దూర ప్రయాణానికి దగ్గరి దారి!
• ఔట్ స్టేషన్ క్యాబ్ సర్వీసులందిస్తున్న జిప్పీస్
• హోటల్, రిక్రియేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు కూడా..
• ప్రస్తుతం 45 నగరాల్లో సేవలు; 100 నగరాలకు విస్తరణ
• ‘స్టార్టప్ డైరీ’తో జిప్పీస్ కో-ఫౌండర్ మధు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మెట్రో సిటీల్లో ప్రయాణించడానికి బోలెడన్ని క్యాబ్ సంస్థలున్నాయి. మరి, సిటీ దాటి వెళ్లాలంటే? కొంత ఇబ్బందే!! ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నారు ఇద్దరు ప్రవాసులు. అంతే!! చేతిలో ఉన్న బంగారం లాంటి అమెరికా ఉద్యోగాన్ని వదిలేసి... ఈ అవసరాన్నే వ్యాపారంగా మార్చుకున్నారు. ఔట్ స్టేషన్ క్యాబ్ సర్వీసులందించే ‘జిప్పీస్’ను ప్రారంభించారు. క్యాబ్‌లతో పాటు స్థానిక హోటల్స్, రిక్రియేషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సేవల్ని కూడా కనెక్ట్ చేయటం జిప్పీస్ ప్రత్యేకత. అదే ఈ వారం ‘స్టార్టప్ డైరీ’..
మధు రఘునాయకులు, రజనీ కాసు ఇద్దరూ అమెరికాలో వెరిజాన్‌లో పనిచేసేవారు. ఎప్పుడు ఇండియాకొచ్చినా వారికెదురయ్యే మొదటి సమస్య ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి క్యాబ్ దొరక్కపోవటమే. స్థానిక క్యాబ్‌ను ఆశ్రయిస్తే లగేజీ, దూరం ఎక్కువంటూ ఇష్టమొచ్చినంత అడిగేవాడు. ఇంటికెళ్లాలనే కోరికతో చేసేదేం లేక జేబు గుల్ల చేసుకోక తప్పేది కాదు. ఇలాంటి ఇబ్బందే జిప్పీస్.కామ్ సంస్థకు పునాది వేసింది అని చెప్పుకొచ్చారు మధు, రజనీ. ‘‘రూ.కోటి పెట్టుబడితో గతేడాది నవంబర్‌లో జిప్పీస్.కామ్‌ను ప్రారంభించాం. జిప్పీస్ కూడా ఓలా, ఉబర్ బిజినెస్ మోడల్ లాంటిదే. కాకపోతే ఔట్ స్టేషన్లకు క్యాబ్ అగ్రిగేట్ సేవలందించడమే మా ప్రత్యేకత’’ అన్నారు వారు.
5,000 వేల మంది నమోదు..
‘‘వెబ్‌సైట్, యాప్, కాల్ సెంటర్... దేన్నుంచయినా జిప్పీస్ సేవల్ని పొందవచ్చు. పోలీస్ వెరిఫికేషన్, లెసైన్స్, ఇన్సూరె న్స్, వ్యక్తిగత చెకింగ్ వంటివి పూర్తయిన డ్రైవర్లు, వాహనాలను మాత్రమే రిజిస్టర్ చేసుకుంటాం. ప్రస్తుతం మా వద్ద 5,000 మంది డ్రైవర్లు నమోదయ్యారు. ఇందులో హైదరాబాద్ నుంచి సుమారు 1,200 వాహనాలుంటాయి. కస్టమర్ల భద్రతరీత్యా వాహనాన్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తుంటాం. డ్రైవర్ గనక ఒకవేళ యాప్‌ను ఆఫ్ చేస్తే... వెంటనే కాల్ సెంటర్ నుంచి డ్రైవర్‌కు, కస్టమర్‌కు కాల్ కూడా వెళుతుంది.
నెలకు రూ.50 లక్షల ఆదాయం..
ప్రస్తుతం దేశంలో హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నై వంటి 45 నగరాల్లో సేవలందిస్తున్నాం. నెలకు 1,000-1,200 ఔట్ స్టేషన్ ట్రిప్పులు బుక్ అవుతున్నాయి. హైద రాబాద్-శ్రీశైలం, బెంగళూరు-మైసూరు, చెన్నై-తిరుపతి మధ్య ట్రిప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. ట్రిప్‌పై డ్రైవర్ నుంచి 10-20 శాతం కమీషన్ రూపంలో తీసుకుంటాం. ప్రస్తుతం నెలకు రూ.50 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. జిప్పీస్ ద్వారా క్యాబ్‌లతో పాటు హోటల్స్‌నూ బుక్ చేసుకోవచ్చు. జనవరి నుంచి రిక్రియేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ సేవలనూ బుక్ చేసుకునే వీలు కల్పిస్తాం. వైద్య సేవల నిమిత్తం రోగిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లేందుకు కాల్ హెల్త్‌తో కూడా ఒప్పందం చేసుకున్నాం.
రూ.2 కోట్ల నిధుల సమీకరణ..
2017 మార్చి నాటికి వంద నగరాలకు సేవల్ని విస్తరించాలని నిర్ణయించాం. ముందుగా దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి దగ్గర్లోని పర్యాటక ప్రాంతాలకు సేవలందిస్తాం. ఆయా పర్యాటక క్షేత్రాలనూ గుర్తించాం కూడా. ప్రస్తుతం మా సంస్థలో 21 మంది పనిచేస్తున్నారు. టీం యూఎస్‌ఏ అనే అమెరికాకు చెందిన ఏంజిల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ నుంచి రూ.2 కోట్లు సమీకరించాం. గురువారమే పేపర్ వర్క్ పూర్తయింది. సంస్థ రెండు విడతలుగా ఈ పెట్టుబడి పెడుతుంది.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...