ఓ టీవీ సీరియల్‌లో నటిస్తున్న రాఘవ
సాక్షి, మహబూబ్‌నగర్: కష్టాన్ని నమ్ముకుంటే ఏదో ఒకరోజు ఫలితం ఉంటుందని నిరూపించాడు నాగర్‌కర్నూల్‌కు చెందిన రాఘవ. తాను పడ్డ పదేళ్ల కష్టానికి నేడు బుల్లితెర హీరో అయ్యాడు. కొందరు స్నేహితుల సహకారంతో నేడు ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారమవుతున్న గీతగోవిందం సీరియల్‌లో హీరోగా.. రంగులరాట్నం అనే మరో సీరియల్‌లోనూ సెకండ్ లీడ్‌రోల్‌లో నటిస్తున్నారు.
షార్ట్ ఫిలిమ్స్ నుంచి..
రాఘవ డిగ్రీ వరకు నాగర్‌కర్నూల్‌లోనే చదివారు. 2012లో కొందరు స్నేహితులతో కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశారు. 2013లో హైదరాబాద్ బస్సెక్కా రు. అక్కడ జ్ఞానేశ్వర్ అనే షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్‌తో కొన్నాళ్లు కథలు రాశారు. అయిదేళ్ల పాటు మోడలింగ్, షార్ట్‌ఫిలిమ్స్‌లోనూ ప్రయత్నాలు చేశారు.
టిక్‌టాక్‌తోనే..
స్నేహితుడు శేఖర్ సలహా మేరకు 2018లో టిక్‌టాక్‌లో అడుగుపెట్టి సుమారు 250 వీడియోలు చేశారు. ఈ వీడియోలతో తెలుగు రాష్ట్రాల కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాఘవకు మంచి పేరొచ్చిందనే చెప్పాలి. తన ఫిజిక్, నటన సూర్యను పోలి ఉండటంతో జూనియర్ సూర్య అంటూ కామెంట్లు మేలు చేశాయి. వీడియోలు చూసిన ఓ డైరెక్టర్ ఫోన్‌లో సంప్రదించి అవకాశం ఇచ్చారు.
చదవండి: ‘గృహలక్ష్మి’ సీరియల్ నా జీవితానికి టర్నింగ్ పాయింట్..
మొదటిసారి యాడ్‌లో..
దీపక్ అనే యాడ్స్ డైరెక్టర్ కడపకు చెందిన పీఎస్‌కే టీ పౌడర్ యాడ్‌లో నటించేందుకు అవకాశం ఇవ్వడంతో 2019లో యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇదే ఏడాది నందగోకుల్ నెయ్యికి సంబంధించిన యాడ్‌లోనూ నటించారు.
సీరియల్స్‌లో అవకాశం..
2020 అక్టోబర్ 2న మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి రాఘవకు ఫోన్ వచ్చింది. గీతగోవిందం సీరియల్‌లో హీరో కావాలని.. ఆడిషన్స్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. సెలెక్టయినా లాక్‌డౌన్ రావడంతో ఈ ప్రాజెక్టు వాయిదాపడింది. 2021లో అనిల్ అనే డైరెక్టర్ రంగులరాట్నం సీరియల్ తీస్తుండడంతో అందులో సెకండ్ హీరోగా రాఘవను ఎంపిక చేయగా మొదట ఇదే సీరియల్ టెలికాస్ట్ అయింది. జనవరి 2, 2022న గీతగోవిందం ప్రారంభం కాగా ఫిబ్రవరి 2న సీరియల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
హీరో అవ్వడమే లక్ష్యం..
ప్రస్తుతం రెండు సీరియల్స్‌లో నటిస్తున్నా. వీటితో పాటే ఇతర ప్రయత్నాలు చేస్తున్నా. సినీ హీరో అవ్వడమే లక్ష్యం. ఈ ప్రయాణంలో చాలామంది స్నేహితులు సహకరించారు. ప్రోత్సహించడమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. వారి సహకారం ఎప్పటికీ మర్చిపోను.
– రాఘవ, సీరియల్ హీరో
Comments
Please login to add a commentAdd a comment