల స్థానంలో ఇవి ఎంట్రీ ఇస్తున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున మల్టీప్లెక్సుల ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. ఒ క్కో కంపెనీ ఏటా 100కుపైగా స్క్రీన్లను నెలకొల్పుతున్నాయంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీలు ఒక్కో తెరకు (థియేటర్‌) రూ.2.5 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నాయి. డాల్బీ అట్మోస్, ఓరా వంటి ఆధునిక సౌండ్‌ టెక్నాలజీ, లేజర్‌ ప్రొజెక్టర్లతో వ్యూయర్‌ ఎక్స్‌పీరియెన్స్‌కు పెద్దపీట వేస్తున్నాయి.

ఇదీ పరిశ్రమ..
దేశవ్యాప్తంగా 9,000 తెరలు ఉన్నాయి. ఇందులో మల్టీప్లెక్సుల్లో 3,000 స్క్రీన్లు, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు 6,000 దాకా నెలకొన్నాయి. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్, కార్నివాల్, మిరాజ్‌ ఈ రంగంలో పెద్ద బ్రాండ్లుగా అప్రతిహతంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. ఆసియాన్‌ సినిమాస్, సురేష్‌ ప్రొడక్షన్స్‌ వంటి ప్రాంతీయ బ్రాండ్లు 20 దాకా ఈ రంగంలో ఉన్నాయి. మల్టీప్లెక్సుల స్క్రీన్లు ఏటా 12 శాతం వృద్ధి చెందుతున్నాయి. దేశంలో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల సంఖ్య తగ్గుతోంది. అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇవి గట్టి పట్టు సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2,500 దాకా స్క్రీన్లుంటే, వీటిలో సింగిల్‌ స్రీన్లే అత్యధికం.

సింగిల్‌ స్థానంలో మల్టీ..
భారత్‌లో 6,000 సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు ఉన్నాయి. వీటి సంఖ్య క్రమంగా పడిపోతోంది. గతేడాది ఈ థియేటర్ల సంఖ్య 5 శాతం తగ్గాయి. వీటి స్థానంలో మల్టీప్లెక్సులు వస్తున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో ఇవి నెలకొని ఉండడం కలిసివచ్చే అంశం. పైగా పెద్ద బ్రాండ్లు సొంతంగా పెట్టుబడి పెట్టి మల్టీప్లెక్సులను నిర్మిస్తుండడంతో స్థల/థియేటర్‌ యజమానులకు ఎటువంటి భారం ఉండడం లేదు. పైపెచ్చు గతంలో కంటే ఏటా అదనంగా నిర్దిష్ట ఆదాయం వస్తోంది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో సీట్ల సామర్థ్యం 500 నుంచి 600 దాకా ఉంది. అదే మల్టీప్లెక్సు అయితే ఒక్కో స్క్రీన్‌ 250 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటున్నాయి.

ఏటా 12 శాతం వృద్ధి..
టికెట్ల విక్రయం, ప్రకటనలు, ఫుడ్‌ విక్రయాల ద్వారా పరిశ్రమ ఏటా రూ.17,500 కోట్లు ఆర్జిస్తోంది. వృద్ధి రేటు 10–12 శాతం ఉంటోంది. ఈ ఆదాయంలో 60 శాతం వాటా మల్టీప్లెక్సులు కైవసం చేసుకుంటున్నాయి. మొత్తం ఆదాయంలో తెలుగు సినిమాల ద్వారా 20 శాతం, తమిళం 15, మలయాళం 5, కన్నడ 5 శాతం నమోదు అవుతోంది. పెద్ద బ్రాండ్ల మార్జిన్లు 22 శాతం వరకు ఉంటోందని సమాచారం. పరిశ్రమలో 50,000 మంది పైచిలుకు పనిచేస్తున్నారు.

సగటున 2,000 సినిమాలు..
భారత్‌లో ఏటా 2,000 సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. ఇందులో 1,600 దేశీయంగా నిర్మించినవి కాగా మిగిలినవి విదేశాలకు చెందినవి. సినిమాల నిర్మాణం పరంగా ప్రపంచంలో భారత్‌ తొలి స్థానంలో ఉంటుంది. మొత్తం సినిమాల్లో 700 దాకా హిందీ సినిమాలు, 300–350 తెలుగు సినిమాలు ఉంటాయి.

టికెట్‌ ధర ఎంతైనా సరే..
అల్ట్రా ప్రీమియం స్క్రీన్స్‌లో టికెట్‌ ధర ఊహించనంత ఉంటోంది. ఢిల్లీలో అయితే ఏకంగా రూ.3,000 వరకు ఉందని మిరాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భువనేష్‌ మెందిరట్ట సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. సినిమా అనుభూతి కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావాల్సిందేనని చెప్పారు. ఇందుకు ఖర్చుకు వెనుకాడడం లేదన్నారు. ‘ఒక ఏడాదిలో థియేటర్ల ఆక్యుపెన్సీ (సీట్లు నిండడం) దేశ సగటు 30 శాతం ఉంది. దక్షిణాదిన ఇది అత్యధికగా 50 శాతం నమోదు చేస్తోంది. మల్టీప్లెక్స్‌ కల్చర్‌ ప్రధానంగా దక్షిణాదినే కేంద్రీకృతమైంది’ అని వివరించారు.
5

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement