
సినిమా థియేటర్లపై నజర్
వినోద పన్ను వసూళ్లే లక్ష్యం
ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ల అనుసంధానం
{పత్యేక స్టాప్‌వేర్‌కు కసరత్తు
సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లోని సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్ల నుంచి వినోద పన్నును పకడ్బందీగా వసూలు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. థియేటర్ల టిక్కెట్ల అమ్మకాలను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ సబ్‌కమిటీ కూడా నిర్ణయం తీసుకోవడంతో ప్రయోగాత్మకంగా గ్రేటర్‌లో అమలు చేయాలని నిర్ణయించారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్ లు, థియేటర్లలో జరిగే టిక్కెట్ల అమ్మకాల వివరాలు ఎప్పటికప్పుడు వాణిజ్యపన్నుల శాఖలో రికార్డ్ అయ్యేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించనున్నారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ)తో సమన్వయం చేసుకొని, థియేటర్లలో జరిగిన టిక్కెట్ల అమ్మకాలను ఎఫ్‌డీసీ ద్వారా శాఖకు చేరేలా సాఫ్ట్‌వేర్ రూప కల్పన చేసేందుకు చర్యలు చర్యలు చేపట్టారు. టికెట్ల అమ్మకాలను బట్టి వినోద పన్నును వసూలు చేయవచ్చని వాణిజ్య పన్నుల శాఖ భావిస్తోంది. ఇప్పటి వరకు వినోద పన్నుల వసూళ్ల లక్ష్యం పూర్తిగా వెనుకబడి ఉండటంతో ఈ మేరకు చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
ప్రత్యేక యాప్ అమలేదీ..?
వాణిజ్య పన్నుల శాఖ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించినా అమలు ఆచరణలో లేకుండా పోయింది గతేడాది సీజీజీ ఆధ్వర్యంలో రూపొందిన ఈ యాప్ (ఆన్‌లైన్ విధానం) ద్వారా థియేటర్ పేరు, లెసైన్స్, చిరునామా, ప్రదర్శనల సంఖ్య, మొత్తం సీట్లు.. భర్తీ అయిన సీట్లు తదితర వివరాలను సినిమా ప్రారంభం కాగానే యజమానులు పంపించాల్సి విధంగా చర్యలు చేపట్టారు .కానీ ఆచరణలో అమలు మాత్రం లేకుండా పోయింది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ కొత్త తరహా సాఫ్ట్ వేర్ రూప కల్పనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.