సాక్షి, ముంబై : మల్టీప్లెక్స్‌లో ఆహార పదార్ధాల ధరల మోతపై ప్రభుత్వ తీరును బాంబే హైకోర్టు తప్పుపట్టింది. ధరలను విపరీతంగా పెంచి ప్రేక్షకుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తుంటే మహారాష్ట్ర సర్కార్ చోద్యం చూస్తోందని దుయ్యబట్టింది. మల్టీప్లెక్స్‌లో ఆహార పదార్ధాల ధరలను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించింది. బొంబాయి పోలీసు చట్టానికి అనుగుణంగా సినిమా హాళ్లలో తినుబండారాల ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టడాన్ని పరిశీలించాలని జస్టిస్ రంజిత్ మోర్, అనుజ ప్రభుదేశాయ్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.
మల్టీప్లెక్స్‌ల్లో తినుబండారాలు, శీతలపానీయాల ధరలు భారంగా ఉన్నాయని, కొన్నిసార్లు మూవీ టికెట్ల కంటే కొన్ని తినుబండారాల ధరలే అధికంగా ఉన్నాయని బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రజలను ఇంటి నుంచి ఆహార పదార్ధాలను తెచ్చుకునేందుకు ప్రభుత్వం అనుమతించడం సాధ్యం కాదని తమకు తెలుసునని, అయితే సినిమా హాళ్లలో తినుబండారాల ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించింది.
మల్లీప్లెక్స్‌ల్లో, సినిమా థియేటర్లలో బయటి ఆహారాన్ని అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ జైనేంద్ర బక్షి దాఖలు చేసిన పిల్‌ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.మరోవైపు థియేటర్ల లోపల తినుబండారాలను విక్రయించే రిటైలర్లు నిర్ణయించే ధరల్లో తాము జోక్యం చేసుకోలేమని మల్టిప్లెక్స్ యజమానుల సంఘం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment