న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్(జీల్) పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా తాజాగా వెల్లడించారు. బోర్డు మార్గదర్శకత్వంలో కంపెనీ భవిష్యత్‌కు అనువైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. నెల రోజుల మౌనాన్ని వీడుతూ గోయెంకా.. గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ప్రతిపాదించిన డీల్ అంశాన్ని ఇన్వెస్కో పబ్లిక్‌కు వెల్లడించకపోవడాన్ని ప్రశ్నించారు.
జీలో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తున్న ఇన్వెస్కో కొద్ది రోజులుగా అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఏజీఎం)కి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తద్వారా పునీత్ గోయెంకాసహా బోర్డులో ఇతర నామినీలను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పునీత్ గోయెంకా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇంతక్రితం వేసిన ప్రణాళికలను పబ్లిక్‌కు ఎందుకు తెలియజేయలేదని ఇన్వెస్కోను వేలెత్తి చూపారు.
కార్పొరేట్ సుపరిపాలన అనేది కార్పొరేట్లకు మాత్రమేకాదని, కంపెనీలో వాటా కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకూ వర్తిస్తుందని ఇన్వెస్కోనుద్ధేశించి పేర్కొన్నారు. జీల్‌లో.. ఓఎఫ్‌ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఎల్‌ఎల్‌సీతోపాటు ఇన్వెస్కో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. జీ భవిష్యత్‌ను ప్రభావితం చేసేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా పెంచుకుంటూ వస్తున్న వాటాదారుల విలువకు దెబ్బతగలనీయబోమని వ్యాఖ్యానించారు.
ఇన్వెస్కోతో వివాదం నేపథ్యంలో జీ మరిన్ని వృద్ధి అవకాశాలను అందుకుంటుందని, మరింత పటిష్టపడుతుందని తెలియజేశారు. తద్వారా మీడియా, వినోద రంగాలలో దిగ్గజ కంపెనీగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ భవిష్యత్ కోసం మాత్రమే పోరాడుతున్నానని, తన స్థానాన్ని కాపాడుకునేందుకు కాదని గోయెంకా ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. రిలయన్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయతి్నంచిన ఇన్వెస్కో విఫలమైందని, ఈ విషయాన్ని దాచిపెట్టిందని వివరించారు. వాటాదారుల ప్రయోజనార్ధమే ఈ నిజాలను బోర్డు ముందుంచినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment