సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో వరుస దాడులకు సంబంధించి పూర్తిగా చట్ట నిబంధనలకు లోబడే వ్యవహరిస్తున్నామని తూనికలు, కొలతల శాఖ హైకోర్టుకు స్పష్టం చేసేందుకు సిద్ధమైంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం చట్టపరంగానే మల్టీప్లెక్స్‌ల్లో తనిఖీలు నిర్వహించామని, తనిఖీల సమయంలో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించామని, దీనికి ఆధారాలు, వివరాలను తెలుపుతూ రెండ్రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ సమర్పించనుంది.
థియేటర్లు, మల్టీప్లెక్స్‌లపై తూనికలు, కొలతల శాఖ గత కొన్ని రోజులుగా తనిఖీలు నిర్వహించి, వందకు పైగా కేసులు నమోదు చేసింది. మరోవైపు తూనికలు కొలతల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేసులు నమోదు చేస్తున్నా పదే పదే నిబంధనలు ఉల్లంఘించడంతో అధికారులు బిల్లింగ్ సిస్టంలను జప్తు చేశారు.
ఈ తనిఖీలు నిలుపుదల చేయాలని పీవీఆర్ మల్టీప్లెక్స్, బిల్లింగ్ సిస్టంలను జప్తు చేయవద్దని, తనిఖీలు ఆపాలని ఐనాక్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఐనాక్స్ యాజమాన్యం వేసిన పిటిషన్‌పై తనిఖీల నిలుపుదలకు హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తూనికలు, కొలతల శాఖ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఒకటి రెండు రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయబోతున్నట్లు తెలిసింది. హైకోర్టులో స్టే వెకేషన్ పిటిషన్ ఫైల్ చేస్తున్నట్లుగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment