సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లలో ధరల దూకుడుకు కళ్లెం పడనుంది. వినోదం కోసం వచ్చే వినియోగదారుల నుంచి వివిధ వస్తువులపై అధిక ధరలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు రావడంతో అడ్డగోలు ధరలపై తూనికలు, కొలుతల శాఖ కన్నెర్ర చేసింది. బుధవారం (ఆగస్టు ఒకటి) నుంచి సినిమా హాల్స్, మల్టీప్లెక్సుల్లో మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎమ్మార్పీ ప్రకారమే విక్రయాలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు కఠినతరం చేసింది. కనీసం ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా ఇకపై భారీ మూల్యం చెల్లించక తప్పదు.
విడిగా విక్రయించే తినుబండారాలు, పానీయాలకు సంబంధించి ధర, పరిమాణం వివరాలు స్టిక్కర్ రూపంలో కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాతో పాటు జైలుపాలు కావాల్సిందే. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ. 25 వేలుజరిమానా విధిస్తారు. రెండోసారి నిబంధనల ఉల్లంఘనకు రూ.50 వేలు, మూడోసారి రూ.లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని తూనికలు, కొలుతల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అడ్డగోలు దోపిడీ
సినిమా హాల్స్, మల్టీప్లెక్స్‌లలో తినుబండారాలు అధిక ధరలకు విక్రయించడం సర్వసాధారణంగా తయారైంది. దీంతో గత కొంత కాలంగా ప్రేక్షకుల నుంచి లీగల్ మెట్రాలజీ శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో అధిక ధరల విక్రయానికి అడ్డుకట్ట వేయడానికి తూనికల కొలతల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఆయా ప్రాంతాలలోని థియేటర్ యాజమాన్యాలతో ఏరియా వారిగా సమావేశాలు నిర్వహించి అధిక ధరల దోపిడీని కట్టడిచేయాలని సూచించారు. కొత్త నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు.
నిబంధనలు ఇలా...
⇔ వినియోగదారుల కోసం ఉద్దేశించిన ఏ వ్యాపారం కానీ, ఏ సేవ కానీ, ఏ వినోదం కానీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జరగాలి. ఈ విషయంలో ఏ ఒక్క వినియోగదారుడికి నష్టం జరిగేలా థియేటర్ల యాజమాన్యాలు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవు.
⇔ ఆగస్టు 1వ తేదీ నుండి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో ఎంఆర్‌పీ ప్రకారం విక్రయాలు జరపాలి. తినుబండారాలు, మంచి నీటి బాటిళ్లు, కూల్‌డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి.
⇔ విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎంఆర్‌పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలి.
⇔ సెప్టెంబర్ 1వ తేదీ నుండి స్టిక్కర్ స్థానంలో ఎంఆర్‌పీ, పరిమాణం, బరువు కచ్చితంగా ముద్రించి ఉండాలి. ఇవన్నీ ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలి. ధర మారితే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలి.
⇔ ఒకే బ్రాండ్ తినుబండారాలు కాకుండా వినియోగదారుడికి వివిధ బ్రాండ్లు అందుబాటులో ఉంచాలి.
⇔ ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎంఆర్‌పీ, కస్టమర్ కేర్ వివరాలు
⇔ ఎమ్మార్పీ ధర ఉన్న ఫడ్స్ మాత్రమే విక్రయించాలి.
⇔ వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సప్ నంబర్ 7330774444ను విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలి.
రెండు రోజులు తనిఖీలు...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బహిరంగ మార్కెట్‌లో ఏదైతే ఎంఆర్‌పీ ఉందో అదే ధరకు మల్టీప్లెక్స్, థియేటర్లల్లో కూడా విక్రయించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎంఆర్‌పి ధర ప్రకారమే విక్రయిస్తున్నారా, ఇతరత్రా కొత్త నిబంధనల అమలుపై బుధ, గురువారాల్లో తూనికల, కొలుతల శాఖ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పరిశీలించనున్నాయి. అనంతరం ఆకస్మిక తనిఖీలతో కేసుల నమోదు, జరిమానాలు విధించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment