ముగిసిన మద్యం టెండర్ల ప్రక్రియ | Liquor Tender Process Completed In Mahabubnagar | Sakshi
Sakshi News home page

ముగిసిన మద్యం టెండర్ల ప్రక్రియ

Published Sat, Oct 19 2019 7:53 AM | Last Updated on Sat, Oct 19 2019 7:53 AM

Liquor Tender Process Completed In Mahabubnagar - Sakshi

లక్కీడిప్‌కు హాజరైన టెండర్‌దారులు

సాక్షి, నాగర్‌కర్నూల్‌ క్రైం: నూతన మద్యం పాలసీ 2019–21 కి సంబంధించి దుకాణాల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. లాటరీ పద్ధతిలో కేటాయింపు జరిగింది.  జిల్లా కేంద్రంలోని సుఖజీవన్‌రెడ్డి గార్డెన్‌ ప రిసరప్రాంతంలో ఉదయం నుంచే కోలాహలం గా కనిపించింది. జిల్లాలోని 45 మద్యం దుకాణాలకు 1,064 టెండర్లు దాఖలయ్యాయి. లాట రీలో అదృష్టం వరించిన వారు సంబరాల్లో మునిగిపోగా దక్కని వారు నిరాశతో వెనుదిరిగారు. 

ఉదయం నుంచి టెన్షన్‌టెన్షన్‌ 
జిల్లాలోని 45 మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ పద్ధతి ద్వార ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జేసీ  శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి నుంచి వచ్చిన స్పెషల్‌ ఆఫీసర్‌ ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఈఎస్‌ గంగారాం ఆధ్వర్యంలో ప్రక్రియ నిర్వహించారు. ప్రతి మద్యం  దుకాణానికి సంబంధించి టెండర్‌ దారుల ముందే లాటరీ తీసి డ్రాలో వచ్చిన వారికి   దుకాణాన్ని కేటాయించారు. జిల్లాలోని 45 దుకాణాలకు 1,064 టెండర్లు రాగా డ్రాలో 40 మంది పురుషులకు, ఐదుగురు మహిళలకు దుకాణాలు దక్కించుకున్నారు.

జిల్లా పరిధిలోని వంగూరు మద్యం దుకాణానికి అధికంగా 62 దరఖాస్తులు రాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన జూలూరి నరేందర్‌ మద్యం షాపును దక్కించుకున్నారు. దుణాలను దక్కించుకున్న యజమానులు 1/8 వంతు లైసెన్సు ఫీజును ఎక్సైజ్‌ శాఖకు చెల్లించాల్సి ఉండగా మద్యం వ్యాపారులు అక్కడే ఏర్పాటు చేసిన బ్యాంకు కౌంటర్లలో నగదును చెల్లించారు. లైసెన్సు దక్కించుకున్నవారు నవంబర్‌ 1వ తేదీ నుంచి దుకాణాలను ప్రారంభించాల్సి ఉంది.  

స్థానికులకే దక్కిన దుకాణాలు  
ఈ ఏడాది ప్రభుత్వం రూ.2 లక్షలకు లైసెన్సు ఫీజును పెంచినా ఎన్నో ఏళ్లుగా మద్యం వ్యాపారంలో కొనసాగుతున్న వారితోపాటు కొత్తవారు సైతం తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిండికేట్‌గా మారారు. ఒక్కో సిండికేట్‌ నుంచి 20 నుంచి 30 దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం.

సిండికేట్‌గా మారిన మద్యం వ్యాపారులకు జిల్లాలో పలు షాపులు దక్కాయి. నాగర్‌కర్నూల్‌ సర్కిల్‌ పరిధిలోని 12 షాపులకు గాను స్థానికులే షాపులు దక్కించుకున్నారు. కొల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని 7 దుకాణాలకు  గాను 5 స్థానికులకు వచ్చాయి.

కొల్లాపూర్‌ దుకాణం మాత్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి, పెంట్లవెల్లి దుకాణం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి దక్కించుకున్నారు. అలాగే తెలకపల్లి సర్కిల్‌ పరిధిలోని 5 దుకాణాలకు గాను లింగాల షాపు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి, 4 షాపులు ఉమ్మడి జిల్లాకు చెందిన వారు దక్కించుకున్నారు. కల్వకుర్తి సర్కిల్‌ పరిధిలోని 11 షాపులకు గాను 8 షాపులు స్థానికులు దక్కించుకోగా, 2 షాపులు గుంటూరుకు చెందిన వ్యక్తులు, ఒక షాపు రంగారెడ్డికి చెందిన వ్యక్తి దక్కించుకున్నారు. అచ్చంపేట సర్కిల్‌ పరిధిలోని 10 షాపులకు గాను 8 షాపులు స్థానికులకే రాగా 2 మాత్రం  నల్గొండ జిల్లాకు చెందిన వారికి వచ్చాయి. 

ఎందరికో నిరాశ 
టెండర్లలో జిల్లా వాసులతోపాటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు  జిల్లాలో చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు టెండర్లు దాఖలు చేయగా శుక్రవారం తీసిన లాటరీలో షాపులు దక్కక పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అదేవిధంగా ఈ ఏడాది మద్యం దుకాణాలకు మద్యం వ్యాపారులు వారి భార్యలు, కుటుంబంలోని లక్కున్న ఆడవారితో టెండర్లు వేయించగా కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం వచ్చింది. మిగతా వారు నిరాశతో వెనుదిరిగారు.  

ఉదయం నుంచే కోలాహలం  
జిల్లా కేంద్రంలోని సుఖజీవన్‌రెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించిన మద్యం దుకాణాల డ్రా కోసం ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది. భారీస్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. టెండర్‌దారులు, మద్యం వ్యాపారులు, వారి మిత్రులు చేరుకోవడంతో జాతరను తలపించింది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పాసులు ఉన్న వారిని మాత్రమే పోలీసులు క్షుణ్ణంగా తనిఖీచేసి లోనికి అనుమతించారు.

డ్రా జరిగే ప్రదేశంలో వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేయక పోవడంతో రోడ్లపైనే వాహనాలను నిలిపివేశారు. డ్రా తీసే పరిసర ప్రాంతలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆరీఫ్‌పాష, ఎక్సైజ్‌సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement