మల్టీప్లెక్స్ థియేటర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, విజయవాడ : షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలకు వినియోగదారుల ఫోరమ్ మొట్టికాయలు వేసింది. ఎమ్పార్టీ కంటే అధిక రేట్లతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న మల్టీప్లెక్స్ థియేటర్లపై స్థానిక వినియోగదారుల న్యాయస్థానం కొరడా ఝళిపించింది. విజయవాడలోని ఐదు మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున (మొత్తం 25 లక్షల రూపాయలు) భారీ జరిమానా విధించింది. ఎల్‌ఈపీఎల్, ట్రెండ్‌సెట్, పీవీఆర్, పీవీపీ, ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గతేడాది ఏప్రిల్‌లో వినియోగదారుల ఫోరంలో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
నగరంలోని కొన్ని మల్టీప్లెక్స్‌లలో మూవీ టికెట్లతో పాటు తినుబండారాలు, కూల్ డ్రింక్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతేడాది నుంచి దీనిపై పలుమార్లు విచారణ జరిగింది. ఈ క్రమంలో గురువారం మరోసారి విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి మాధవరావు.. ప్రేక్షకులు బయట నుంచి తెచ్చుకునే తినుబండారాలు, తాగునీటిని మల్టీప్లెక్స్‌లలోకి అనుమతించాలని తీర్పు ఇచ్చారు. వీటి పర్యవేక్షణ బాధ్యతను తూనికలు కొలతల శాఖకు కోర్టు అప్పగించింది. అధిక ధరలకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడటం తీవ్రమైన తప్పిదంగా పరిగణించిన కోర్టు.. ఎల్‌ఈపీఎల్, ట్రెండ్‌సెట్, పీవీఆర్, పీవీపీ, ఐనాక్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు ఐదేసి లక్షల చొప్పున జరిమానా విధించారు. కాగా, జరిమానా నగదును రెండు నెలల్లోపు జిల్లా వినియోగదారుల ఫోరం వద్ద జమ చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment