Entertainment Services
-
జీ పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్(జీల్) పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా తాజాగా వెల్లడించారు. బోర్డు మార్గదర్శకత్వంలో కంపెనీ భవిష్యత్‌కు అనువైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. నెల రోజుల మౌనాన్ని వీడుతూ గోయెంకా.. గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ప్రతిపాదించిన డీల్ అంశాన్ని ఇన్వెస్కో పబ్లిక్కు వెల్లడించకపోవడాన్ని ప్రశ్నించారు. జీలో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తున్న ఇన్వెస్కో కొద్ది రోజులుగా అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఏజీఎం)కి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తద్వారా పునీత్ గోయెంకాసహా బోర్డులో ఇతర నామినీలను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పునీత్ గోయెంకా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇంతక్రితం వేసిన ప్రణాళికలను పబ్లిక్కు ఎందుకు తెలియజేయలేదని ఇన్వెస్కోను వేలెత్తి చూపారు. కార్పొరేట్ సుపరిపాలన అనేది కార్పొరేట్లకు మాత్రమేకాదని, కంపెనీలో వాటా కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకూ వర్తిస్తుందని ఇన్వెస్కోనుద్ధేశించి పేర్కొన్నారు. జీల్లో.. ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఎల్‌ఎల్‌సీతోపాటు ఇన్వెస్కో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. జీ భవిష్యత్‌ను ప్రభావితం చేసేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా పెంచుకుంటూ వస్తున్న వాటాదారుల విలువకు దెబ్బతగలనీయబోమని వ్యాఖ్యానించారు. ఇన్వెస్కోతో వివాదం నేపథ్యంలో జీ మరిన్ని వృద్ధి అవకాశాలను అందుకుంటుందని, మరింత పటిష్టపడుతుందని తెలియజేశారు. తద్వారా మీడియా, వినోద రంగాలలో దిగ్గజ కంపెనీగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ భవిష్యత్ కోసం మాత్రమే పోరాడుతున్నానని, తన స్థానాన్ని కాపాడుకునేందుకు కాదని గోయెంకా ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. రిలయన్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయతి్నంచిన ఇన్వెస్కో విఫలమైందని, ఈ విషయాన్ని దాచిపెట్టిందని వివరించారు. వాటాదారుల ప్రయోజనార్ధమే ఈ నిజాలను బోర్డు ముందుంచినట్లు పేర్కొన్నారు. -
మల్టీప్లెక్స్... బాక్సాఫీస్ హిట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో మల్టీప్లెక్స్ కల్చర్ విస్తరిస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల స్థానంలో ఇవి ఎంట్రీ ఇస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున మల్టీప్లెక్సుల ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. ఒ క్కో కంపెనీ ఏటా 100కుపైగా స్క్రీన్లను నెలకొల్పుతున్నాయంటే ఎంటర్టైన్మెంట్ రంగంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీలు ఒక్కో తెరకు (థియేటర్) రూ.2.5 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నాయి. డాల్బీ అట్మోస్, ఓరా వంటి ఆధునిక సౌండ్ టెక్నాలజీ, లేజర్ ప్రొజెక్టర్లతో వ్యూయర్ ఎక్స్‌పీరియెన్స్‌కు పెద్దపీట వేస్తున్నాయి. ఇదీ పరిశ్రమ.. దేశవ్యాప్తంగా 9,000 తెరలు ఉన్నాయి. ఇందులో మల్టీప్లెక్సుల్లో 3,000 స్క్రీన్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు 6,000 దాకా నెలకొన్నాయి. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్, కార్నివాల్, మిరాజ్ ఈ రంగంలో పెద్ద బ్రాండ్లుగా అప్రతిహతంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. ఆసియాన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రాంతీయ బ్రాండ్లు 20 దాకా ఈ రంగంలో ఉన్నాయి. మల్టీప్లెక్సుల స్క్రీన్లు ఏటా 12 శాతం వృద్ధి చెందుతున్నాయి. దేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య తగ్గుతోంది. అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇవి గట్టి పట్టు సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2,500 దాకా స్క్రీన్లుంటే, వీటిలో సింగిల్ స్రీన్లే అత్యధికం. సింగిల్ స్థానంలో మల్టీ.. భారత్‌లో 6,000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. వీటి సంఖ్య క్రమంగా పడిపోతోంది. గతేడాది ఈ థియేటర్ల సంఖ్య 5 శాతం తగ్గాయి. వీటి స్థానంలో మల్టీప్లెక్సులు వస్తున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో ఇవి నెలకొని ఉండడం కలిసివచ్చే అంశం. పైగా పెద్ద బ్రాండ్లు సొంతంగా పెట్టుబడి పెట్టి మల్టీప్లెక్సులను నిర్మిస్తుండడంతో స్థల/థియేటర్ యజమానులకు ఎటువంటి భారం ఉండడం లేదు. పైపెచ్చు గతంలో కంటే ఏటా అదనంగా నిర్దిష్ట ఆదాయం వస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సీట్ల సామర్థ్యం 500 నుంచి 600 దాకా ఉంది. అదే మల్టీప్లెక్సు అయితే ఒక్కో స్క్రీన్ 250 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటున్నాయి. ఏటా 12 శాతం వృద్ధి.. టికెట్ల విక్రయం, ప్రకటనలు, ఫుడ్ విక్రయాల ద్వారా పరిశ్రమ ఏటా రూ.17,500 కోట్లు ఆర్జిస్తోంది. వృద్ధి రేటు 10–12 శాతం ఉంటోంది. ఈ ఆదాయంలో 60 శాతం వాటా మల్టీప్లెక్సులు కైవసం చేసుకుంటున్నాయి. మొత్తం ఆదాయంలో తెలుగు సినిమాల ద్వారా 20 శాతం, తమిళం 15, మలయాళం 5, కన్నడ 5 శాతం నమోదు అవుతోంది. పెద్ద బ్రాండ్ల మార్జిన్లు 22 శాతం వరకు ఉంటోందని సమాచారం. పరిశ్రమలో 50,000 మంది పైచిలుకు పనిచేస్తున్నారు. సగటున 2,000 సినిమాలు.. భారత్‌లో ఏటా 2,000 సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. ఇందులో 1,600 దేశీయంగా నిర్మించినవి కాగా మిగిలినవి విదేశాలకు చెందినవి. సినిమాల నిర్మాణం పరంగా ప్రపంచంలో భారత్ తొలి స్థానంలో ఉంటుంది. మొత్తం సినిమాల్లో 700 దాకా హిందీ సినిమాలు, 300–350 తెలుగు సినిమాలు ఉంటాయి. టికెట్ ధర ఎంతైనా సరే.. అల్ట్రా ప్రీమియం స్క్రీన్స్‌లో టికెట్ ధర ఊహించనంత ఉంటోంది. ఢిల్లీలో అయితే ఏకంగా రూ.3,000 వరకు ఉందని మిరాజ్ ఎంటర్టైన్మెంట్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ భువనేష్ మెందిరట్ట సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సినిమా అనుభూతి కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావాల్సిందేనని చెప్పారు. ఇందుకు ఖర్చుకు వెనుకాడడం లేదన్నారు. ‘ఒక ఏడాదిలో థియేటర్ల ఆక్యుపెన్సీ (సీట్లు నిండడం) దేశ సగటు 30 శాతం ఉంది. దక్షిణాదిన ఇది అత్యధికగా 50 శాతం నమోదు చేస్తోంది. మల్టీప్లెక్స్ కల్చర్ ప్రధానంగా దక్షిణాదినే కేంద్రీకృతమైంది’ అని వివరించారు. 5 -
దూర ప్రయాణానికి దగ్గరి దారి!
• ఔట్ స్టేషన్ క్యాబ్ సర్వీసులందిస్తున్న జిప్పీస్ • హోటల్, రిక్రియేషన్, ఎంటర్టైన్మెంట్ సేవలు కూడా.. • ప్రస్తుతం 45 నగరాల్లో సేవలు; 100 నగరాలకు విస్తరణ • ‘స్టార్టప్ డైరీ’తో జిప్పీస్ కో-ఫౌండర్ మధు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మెట్రో సిటీల్లో ప్రయాణించడానికి బోలెడన్ని క్యాబ్ సంస్థలున్నాయి. మరి, సిటీ దాటి వెళ్లాలంటే? కొంత ఇబ్బందే!! ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నారు ఇద్దరు ప్రవాసులు. అంతే!! చేతిలో ఉన్న బంగారం లాంటి అమెరికా ఉద్యోగాన్ని వదిలేసి... ఈ అవసరాన్నే వ్యాపారంగా మార్చుకున్నారు. ఔట్ స్టేషన్ క్యాబ్ సర్వీసులందించే ‘జిప్పీస్’ను ప్రారంభించారు. క్యాబ్‌లతో పాటు స్థానిక హోటల్స్, రిక్రియేషన్స్, ఎంటర్టైన్మెంట్ సేవల్ని కూడా కనెక్ట్ చేయటం జిప్పీస్ ప్రత్యేకత. అదే ఈ వారం ‘స్టార్టప్ డైరీ’.. మధు రఘునాయకులు, రజనీ కాసు ఇద్దరూ అమెరికాలో వెరిజాన్‌లో పనిచేసేవారు. ఎప్పుడు ఇండియాకొచ్చినా వారికెదురయ్యే మొదటి సమస్య ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి క్యాబ్ దొరక్కపోవటమే. స్థానిక క్యాబ్‌ను ఆశ్రయిస్తే లగేజీ, దూరం ఎక్కువంటూ ఇష్టమొచ్చినంత అడిగేవాడు. ఇంటికెళ్లాలనే కోరికతో చేసేదేం లేక జేబు గుల్ల చేసుకోక తప్పేది కాదు. ఇలాంటి ఇబ్బందే జిప్పీస్.కామ్ సంస్థకు పునాది వేసింది అని చెప్పుకొచ్చారు మధు, రజనీ. ‘‘రూ.కోటి పెట్టుబడితో గతేడాది నవంబర్‌లో జిప్పీస్.కామ్‌ను ప్రారంభించాం. జిప్పీస్ కూడా ఓలా, ఉబర్ బిజినెస్ మోడల్ లాంటిదే. కాకపోతే ఔట్ స్టేషన్లకు క్యాబ్ అగ్రిగేట్ సేవలందించడమే మా ప్రత్యేకత’’ అన్నారు వారు. 5,000 వేల మంది నమోదు.. ‘‘వెబ్సైట్, యాప్, కాల్ సెంటర్... దేన్నుంచయినా జిప్పీస్ సేవల్ని పొందవచ్చు. పోలీస్ వెరిఫికేషన్, లెసైన్స్, ఇన్సూరె న్స్, వ్యక్తిగత చెకింగ్ వంటివి పూర్తయిన డ్రైవర్లు, వాహనాలను మాత్రమే రిజిస్టర్ చేసుకుంటాం. ప్రస్తుతం మా వద్ద 5,000 మంది డ్రైవర్లు నమోదయ్యారు. ఇందులో హైదరాబాద్ నుంచి సుమారు 1,200 వాహనాలుంటాయి. కస్టమర్ల భద్రతరీత్యా వాహనాన్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తుంటాం. డ్రైవర్ గనక ఒకవేళ యాప్‌ను ఆఫ్ చేస్తే... వెంటనే కాల్ సెంటర్ నుంచి డ్రైవర్‌కు, కస్టమర్‌కు కాల్ కూడా వెళుతుంది. నెలకు రూ.50 లక్షల ఆదాయం.. ప్రస్తుతం దేశంలో హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నై వంటి 45 నగరాల్లో సేవలందిస్తున్నాం. నెలకు 1,000-1,200 ఔట్ స్టేషన్ ట్రిప్పులు బుక్ అవుతున్నాయి. హైద రాబాద్-శ్రీశైలం, బెంగళూరు-మైసూరు, చెన్నై-తిరుపతి మధ్య ట్రిప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. ట్రిప్పై డ్రైవర్ నుంచి 10-20 శాతం కమీషన్ రూపంలో తీసుకుంటాం. ప్రస్తుతం నెలకు రూ.50 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. జిప్పీస్ ద్వారా క్యాబ్‌లతో పాటు హోటల్స్‌నూ బుక్ చేసుకోవచ్చు. జనవరి నుంచి రిక్రియేషన్, ఎంటర్టైన్మెంట్ సేవలనూ బుక్ చేసుకునే వీలు కల్పిస్తాం. వైద్య సేవల నిమిత్తం రోగిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లేందుకు కాల్ హెల్త్‌తో కూడా ఒప్పందం చేసుకున్నాం. రూ.2 కోట్ల నిధుల సమీకరణ.. 2017 మార్చి నాటికి వంద నగరాలకు సేవల్ని విస్తరించాలని నిర్ణయించాం. ముందుగా దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి దగ్గర్లోని పర్యాటక ప్రాంతాలకు సేవలందిస్తాం. ఆయా పర్యాటక క్షేత్రాలనూ గుర్తించాం కూడా. ప్రస్తుతం మా సంస్థలో 21 మంది పనిచేస్తున్నారు. టీం యూఎస్ఏ అనే అమెరికాకు చెందిన ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నుంచి రూ.2 కోట్లు సమీకరించాం. గురువారమే పేపర్ వర్క్ పూర్తయింది. సంస్థ రెండు విడతలుగా ఈ పెట్టుబడి పెడుతుంది. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...