న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం రూ. 289 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 74.5 కోట్ల నష్టమే నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 662 కోట్ల నుంచి రూ. 263 కోట్లకు క్షీణించింది. కాగా.. కోవిడ్–19 కట్టడికి లాక్‌డౌన్‌ల అమలు, సామాజిక దూరం, కంటెంట్ తగ్గడం వంటి పలు ప్రతికూల అంశాలు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపినట్లు పీవీఆర్ పేర్కొంది.
వెరసి ఫలితాలను అంతక్రితం ఏడాది పనితీరుతో పోల్చి చూడతగదని తెలియజేసింది. మల్టీప్లెక్స్ పరిశ్రమకు గత ఆర్థిక సంవత్సరం అత్యంత గడ్డుకాలమని వ్యాఖ్యానించింది. అయితే ఫిక్స్‌డ్ వ్యయాల తగ్గింపు, తగినంత లిక్విడిటీ వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలియజేసింది. క్యూ4లో హాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రాధాన్యతగల సినిమాలు విడుదలకాలేదని ప్రస్తావించింది. దక్షిణాదిలో కీలక సినిమాల కారణంగా రికవరీ కనిపించినట్లు పేర్కొంది.
ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 1,319 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment