ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు! | Liquor Shoppers Charges More Than MRP Rate On Liquor | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు!

Published Sat, Aug 31 2019 12:03 PM | Last Updated on Sat, Aug 31 2019 12:05 PM

Liquor Shoppers Charges More Than MRP Rate On Liquor - Sakshi

మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ నిబంధనులకు వ్యాపారులు యథేచ్ఛగా తూట్లు పొడుస్తున్నారు. అధిక రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి పొందిన మద్యం పాపుల్లోనే ఎమ్మార్పీ కన్నా ఎక్కువ మద్యం విక్రయాలు చేపట్టడం విస్మయానికి గురి చేస్తోంది. మద్యం దుకాణాల నిర్వహణకు కాలవ్యవధి ముగియడానికి ఇంకా నెలరోజులు మాత్రమే ఉండటంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. సెప్టెంబరు 30 వరకు మాత్రమే గడువు ఉండటంతో ఇష్టారాజ్యంగా ధరలను పెంచేసి మందు ప్రియుల జేబులకు చిల్లులు వేస్తున్నారు. 

సాక్షి, మహబూబ్‌నగర్‌ : మద్యం ప్రియుల జేబులకు చిల్లు పడుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సగానికి పైగా వైన్‌ షాపుల్లో మద్యం ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోతోంది. కూలింగ్‌ పేరిట బీర్లపై.. బ్రాండ్ల కొరత సృష్టించి లిక్కర్‌పై అదనంగా వడ్డిస్తూ వైన్‌షాపుల నిర్వాహకులు యథేచ్ఛగా మద్యం ప్రియులను దోచుకుంటున్నారు. బీరుపై రూ.10 నుంచి రూ.15 వరకు,లిక్కర్‌పై బ్రాండ్‌ను బట్టి రూ.20 నుంచి రూ.40 వరకు ఎమ్మార్పీ కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ డబ్బులు ఎందుకు తీసుకుంటారని నిలదీస్తేచాలు.. ‘బీర్‌ కూల్‌ లేదని, అడిగిన బ్రాండ్‌ తమ వద్ద లేదు’ అని మద్యం విక్రయించేందుకు నిరాకరిస్తున్నారంటూ మద్యం ప్రియులు వాపోతున్నారు. చేసేదేమీ లేక వైన్‌షాపు నిర్వాహకులు అడిగినంత ఇ చ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి జి ల్లాలో దాదాపు సగానికి పైగా షాపుల్లో మద్యం ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోతున్నా.. ఎక్సైజ్‌ అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సాక్ష్యాత్తు.. ఎక్సైజ్‌ శాఖ మంత్రి ఇలాకాలోనే మద్యం అడ్డగోలు ధరలకు అమ్ముడుపోతుందనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది.  

టెండర్‌ గడువు సమీపిస్తుందనే..  
ప్రతి ఏటా మద్యం టెండర్లు నిర్వహించి వాటిని దక్కించుకున్న వారికి ఏడాది కాలానికి అగ్రిమెంట్‌ మేరకు దుకాణాలు కేటాయించేవారు. అయితే.. 2017 నుంచి అగ్రిమెంట్‌ కాలాన్ని రెండు సంవత్సరాలుగా నిర్ణయించి టెండర్‌లు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో 164 దుకాణాలకు టెండర్లు నిర్వహించి దుకాణాలు అలాట్‌ చేశారు. వీరిలో టెండర్‌ పొందిన వారికి  అక్టోబర్‌ 1, 2017 నుంచి సెప్టెంబర్‌ 30, 2019 వరకు అగ్రిమెంట్‌ చేసి మద్యం దుకాణాలు కే టాయించారు. ప్రతి నెలా సుమారుగా రూ.130 కోట్ల నుంచి రూ.140 కోట్ల వరకు విలువైన మ ద్యం అమ్ముడుపోతోంది. టెండర్ల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో టెండర్‌దారులంతా కుమ్మక్కై ఇష్టారీతిగా ధరలు పెంచి మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఇదీలా ఉంటే మద్యం టెండర్ల గడువు రెండేళ్లుగా పెంచడం.. వరుస ఎన్నికల తో ఉమ్మడి జిల్లాలో అమ్మకాలు ఊహకందనంతగా జరిగాయి. మొదట్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై అధికార యంత్రాంగం కొంత కఠినంగా వ్యవహరించింది.

దీంతో అప్పట్లో మద్యం అమ్మకాలు నిబంధనల మేరకు జరిగాయి. ఎన్నికల సమయంలో అధిక ధరలకు మద్యం విక్రయించిన వారిపై చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. ఎన్నికల తర్వాత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో వ్యాపారులు మళ్లీ మద్యం విక్రయాలు ఎమ్మార్పీ కంటే అమ్ముకుంటున్నారు. ఇదీలా ఉంటే మద్యంషాపు టెండర్‌ పొందిన వ్యక్తికి దుకాణంతో పాటు పర్మిట్‌ రూం నడిపించేందుకు అనుమతి ఉంటుంది. అయితే పర్మిట్‌ రూంలో కూర్చోడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయకూడదనే నిబంధన ఉంది. కాని చాలా చోట్ల వ్యాపారులు అమ్మకాలు పెంచుకునేందుకు పర్మిట్‌ రూంలలో సిట్టింగ్‌తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.  

ఫిర్యాదు చేయండి
మద్యం షాపుల్లో ఎమ్మార్పీల మేరకే విక్రయాలు జరగాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ధరలకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు. ఎక్కడైనా ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నట్లు తెలిస్తే వినియోగదారులు ఆయా పరిధిలో ఉన్న సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. 
– జయసేనారెడ్డి, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement