mrp prices
-
ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి
సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మద్యం ధరలు, ఇసుక లభ్యత–సరఫరాపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం దుకాణం యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే ఊపేక్షించేందిలేదన్నారు.ఎమ్మార్పీకి కంటే ఎక్కువ రేటుకు మద్యం విక్రయిస్తూ, బెల్డ్ షాపులను ప్రోత్సహిస్తూ పట్టుబడితే తొలిసారిగా రూ.5 లక్షలు జరిమానా విధించాలన్నారు. అదే తప్పును పునరావృతం చేస్తే దుకాణం లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్, ధరల పట్టికను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇసుక లభ్యతను పెంచాలని సీఎం సూచించారు. ఇసుకలో అక్రమాలు జరిగితే దానికి అధికారుల పైనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
ఎమ్ఆర్పి ధరల్లో జరిగే మోసాలకు ఇలా చెక్ పెట్టండి
మనం నిత్యజీవితంలో ప్రతి రోజూ బస్ స్టేషన్స్‌లో, రైల్వే స్టేషన్స్ వద్ద లేదా ఇతర ప్రాంతాలలో MRP ధరలకే అన్ని అందుబాటులో ఉంటాయనే బోర్డులు చూస్తూనే ఉంటాము. అయితే దుకాణదారుడు నిర్దేశించిన ధరకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే మీరు లీగల్ మెట్రాలజీ విభాగానికి కంప్లైంట్ చేయవచ్చు. భారతదేశంలో ఒక దుకాణదారుడు రిటైల్ ప్రైస్ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే అది చట్టవిరుద్ధం, దీనిపైన బాధితుడు కంప్లైట్ చేస్తే తప్పకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. 2009 లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం.. ఉత్పత్తి మీద లేదా వస్తువు మీద ముద్రించిన ధరకే విక్రయాలు జరపాలి. (ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ధరలు పెరిగేవి.. తగ్గేవి: బంగారం నుంచి మొబైల్స్ వరకు!) నిజానికి ఒక వస్తువు రిటైల్ ప్రైస్ అనేది కొనుగోలు చేయడానికి కస్టమర్‌కు ఛార్జ్ చేసిన ధర. ఇందులో అన్ని పన్నులు, ఉత్పత్తి ఖర్చు, రవాణా, తయారీదారుకు అయ్యే ఖర్చు వంటివి లెక్కించి నిర్దారిస్తారు. అంతే కాకుండా కొనుగోలుదారుని స్పష్టత కోసం ప్యాకేజింగ్‌పై ప్రింట్ చేస్తారు. ఎమ్ఆర్పి కంటే ఎక్కువ వసూలు చేస్తే ఎలా కంప్లైంట్ చేయాలి? దుకాణదారుడు మీకు నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించాడని తెలిసినప్పుడు లీగల్ మెట్రాలజీ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1800-11-4000/ 1915కి కాల్ చేయవచ్చు, లేదా మీ జిల్లాలోని కన్జ్యుమర్ ఫోరమ్‌లో కంప్లైంట్ చేయవచ్చు. బాధితుడు 8800001915కు SMS పంపవచ్చు లేదా NCH యాప్, ఉమాంగ్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. కాల్, ఎస్ఎమ్ఎస్ వద్దనుకున్నప్పుడు https://consumerhelpline.gov.in/user/signup.php ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. దీనికి వన్-టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది. మీరు కంప్లైంట్ చేయడానికి పైన అన్ని మార్గాలను అనుసరించినప్పటికీ సమాధానం రానప్పుడు NCDRC వెబ్సైట్, స్టేట్ కమిషన్, డిస్ట్రిక్ట్ కమిషన్ వంటి వినియోగదారు కమిషన్‌ను సంప్రదించవచ్చు. విచారణ తరువాత కూడా దుకాణదారుడు మళ్ళీ అలాంటి ఉల్లంఘనకు పాల్పడితే జరిమానా విధించబడుతుంది. అంతే కాకుండా బాధితుడు కూడా భారీ మొత్తంలో నష్టపరిహారం పొందవచ్చు. -
గుడ్‌న్యూస్: భారత్‌లో తగ్గనున్న వంటనూనె ధరలు..కారణం ఇదే!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దిగుమతి చేసుకున్న వంటనూనెల ధరలను వారం రోజుల్లోగా లీటరుకు రూ. 10 వరకూ తగ్గించాలని తయారీ సంస్థలను కేంద్రం ఆదేశించింది. అలాగే, ఒక బ్రాండ్ ఆయిల్‌పై దేశవ్యాప్తంగా ఒకే ఎంఆర్పీ (గరిష్ట చిల్లర ధర) ఉండాలని సూచించింది. వంటనూనెల తయారీ సంస్థలు, అసోసియేషన్లతో బుధవారం భేటీ అయిన సందర్భంగా కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే ఈ విషయాలు తెలిపారు. గడిచిన వారం రోజుల్లోనే అంతర్జాతీయంగా రేట్లు 10 శాతం తగ్గడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించాలని, ఎంఆర్పీని తగ్గించాలని సూచించినట్లు ఆయన చెప్పారు. పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి దిగుమతి చేసుకునే అన్ని రకాల వంటనూనెల ధరలను వారం రోజుల్లోగా తగ్గిస్తామని ప్రధాన తయారీ సంస్థలన్నీ హామీ ఇచ్చినట్లు వివరించారు. ఆ తర్వాత మిగతా నూనెల ధరలనూ తగ్గిస్తామని తెలిపినట్లు పాండే చెప్పారు. జూలై 6 నాటి గణాంకాల ప్రకారం పామాయిల్ సగటు రిటైల్ ధర (లీటరుకు) రూ. 144.16, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 185.77, సోయామీన్ ఆయిల్ రూ. 185.77, ఆవ నూనె రూ. 177.37, పల్లీ నూనె రూ. 187.93గాను ఉంది. మరోవైపు, తూకం విషయంలోనూ వస్తున్న ఫిర్యాదులపై కూడా తయారీ సంస్థలతో చర్చించినట్లు వివరించారు. 15 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్యాకింగ్ చేసినప్పుడు 910 గ్రాముల పరిమాణం ఉన్నట్లు ప్యాకెట్లపై కంపెనీలు ముద్రిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఆ ఉష్ణోగ్రతల్లో ఆయిల్ వ్యాకోచించడం వల్ల వాస్తవ బరువు 900 గ్రాములే ఉంటుందన్నారు. ఇలాంటివి జరగకుండా 30 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్యాకింగ్ చేయాల్సి ఉంటుందని పాండే వివరించారు. -
మార్ట్ లో మాయాజాలం.. ఎమ్మార్పీ కన్నా డబుల్..
సాక్షి, సిరిసిల్ల: మార్ట్‌లో తక్కువ ధరలకు వస్తువులు దొరుకుతాయన్న కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తూ సిరిసిల్లలో ఎమ్మార్పీ కన్నా అధికంగా వసూలు చేయడం కలకలం రేపింది. లీగల్‌మెట్రాలజీ అధికారి రూపేశ్‌కుమార్ బుధవారం జరిపిన దాడుల్లో ఈ విషయం నిర్ధారణయ్యింది. ఆయన మాట్లాడుతూ పట్టణంలోని మోర్ సూపర్‌మార్ట్, రాఘవేంద్ర ఎలక్ట్రికల్స్‌తోపాటు మరో రెండు గ్యాస్‌స్టౌవ్‌లు విక్రయించే దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేసినట్లు తెలిపారు. మోర్ మార్టులో హార్లిక్స్ బాటిల్‌పై రూ.111 ధర ఉండగా ఓ కస్టమర్‌కు బిల్లులో రూ.114 వేశారు. అప్పటికే మార్టులో తనిఖీలు చేస్తున్న రూపేష్‌కుమార్ దృష్టికి సదరు కస్టమర్ ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మిగతా మూడు దుకాణాల్లో ఎమ్మార్పీ, తయారీదారు చిరునామాలు సరిగ్గా లేకపోవడంతో రూ.13వేలు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. వ్యాపారులు అధిక ధరలకు వస్తువులు అమ్మితే.. అడ్రస్ లేకుండా వస్తువులను అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: అమ్మపార్టీలో.. చిన్నమ్మ భయం -
ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు!
మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ నిబంధనులకు వ్యాపారులు యథేచ్ఛగా తూట్లు పొడుస్తున్నారు. అధిక రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి పొందిన మద్యం పాపుల్లోనే ఎమ్మార్పీ కన్నా ఎక్కువ మద్యం విక్రయాలు చేపట్టడం విస్మయానికి గురి చేస్తోంది. మద్యం దుకాణాల నిర్వహణకు కాలవ్యవధి ముగియడానికి ఇంకా నెలరోజులు మాత్రమే ఉండటంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. సెప్టెంబరు 30 వరకు మాత్రమే గడువు ఉండటంతో ఇష్టారాజ్యంగా ధరలను పెంచేసి మందు ప్రియుల జేబులకు చిల్లులు వేస్తున్నారు. సాక్షి, మహబూబ్‌నగర్ : మద్యం ప్రియుల జేబులకు చిల్లు పడుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సగానికి పైగా వైన్ షాపుల్లో మద్యం ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోతోంది. కూలింగ్ పేరిట బీర్లపై.. బ్రాండ్ల కొరత సృష్టించి లిక్కర్‌పై అదనంగా వడ్డిస్తూ వైన్‌షాపుల నిర్వాహకులు యథేచ్ఛగా మద్యం ప్రియులను దోచుకుంటున్నారు. బీరుపై రూ.10 నుంచి రూ.15 వరకు,లిక్కర్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.20 నుంచి రూ.40 వరకు ఎమ్మార్పీ కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ డబ్బులు ఎందుకు తీసుకుంటారని నిలదీస్తేచాలు.. ‘బీర్ కూల్ లేదని, అడిగిన బ్రాండ్ తమ వద్ద లేదు’ అని మద్యం విక్రయించేందుకు నిరాకరిస్తున్నారంటూ మద్యం ప్రియులు వాపోతున్నారు. చేసేదేమీ లేక వైన్‌షాపు నిర్వాహకులు అడిగినంత ఇ చ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి జి ల్లాలో దాదాపు సగానికి పైగా షాపుల్లో మద్యం ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోతున్నా.. ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సాక్ష్యాత్తు.. ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాకాలోనే మద్యం అడ్డగోలు ధరలకు అమ్ముడుపోతుందనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. టెండర్ గడువు సమీపిస్తుందనే.. ప్రతి ఏటా మద్యం టెండర్లు నిర్వహించి వాటిని దక్కించుకున్న వారికి ఏడాది కాలానికి అగ్రిమెంట్ మేరకు దుకాణాలు కేటాయించేవారు. అయితే.. 2017 నుంచి అగ్రిమెంట్ కాలాన్ని రెండు సంవత్సరాలుగా నిర్ణయించి టెండర్లు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో 164 దుకాణాలకు టెండర్లు నిర్వహించి దుకాణాలు అలాట్ చేశారు. వీరిలో టెండర్ పొందిన వారికి అక్టోబర్ 1, 2017 నుంచి సెప్టెంబర్ 30, 2019 వరకు అగ్రిమెంట్ చేసి మద్యం దుకాణాలు కే టాయించారు. ప్రతి నెలా సుమారుగా రూ.130 కోట్ల నుంచి రూ.140 కోట్ల వరకు విలువైన మ ద్యం అమ్ముడుపోతోంది. టెండర్ల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో టెండర్దారులంతా కుమ్మక్కై ఇష్టారీతిగా ధరలు పెంచి మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఇదీలా ఉంటే మద్యం టెండర్ల గడువు రెండేళ్లుగా పెంచడం.. వరుస ఎన్నికల తో ఉమ్మడి జిల్లాలో అమ్మకాలు ఊహకందనంతగా జరిగాయి. మొదట్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై అధికార యంత్రాంగం కొంత కఠినంగా వ్యవహరించింది. దీంతో అప్పట్లో మద్యం అమ్మకాలు నిబంధనల మేరకు జరిగాయి. ఎన్నికల సమయంలో అధిక ధరలకు మద్యం విక్రయించిన వారిపై చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. ఎన్నికల తర్వాత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో వ్యాపారులు మళ్లీ మద్యం విక్రయాలు ఎమ్మార్పీ కంటే అమ్ముకుంటున్నారు. ఇదీలా ఉంటే మద్యంషాపు టెండర్ పొందిన వ్యక్తికి దుకాణంతో పాటు పర్మిట్ రూం నడిపించేందుకు అనుమతి ఉంటుంది. అయితే పర్మిట్ రూంలో కూర్చోడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయకూడదనే నిబంధన ఉంది. కాని చాలా చోట్ల వ్యాపారులు అమ్మకాలు పెంచుకునేందుకు పర్మిట్ రూంలలో సిట్టింగ్‌తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేయండి మద్యం షాపుల్లో ఎమ్మార్పీల మేరకే విక్రయాలు జరగాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ధరలకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు. ఎక్కడైనా ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నట్లు తెలిస్తే వినియోగదారులు ఆయా పరిధిలో ఉన్న సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. – జయసేనారెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ -
ఊ'ధర'గొట్టుడేనా..!
అబ్కారీ కమిషనర్ సీరియస్ కావడంతో మద్యం ఎమ్మార్పీపై దృష్టి పెడుతున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. అయితే అబ్కారీ శాఖ మంత్రిగా కొత్తపల్లి జవహర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో ఆ శాఖ అధికారుల కన్నా మద్యం సిండికేట్లదే పైచేయిగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ కూడా అధికారపార్టీ నేతల అండదండలతో ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరలకు మద్యం అమ్మకాలు సాగించారు. ఇప్పుడు కూడా జిల్లాలో ఎక్కువ ధరలకే మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎమ్మార్పీని అమలు చేసేనా అనే సందేహం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: పోలింగ్ తర్వాత ఎమ్మార్పీ ఉల్లంఘనలపై కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో గురువారం ఆయా జిల్లాల అధికారులతో అబ్కారీ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మద్యం విక్రయాలకు సంబంధించి గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ)ని పాటించకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారం పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఉల్లంఘనులపై కొరడా ఝుళిపించాలని నిర్ణయించారు. బెల్ట్‌షాపులు, పర్మిట్ రూమ్‌ల పేరుతో జరుగుతున్న దందాలపై కూడా దృష్టి పెట్టాలని కమిషనర్ ఆదేశించారు. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలో ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో మొత్తం 470 వరకూ దుకాణాలు ఉన్నాయి. బార్లు మొత్తం 40 వరకూ ఉన్నాయి. జిల్లాలో అధికారపార్టీకి చెందిన వారే మద్యం వ్యాపారంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం, స్వయంగా ఆ శాఖ మంత్రి జిల్లావాడు కావడం, ఆయన ముఖ్య అనుచరులే సిండికేట్లకు నాయకత్వం వహించడంతో అనధికారికంగా మద్యం బాటిల్‌పై రూ.10 నుంచి రూ. 20 వరకు పెంచి మద్యంవ్యాపారులు అమ్ముకుంటున్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు అబ్కారీ అధికారులే మౌఖిక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. పర్మిట్ రూముల్లోనూవారి చెప్పినంత ఇవాల్సిందే. పర్మిట్ రూమ్ అంటే లోపల మద్యం కొనుకున్నవాడు తాగి వెళ్లిపోవాలి. వసతులేమీ ఉండకూడదు. అయితే పర్మిట్ రూమ్‌ల పేరుతో అనుమతి తీసుకుని బార్లను తలపించేలా సిట్టింగ్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో కొత్త సంస్కృతికి అధికార పార్టీ నేతలు తెరలేపారు. బెల్ట్‌షాపులకు అనుబంధంగా దాబాలను ఏర్పాటు చేశారు. గోపన్నపాలెంలో షాపునకు అనుబంధంగా కల్యాణమండపం అద్దెకు తీసుకుని దాన్ని పర్మిట్‌రూమ్‌గా మార్చేశారు. పక్కన ఒక దాబా. దుగ్గిరాల బైపాస్ వద్ద ఒక దాబాలో సిట్టింగ్ బెల్ట్‌షాపు, చింతలపూడి బైపాస్‌లో దాబా కూడా బెల్ట్‌షాపులా నడుస్తోంది. ఏలూరు చుట్టుపక్కలగ్రామాల్లో బెల్ట్‌షాపులతోపాటు దాబాల ను అక్కడి ప్రజాప్రతినిధి ఏర్పాటు చేయించారు. జిల్లాలోని అన్ని మద్యం దుకాణాల్లో దాదాపుగా సిట్టింగ్ రూములు ఉన్నాయి. అర్ధరాత్రి కూడా దుకాణాల్లో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఇక్కడ మద్యం క్వార్టర్‌పై అదనంగా రూ. 30 నుంచి రూ. 50 వరకు పెంచి విక్రయిస్తున్నారు. పోలీసులకు, ఎక్సైజ్ శాఖకు నెలవారీ మామూళ్లు ఇస్తుండటం వల్లే మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ ఉల్లంఘన, అర్ధరాత్రి అమ్మకాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో మద్యం దుకాణాల వేళలపై కొంత నియంత్రణ ఉంది. ఉదయం ఆరు గంటలకు తీసి రాత్రి 12 గంటల వరకూ నడిచేవి. అయితే ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ నడుస్తున్నాయి. జిల్లాలో స్పెషల్ డ్రైవ్.. ఎమ్మార్పీ ఉల్లంఘనుల ఆట కట్టించేందుకుæ అధికారులు రంగంలోకి దిగారు. వారంపాటు ఎన్ఫోర్స్మెంట్తోపాటు ఎస్టీఎఫ్ బృందాలు సం యుక్తంగా కలిసి దాడులు చేయబోతున్నాయి. ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే షాపుల లైసెన్సులను సస్పెండ్ చేస్తారు. విచారణ తర్వాత శాశ్వతంగా రద్దు చేస్తారు. దృష్టిపెట్టాం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకు మించి అదనంగా మద్యాన్ని విక్రయిస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. అలాంటి షాపులపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తాం. అలాగే ఎవరైనా ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే ఆ దుకాణాలపైనా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.– వైబీ భాస్కరరావు,డిప్యూటీ కమిషనర్, అబ్కారీ శాఖ -
చట్టపరంగానే మల్టీప్లెక్స్‌లపై చర్యలు
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో వరుస దాడులకు సంబంధించి పూర్తిగా చట్ట నిబంధనలకు లోబడే వ్యవహరిస్తున్నామని తూనికలు, కొలతల శాఖ హైకోర్టుకు స్పష్టం చేసేందుకు సిద్ధమైంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం చట్టపరంగానే మల్టీప్లెక్స్‌ల్లో తనిఖీలు నిర్వహించామని, తనిఖీల సమయంలో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించామని, దీనికి ఆధారాలు, వివరాలను తెలుపుతూ రెండ్రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ సమర్పించనుంది. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై తూనికలు, కొలతల శాఖ గత కొన్ని రోజులుగా తనిఖీలు నిర్వహించి, వందకు పైగా కేసులు నమోదు చేసింది. మరోవైపు తూనికలు కొలతల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేసులు నమోదు చేస్తున్నా పదే పదే నిబంధనలు ఉల్లంఘించడంతో అధికారులు బిల్లింగ్ సిస్టంలను జప్తు చేశారు. ఈ తనిఖీలు నిలుపుదల చేయాలని పీవీఆర్ మల్టీప్లెక్స్, బిల్లింగ్ సిస్టంలను జప్తు చేయవద్దని, తనిఖీలు ఆపాలని ఐనాక్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఐనాక్స్ యాజమాన్యం వేసిన పిటిషన్‌పై తనిఖీల నిలుపుదలకు హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తూనికలు, కొలతల శాఖ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఒకటి రెండు రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయబోతున్నట్లు తెలిసింది. హైకోర్టులో స్టే వెకేషన్ పిటిషన్ ఫైల్ చేస్తున్నట్లుగా తెలిసింది. -
‘ఎమ్మార్పీ’పై ఫిర్యాదుల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై వినియోగదారుల నుంచి భారీ ఎత్తున తూనికల కొలతల శాఖకు ఫిర్యాదులు అందుతున్నా యి. పాప్‌కార్న్, వాటర్‌బాటిల్, కూల్‌డ్రింక్స్, ఇతర తినబండారాల ఎమ్మార్పీ ధరలపై వినియోగదారులు ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదుల కోసం అందుబాటులో ఉంచిన టోల్ ఫ్రీ నంబర్ 1800 425 00333, వాట్సాప్ 7330774444లకు ఇప్పటికే 274 ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా పాప్‌కార్న్ చిన్న ప్యాక్ ధరను రూ.150 నుంచి రూ.200కు అమ్ముతు న్నారని, సమోసాలకు ఒక్కోదానిపై రూ.50 నుంచి రూ.75 వరకు ఎమ్మార్పీ పేరుతో వసూ లు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. ‘బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్ ఐనాక్స్‌లో తినుబండారాల ధరల్లో మార్పు లేదు. ఇక్కడ చిన్న సైజు పాప్‌కార్న్ కప్ రూ.210 వసూలు చేశారు. మేనేజ్మెంట్ నిర్ణయం మేరకే ధర నిర్ణయిస్తున్నామని చెబుతున్నారు’ అని ఒకరు ఫిర్యాదు చేశారు. ఉప్పల్‌లోని ఏసియన్ థియేటర్లో 750 ఎంఎల్ వాటర్ బాటిల్ రూ.25 ఎమ్మార్పీకి అమ్ముతున్నారని మరొకరు వాట్సా ప్ ద్వారా ఫిర్యాదు చేశారు. పీవీఆర్ పంజాగుట్టలోనూ బేకరి ఐటమ్‌ను టిక్కెట్‌తోపాటే విక్రయిస్తూ రూ.230 వసూలు చేస్తున్నారని మరో ఫిర్యాదు వచ్చింది. ముఖ్యంగా ఎమ్మార్పీ ధరలకే విక్రయిస్తున్నామంటూ అన్ని రకాల తినుబండారాలు, కూల్డ్రింక్స్పై ధరలు పెంచేస్తున్నారని, ఇది మరో దోపిడీ అంటూ వినియోగదారులు మొరపెట్టుకుంటున్నారు. కొరడా ఝళిపిస్తోన్న తూనికల శాఖ వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై తూనికలు కొలతల శాఖ కొరడా ఝళిపిస్తోంది. 17 మల్టీప్లెక్స్‌ల్లో ఆదివారం తూనికల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 12 మల్టీప్లెక్స్‌లపై 15 కేసులు నమోదు చేశారు. ఏసియన్ ముకుంద మేడ్చల్–1, సినిమా మంత్ర శంషాబాద్–2, పీవీఆర్ గెలీలియో–2, మహాలక్ష్మి కొత్తపేట–1, మిరాజ్ దిల్సుఖ్నగర్–1, జీవీకే వన్–1, సినిమా మంజీరామాల్ కూకట్పల్లి–1, బీవీఆర్ విజయలక్ష్మి ఎల్బీనగర్–1, రాధిక థియేటర్ ఎస్రావు నగర్–1, ఐనాక్స్ కాచిగూడ–2, ఏసియన్ సినిమా కూకట్పల్లి–1, ఏసియన్ షహీన్‌షా చింతల్–1 మల్టీప్లెక్స్‌లపై కేసులు నమోదు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి, వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న మల్టీప్లెక్స్‌లు, థియేటర్లపై ఇప్పటివరకు మొత్తం 107 కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
మల్టీప్లెక్స్‌ల దోపిడీపై దాడులు షురూ
సాక్షి, హైదరాబాద్: సినిమా హాళ్లలో తినుబండారాల ధరల నియంత్రణ కోసం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై తూనికలు, కొలతల శాఖ దాడులు ముమ్మరం చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్న హైదరాబాద్‌లోని పలు మల్టీప్లెక్స్‌లలో తనిఖీలు చేసి కేసులు నమోదు చేసింది. 20 మల్టీప్లెక్స్‌లలో తనిఖీలు నిర్వహించిన బృందాలు.. తినుబండారాలనుఅధిక ధరలకు విక్రయిస్తున్న 18 మల్టీప్లెక్స్‌లపై 54 కేసులు నమోదు చేశాయి. బంజారాహిల్స్‌లోని జీవీకే–1పై 6, కాచిగూడలోని బిగ్ సినిమాపై 6, ప్రసాద్ ఐమాక్స్‌పై 2, పీవీఆర్ గెలీలియోపై 3, మాదాపూర్‌లోని పీవీఆర్ ఐకాన్‌పై 3, కొత్తపేట మహాలక్ష్మిపై 3, మల్కాజ్గిరి సీనీపోలీస్‌పై 5, సుజానాఫోరం మాల్‌పై 2, కూకట్పల్లి ఆసియాన్‌పై 4, జేఎన్టీయూ మంజీరా మాల్‌పై 3, కొంపల్లిలోని ఆసియాన్ సినీప్లానెట్, మేడ్చల్‌లోని ఆసియాన్ ముకుందాపై 3 కేసుల చొప్పున నమోదయ్యాయి. అధిక ధరలపై టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444కు వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు. -
ఆగని గోల్ ‘మాల్స్’
సాక్షి,హైదరాబాద్: మల్టీప్లెక్స్ థియేటర్లు, మెగామాల్స్ల్లో నిర్దేశించిన ధరలకే అన్ని రకాల వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయం తొలిరోజు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. నగరంలోని మల్టీప్లెక్స్‌లు, ఇతర మాల్స్ల్లో ఇష్టారీతిన సాగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఎంఆర్పీ ధరలకే అమ్మాలంటూ తూనికలు, కొలతల శాఖ ఆదేశించిన నేపథ్యంలో ‘సాక్షి’బృందాలు బుధవారం నగరంలో వివిధ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని రికార్డు చేశాయి. ప్యాక్ చేసిన కొన్ని వస్తువులపై ఎంఆర్పీ అమలు చేసిన నిర్వాహకులు అనేక ఆహార పదార్థాలపై మాత్రం ఇష్టారీతిన స్టిక్కర్లు వేసి అమ్మకాలకు పెట్టారు. బుధవారం, గురువారం నాటి ధరలకు పెద్దగా తేడా లేదని ఆయా మాల్స్ల్లో సందర్శకులు పెదవి విరిచారు. ఐఎస్ఐ బ్రాండ్ లీటర్ మంచినీళ్ల ధర బహిరంగ మార్కెట్లో రూ.19. కానీ, నెక్లెస్‌రోడ్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో మాత్రం రూ. 25. 400 ఎంఎల్ కోకాకోల ధర రూ.70. ఎగ్‌పఫ్ రూ.50, సమోసా 40. పాప్‌కార్న్ రూ.160లకు విక్రయించారు. కూకట్‌పల్లిలోని మంజీరా మాల్, సినీపోలిస్, ఫోరం మాల్, పీవీఆర్ సినిమాల్లో తినుబండారాల ధరలు పాత పద్ధతిలోనే కొనసాగాయి. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను ఎమ్మార్పీకి విక్రయిస్తూ విడిగా ఆర్డర్ చేసే ఆహార పదార్థాలు, పాప్‌కార్న్ లాంటివి వందల్లో విక్రయించారు. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ కంబైన్డ్ అప్‌సైజ్ కపుల్ కాంబోను జీఎస్టీ ధరలతో కలిపి రూ.495 వసూలు చేశారు. ధరల సూచికలో పేర్కొన్న వాటి కంటే ఎక్కువగానే వసూలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. ఫోరం మాల్లో తాగునీరు, కూల్‌డ్రింక్స్ మాత్రమే ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తూ మిగతావి తమ సొంత నిర్ణీత ధరలకు అమ్మారు. ఆహార పదార్థాల పరిమాణం తదితర వివరాలను ప్రత్యేకంగా పేర్కొన్న దాఖలాలులేవు. ఈ విషయమై స్థానికంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాత్రం అధికారులు ప్రత్యేకంగా ప్యాకేజ్డ్ ఫుడ్ ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని నిబంధనల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ప్యాకింగ్ లేని ఆహార పదార్థాల విషయంలో నిబంధనలు తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరించడం విశేషం. నిబంధనలు ఏం చెబుతున్నాయి తినుబండారాలు, మంచినీటి బాటిళ్లు, కూల్డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి .విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతోపాటు ఎంఆర్పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలి. సెప్టెంబర్ 1 నుంచి స్టిక్కర్ స్థానంలో ఎంఆర్పీ, పరిమాణం, బరువు కచ్చితంగా ముద్రించి ఉండాలి. ఇవన్నీ ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలి. ధర మారితే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలి. ఒకే బ్రాండ్ తినుబండారాలు కాకుండా వివిధ బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలి. ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎంఆర్పీ, కస్టమర్ కేర్ వివరాలు ఉంచాలి. అలాగే ఎమ్మార్పీ ధర ఉన్న ఫుడ్స్ మాత్రమే విక్రయించాలి. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042 500333, వాట్సాప్ నంబర్ 7330774444ను విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలి. ధరల్లో మార్పు లేదు మల్టీప్లెక్స్‌లో వివిధ వస్తువుల ధరల్లో మాత్రం మార్పు కనిపించలేదు. తిను బండారాలకు ఇష్టానుసారం ధర నిర్ణయించారు. గతంలో స్టిక్కర్ ఉండకపోయేది. ఇప్పుడు కొత్తగా స్టిక్కర్ అంటించి దర్జాగా దోపిడీ చేస్తున్నారు. – మణికుమార్, చింతల్ అడ్డగోలు ధరలతో స్టిక్కర్లు మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లలో విక్రయించే వస్తువులపై అడ్డగోలు ధరల స్టిక్కర్లు అంటించారు. బయట ధరలతో పోలిస్తే రెండు, మూడింతలు అధికమే. శీతల పానీయాల ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. –రవితేజ, కూకట్పల్లి ధరలపై నియంత్రణ లేదు మల్టీప్లెక్స్‌లో ధరలపై నియంత్రణ లేదు. ఎమ్మార్పీ అమలును పక్కదారి పట్టించేవిధంగా ప్రైస్ స్టిక్కర్లు అంటించారు. నాణ్యత పేరుతో ధరల దోపిడీకి పాల్పడుతున్నారు. ధరలపై నియంత్రణ అవసరం. తినుబండారాలపై నిర్ణీత ధర నిర్ణయించాలి. –ఉమర్, విజయనగర్ కాలనీ ఇష్టారాజ్యంగా తినుబండారాల ధరలు... వాటర్ బాటిళ్లు, కూల్డ్రింక్స్పై ఎమ్మార్పీ ముద్రించి ఉంటుంది కనుక గుర్తించగలుగుతున్నాం. తినుబండారాలపై ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ధరలపై అవగాహన ఉండకపోవడంతో అడిగినంత ఇస్తున్నాం. ప్రభుత్వం తినుబండారాల పరిమాణం, ధరలను కూడా నిర్ధారించడం ద్వారా అక్రమ విక్రయాలను అడ్డుకోవాలి. – సంజీవ, మూసాపేట అధిక ధరలు కట్టడి చేస్తాం మల్టీప్లెక్, సినిమా థియేటర్లలో వివిధ వస్తువుల అధిక ధరలను కట్టడి చేస్తాం. ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు నిబంధనల ఉల్లంఘనే. బయట మార్కెట్ ధరలతో సమానంగా మల్టీప్లెక్, సినిమా థియేటర్లలో అమలు చేయాలి. ఎమ్మార్పీ అమలుపై రేపటి నుంచి తనిఖీలు నిర్వహిస్తాం. భారీ జరిమానాలకు వెనుకాడబోం. –జగన్మోహన్, అసిస్టెంట్ కంట్రోలర్,తూనికలు, కొలతల శాఖ -
రేపటి నుంచి థియేటర్లపై దాడులు!
సాక్షి, హైదరాబాద్ : సామాన్యుడు సినిమా హాల్‌కు వెళ్లే పరిస్థితి కనబడటం లేదు. ఇక సినిమాకు వెళ్దామని అనుకుంటే అదెంత ఖర్చుతో కూడుకున్న పనో తెలిసిన విషయమే. థియేటర్లో ఆకలేస్తే తినుబండారాలు కొంటే మోతమోగిపోతుంది. వాటిపై ఉండే ధరలు వేరు.. యాజమాన్యం అమ్మే ధరలు వేరు. ఇలాంటి విక్రయాలు నేరం అంటూ హెచ్చరికలు జారీ చేసినా.. ఫలితం మాత్రం శూన్యమంటూ సినీ ప్రేమికులు వాపోతున్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా, నిబంధనలు ఉన్నా.. ధరల్లో మార్పులేదని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి థియేటర్ల లో ఎంఆర్పీ ధరలకే విక్రయాలు జరపాలని తూనికలు, కొలతలశాఖ ఆదేశాలు జారీ చేశారు.ఆగస్టు రెండు, మూడు తేదీల్లో సినిమా హాల్స్ పై దాడులు చేయనున్నట్లు తూనికలు, కొలతల శాఖ అధికారులు తెలిపారు. -
సినిమా ప్రేక్షకులకు ఊరట
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లలో ధరల దూకుడుకు కళ్లెం పడనుంది. వినోదం కోసం వచ్చే వినియోగదారుల నుంచి వివిధ వస్తువులపై అధిక ధరలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు రావడంతో అడ్డగోలు ధరలపై తూనికలు, కొలుతల శాఖ కన్నెర్ర చేసింది. బుధవారం (ఆగస్టు ఒకటి) నుంచి సినిమా హాల్స్, మల్టీప్లెక్సుల్లో మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎమ్మార్పీ ప్రకారమే విక్రయాలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు కఠినతరం చేసింది. కనీసం ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా ఇకపై భారీ మూల్యం చెల్లించక తప్పదు. విడిగా విక్రయించే తినుబండారాలు, పానీయాలకు సంబంధించి ధర, పరిమాణం వివరాలు స్టిక్కర్ రూపంలో కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాతో పాటు జైలుపాలు కావాల్సిందే. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ. 25 వేలుజరిమానా విధిస్తారు. రెండోసారి నిబంధనల ఉల్లంఘనకు రూ.50 వేలు, మూడోసారి రూ.లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని తూనికలు, కొలుతల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అడ్డగోలు దోపిడీ సినిమా హాల్స్, మల్టీప్లెక్స్‌లలో తినుబండారాలు అధిక ధరలకు విక్రయించడం సర్వసాధారణంగా తయారైంది. దీంతో గత కొంత కాలంగా ప్రేక్షకుల నుంచి లీగల్ మెట్రాలజీ శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో అధిక ధరల విక్రయానికి అడ్డుకట్ట వేయడానికి తూనికల కొలతల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఆయా ప్రాంతాలలోని థియేటర్ యాజమాన్యాలతో ఏరియా వారిగా సమావేశాలు నిర్వహించి అధిక ధరల దోపిడీని కట్టడిచేయాలని సూచించారు. కొత్త నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు. నిబంధనలు ఇలా... ⇔ వినియోగదారుల కోసం ఉద్దేశించిన ఏ వ్యాపారం కానీ, ఏ సేవ కానీ, ఏ వినోదం కానీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జరగాలి. ఈ విషయంలో ఏ ఒక్క వినియోగదారుడికి నష్టం జరిగేలా థియేటర్ల యాజమాన్యాలు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవు. ⇔ ఆగస్టు 1వ తేదీ నుండి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో ఎంఆర్పీ ప్రకారం విక్రయాలు జరపాలి. తినుబండారాలు, మంచి నీటి బాటిళ్లు, కూల్డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి. ⇔ విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎంఆర్పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలి. ⇔ సెప్టెంబర్ 1వ తేదీ నుండి స్టిక్కర్ స్థానంలో ఎంఆర్పీ, పరిమాణం, బరువు కచ్చితంగా ముద్రించి ఉండాలి. ఇవన్నీ ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలి. ధర మారితే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలి. ⇔ ఒకే బ్రాండ్ తినుబండారాలు కాకుండా వినియోగదారుడికి వివిధ బ్రాండ్లు అందుబాటులో ఉంచాలి. ⇔ ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎంఆర్పీ, కస్టమర్ కేర్ వివరాలు ⇔ ఎమ్మార్పీ ధర ఉన్న ఫడ్స్ మాత్రమే విక్రయించాలి. ⇔ వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సప్ నంబర్ 7330774444ను విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలి. రెండు రోజులు తనిఖీలు... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బహిరంగ మార్కెట్లో ఏదైతే ఎంఆర్పీ ఉందో అదే ధరకు మల్టీప్లెక్స్, థియేటర్లల్లో కూడా విక్రయించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎంఆర్పి ధర ప్రకారమే విక్రయిస్తున్నారా, ఇతరత్రా కొత్త నిబంధనల అమలుపై బుధ, గురువారాల్లో తూనికల, కొలుతల శాఖ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పరిశీలించనున్నాయి. అనంతరం ఆకస్మిక తనిఖీలతో కేసుల నమోదు, జరిమానాలు విధించనున్నారు. -
అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 1 నుంచి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లలో మంచినీటి బాటిళ్లు, శీతలపానీయాలు, ఇతర తినుబండారాలు ఎంఆర్పీ ప్రకార మే విక్రయాలు జరిపేలా తూనికలు కొలతల శాఖ దృష్టిపెట్టింది. ఎంఆర్పీ కంటే అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా.. తూనికల కొలతల శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా భారీ జరి మానాతో పాటు జైలు శిక్ష విధించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. విడిగా విక్రయించే తినుబండారాలు, పానీయాలకు సంబంధించి ధర, పరిమాణం వివరాలు స్టిక్కర్ రూపంలో కచ్చితంగా నమోదు చేసేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదుల నేపథ్యంలో.. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా కొంతకాలంగా ప్రేక్షకుల నుంచి తూనికల శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో అధిక ధరలకు అడ్డుకట్ట వేయడానికి తూనికలు కొలతల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని థియేటర్ యాజమాన్యాలకు అవగాహన కల్పించింది. కొత్త నిబంధనలపై అకున్ సబర్వాల్ సమీక్ష థియేటర్లలో అధిక ధరల విక్రయాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, కొత్త నిబంధనల అమలుపై కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆదివారం గాంధీనగర్ లోని తూనికల కొలతల శాఖ కార్యాలయంలో అన్ని జిల్లాల అసిస్టెంట్ కంట్రోలర్లు, ఇన్స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారుల కోసం ఉద్దేశించిన వ్యాపారం, సేవ, వినోదం ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నారు. ఏ ఒక్క వినియోగదారుడికి నష్టం జరిగేలా థియేటర్ల యాజమాన్యాలు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విడిగా అమ్మే తినుబండారాలు, అందించే కం టైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎంఆర్పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలన్నారు. ఇవన్నీ ప్రేక్షకులకు స్పష్టంగా కని పించేలా బోర్డుపై ప్రదర్శించాలని, ధర మారితే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలన్నారు. ఒకే బ్రాండ్ తినుబండారాలు కాకుండా వినియోగదారుడి కి వివిధ బ్రాండులు అందుబాటులో ఉంచాలన్నారు. తూనికలు కొలతల శాఖ చట్టం ప్రకారం ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు తదితర వివరాలు ఉండాలని తెలిపారు. 4, 5 తేదీల్లో తనిఖీలు.. కొత్త నిబంధనల అమలుపై ఆగస్టు 2, 3 తేదీ ల్లో గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలోని థియేటర్లు, మల్టీప్లెక్సు ల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని అకున్ సబర్వాల్ తెలిపారు. అనంతరం 4, 5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఒకే ధర విధానాన్ని అమలు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ.25 వేల ఫైన్, రెండోసారి రూ.50 వేల ఫైన్, మూడోసారి రూ.లక్ష జరిమానాతో పాటు 6 నెలల నుంచి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444ను విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలని చెప్పారు. -
ఆ మందులు ఇక చౌక
సాక్షి,న్యూఢిల్లీ: గుండె జబ్బులు, హెపటైటిస్ సీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల అథారిటీ(ఎన్పీపీఏ) 51 మందుల ధరలను 53 శాతం వరకూ తగ్గిస్తూ తాజా మార్గదర్శకాలను వెలువరించింది. ఫార్మా కంపెనీలు తాజా పరిమితికి మించి తమ ఉత్పత్తులను విక్రయిస్తుంటే వెంటనే వాటిని తగ్గించాలని ఎన్పీపీఏ ఆదేశించింది.నూతన పరిమితుల నేపథ్యంలో ఆయా మందుల ధరలు 6 నుంచి 53 శాతం వరకూ దిగివస్తాయని ఎన్పీపీఏ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఔషధ ధరలకు సంబంధించిన నూతన పరిమితులు, గరిష్ట చిల్లర ధరల(ఎంఆర్పీ)పై ఎన్పీపీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు వాడే ఔషధాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో వీటి ధరలపై నియంత్రణ విధించినట్టు అధికారులు తెలిపారు. -
ఎమ్మార్పీ దాటితే చర్యలు
మహబూబ్‌నగర్ క్రైం: వస్తువులపై, బాటిల్స్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా.. జీఎస్టీ లేకున్నా ఉన్నట్లు బిల్లులో జోడించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నల్లగొండ జోన్ అసిస్టెంట్ కంట్రోలర్ టి.రామకృష్ణ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ముందుగా బాలానగర్‌లోని కిల్‌పార్క్ హోటల్లో తనిఖీలు చేయగా ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. అలాగే ఎం ఫుడ్కోర్ట్, ఆకాష్ గ్రాండ్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరుకు తనిఖీలు చేసి.. కేసులు నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌లోని సింధూ హోటల్లో సైతం అన్నింటిపై ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.5–10 వసూలు చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేయండి.. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు గత నెల 27 నుంచి ఎమ్మార్పీపై, జీఎస్టీపై తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీని కలిపి అదనంగా వినియోగదారులపై భారం మోపుతున్నారని ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఒక వస్తువును కొనుగోలు చేసే సమయంలో వస్తువ ఎమ్మార్పీ ఎంత ఉందో వినియోగదారులు చూసుకోవాలని ఆ ధర మాత్రమే చెల్లించాలన్నారు. ఎక్కడైనా ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నట్లు అయితే సెల్ నం. 9490165619కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యాపారులు ఎక్కడా మాల్ ప్రాక్టీసింగ్‌కు పాల్పడరాదని చట్టప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దక్కని జీఎస్టీ ఫలితాలు.. జీఎస్టీ తగ్గిన వస్తువుల ధరలను వినియోగదారులకు ఫలితం దక్కకుండా పాత ధరలకు అమ్ముతున్నారని అలాంటి వారిపై నిఘా పెట్టినట్లు చెప్పారు. అక్టోబర్ 27 నుంచి ఇప్పటి వరకు 200 కేసులతోపాటు రూ.72 లక్షల జరిమానా విధించామన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పాడి అదనపు ధరలపై తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇక నుంచి ప్రతినెలలో ఓసారి ఉమ్మడి జిల్లాలో దాడులు చేపడుతామన్నారు. ఉత్పత్తి చేసే కంపెనీ చిరునామా.. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ తప్పక ఉండాలన్నారు. ప్రధానంగా పెట్రోల్ బంకులు, పెద్ద పెద్ద వస్త్ర దుకాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. దాడులు చేసిన బృందంలో మహబూబ్‌నగర్ డీఎల్‌ఎంఓ రవీం దర్ ఇతర సిబ్బంది ఉన్నారు. -
మత్తు వదలరా!
మామూళ్ల అందుతున్నాయో కూడా స్పష్టం చేస్తున్నారు. ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జీవన్‌సింగ్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే జిల్లాలో ఎమ్మార్పీకే విక్రయాలు జరపే చర్యలకు మాత్రం ఉపక్రమించలేదు. అధిక ధరలపై పత్రికల్లో కథనాలు వచ్చినా, ప్రజాప్రతినిధులు ఏకంగా ఈ శాఖ మంత్రికే ఫిర్యాదు చేసినా అధికారులు తీరు మాత్రం ఇసుమంతైనా మారలేదు. ప్రతీ నెలా భారీగా మామూళ్లు వస్తుండటంతో, ఎవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా అధికారులు మాత్రం ‘ఎమ్మార్పీ’ అంశంలో ఒక్కమెట్టు కూడా వెనక్కు తగ్గడం లేదు. జిల్లాలో అక్రమ ఆదాయం ఇలా..: జిల్లా వ్యాప్తంగా 233 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దుకాణంలో రోజూ సగటున 650 బాటిళ్లు(బీరుతో కలిపి)విక్రయిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై 10-15 రూపాయల అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో దుకాణానికి రోజుకు 6,500-9,750 రూపాయల చొప్పున నెలకు 1,95-2.92లక్షల రూపాయల అదనపు ఆదాయం వస్తోంది. అంటే 233 దుకాణాల ద్వారా ప్రతీ నెలా 4.54 నుంచి 6.81కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తోంది. చూసేందుకు 10-15 రూపాయలు చిన్న మొత్తమైనా ఇది ప్రతీ నెలా ఏస్థాయిలో వసూలవుతుందో పై లెక్కలు చూస్తే ఇట్టే తెలుస్తుంది. ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు ఇలా..: అధిక ధరలకు విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇచ్చినందుకు ప్రతీ నెలా మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులకు 41 వేల రూపాయల మామూళ్లు ముట్టజెపుతున్నట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు. ప్రతీ నెలా..ఎక్సైజ్‌స్టేషన్‌కు 30 వేలు, స్క్వాడ్‌కు 6వేలు, ఈఎస్‌కు 5వేలు రూపాయలు ఇవ్వాలని చెబుతున్నారు. వీరంతా కలిసి ఇందులో కొంత జిల్లాలో ఆశాఖ ఉన్నతాధికారికి ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా దుకాణం పరిధిలోని ట్రాఫిక్, సాధారణ పోలీసులకు 15-20 వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు. దీంతో పాటు బార్ అండ్ రెస్టారెంట్ కూడా మామూళ్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ఎక్సైజ్ స్టేషన్‌కు 15 వేలు, స్క్వాడ్‌కు 3 వేలు, ఈఎస్‌కు 3 వేల రూపాయలు ఇస్తున్నట్లు కొందరు బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. గల్లాపెట్టె నింపుకునేందుకు మద్యం వ్యాపారులు, మామూళ్ల కోసం ‘వయోలేషన్’ను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారుల దెబ్బకు మద్యం బాబుల జేబులు గల్లవుతున్నాయి. పైగా ‘న్యూయర్’ సందర్భంగా విక్రయాలకు మరింత స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31 రాత్రి మరింత అధిక ధరలకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. డాబాల్లో మద్యం విక్రయాలకు అనుమతి లేదు. అయినా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. రేపు రాత్రి కోసం ఇప్పటికే చాలాడాబాల్లో మద్యం కేసులను నిల్వ ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు కూడా వీరి ‘గ్రీన్‌సిగ్నల్’ ఇచ్చినట్లు రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. డీసీ జీవన్ సింగ్ ఏమన్నారంటే: ‘‘ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ‘వయోలేషన్’ను ఎక్సైజ్ అధికారులే ప్రోత్సహిస్తున్నారనే అంశంపై మీటింగ్ నిర్వహించి ఆరా తీస్తా!’’ -
కలెక్షన్ ఫుల్ !
కర్నూలు : సామాన్యుడు సేవించే ఛీప్ లిక్కరైనా.. ధనవంతులు తాగే బ్రాండేడ్ మద్యమైనా ఎమ్మార్పీ కంటే అదనంగా చెల్లించాల్సిందే. రూ.75 ధర ఉన్న ఛీప్ లిక్కర్ బాటిళ్లను రూ.80లకు, రూ.110 ధర పలికే క్వార్టర్ బాటిల్‌పై రూ.10 అదనంగా మద్యం దుకాణదారులు వసూలు చేస్తున్నారు. రూ.95 పలికే బీర్‌ను దుకాణాల్లో రూ.110, బార్లలో రూ.120 నుంచి 130 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కారణంగా వారికి కూడా నెల మాముళ్లు ముట్టతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఖర్చు తగ్గినా అమలు కాని ఎమ్మార్పీ... ఏ మద్యం వ్యాపారిని కదిపినా ఇందులో భారీగా నష్టపోతున్నామని చెబుతుంటారు. ఖర్చు తగ్గినప్పుడు ధర కూడా తగ్గాలనే ప్రశ్నకు మాత్రం జవాబు దాటవేస్తారు. ఉదాహరణకు మండల కేంద్రం వెల్దుర్తిలో మద్యం దుకాణానికి 2010లో నిర్వహించిన వేలంలో రూ.4 కోట్లకు దక్కించుకున్నారు. జిల్లాలో అప్పుడు అది రికార్డు. గత నెల చివరి వారంలో ఇదే దుకాణానికి నిర్వహించిన లక్కీ డిప్లో రూ.32.5 లక్షల స్లాబ్లకు వచ్చింది. కోట్ల వ్యయం నుంచి లక్షల్లోకి తగ్గినప్పటికీ వ్యాపారులు మాత్రం మద్యం ధరలను పెంచుతూనే ఉన్నారు. కొందరు వ్యాపారులు సిండికేట్‌గా మారి మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. గతంలో దుకాణాల వారీగా కల్లూరులోని ఐఎంఎల్ డిపో నుంచి లారీల్లో మద్యాన్ని రవాణా చేసుకునేవారు. ట్రాన్స్‌పోర్టు చార్జీలు తగ్గించుకునేందుకు ఎక్కడికక్కడే వ్యాపారులు సిండికేట్‌గా మారి మూడు, నాలుగు దుకాణాలకు కలిపి ఒకే వాహనం ద్వారా మద్యం సరఫరా చేసుకుంటూ ఖర్చులు తగ్గించి లాభాలు గడుస్తున్నారు. జిల్లాలోని 90 శాతం పైగా మద్యం దుకాణాదారులు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఒక్కొక్కరికో లేక్క.. ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయాలు జరపాలంటూ ప్రభుత్వం నిబంధనలు విధించిన ప్పటికీ జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. మద్యం అధిక ధరలను నియంత్రించేందుకు గాను జిల్లాలో 14 ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీ ధరలను అమలు చేయాల్సిన బాధ్యత స్టేషన్ అధికారులతో పాటు కొత్తగా ఏర్పాటైన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ విభాగంపై ఉంది. నిఘా వేసి నియంత్రించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ప్రతి ఎక్సైజ్ స్టేషన్‌కు నెలకు రూ.10 నుంచి రూ.15 వేలు, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి రూ.5 వేలు, డీటీఎఫ్‌కు రూ.5 వేలు, ఒక్కొక్క దుకాణం నుంచి మామూళ్లు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. సివిల్ పోలీసులకు కూడా ఒక్కొక్క దుకాణం నుంచి రూ.10 నుంచి రూ.15 వేల దాకా మామూళ్లు ముట్టజెప్పుతున్నారు. ఈ లెక్కన ప్రతి మద్యం దుకాణం నుంచి ఎక్సైజ్, సివిల్ పోలీసులకు కలిపి నెలకు రూ.50 వేలు మామూళ్ల రూపంలో ముట్టజెప్పుతున్నారు. దీంతో వ్యాపారులు యదేచ్ఛగా ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. నిబంధనలకు పాతర.. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు పలు నిబంధనలు ఉన్నాయి. పాఠశాలలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలకు వంద మీటర్ల దూరంలో మద్యం దుకాణం, పర్మిట్ రూం ఏర్పాటు చేసుకోకూడదు. ఈ నిబంధన చాలా చోట్ల తుంగలో తొక్కారు. గార్గేయపురంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోనే మద్యం దుకాణాన్ని ప్రారంభించారు. జొహరాపురంలో మద్యం దుకాణం ఏర్పాటును గ్రామస్తులంతా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాలు ఎక్సైజ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాత షాపులు మార్చినందుకు దుకాణదారుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఇంకా బెల్టుషాపులు యథాతధంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.