సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఓ ఇద్దరు కల్లు డిపోల నిర్వాహకులు..ఓ మద్యం వ్యాపారి..ఓ నకిలీ లిక్కర్ తయారీదారు.. ఉమ్మడి పాలమూరులో కల్తీ కల్లు, నకిలీ మద్యం దందాకు కేరాఫ్ వీళ్లేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి ఓ అధికారి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన ఓ ఎక్సైజ్ అధికారి కనుసన్నల్లో సిబ్బంది నిర్బంధ వసూళ్లకు పాల్పడుతుండగా, కల్లు డిపోల నిర్వాహకులు, మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
కల్లులో మత్తు కోసం కలిపే ఆల్ఫ్రాజోలం, సీహెచ్, డైజోఫాం.. లిక్కర్‌లో ఘాటు పెంచే స్పిరిట్ సరఫరా జోరుగా సాగుతోంది. మరోవైపు పేరున్న మద్యం బ్రాండ్లలో మూతలు తీసి నీరుపోసేందుకు ఓ ముఠా ఇటీవల సరిహద్దులు దాటి వచ్చి ఐదు జిల్లాల్లో కార్యకలాపాలు విస్తరించింది. అయినా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నిద్ర‘మత్తు’వీడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార’పార్టీ నేతల బినామీలే కల్తీ కల్లు, నకిలీ మద్యం దందా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ చేతులెత్తేసిందనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలో మద్యం, కల్లు కల్తీ రాకెట్ సూత్రధారులు, పాత్రధారులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం..
ఇద్దరి కీలక పాత్ర
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నారాయణ పేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా లకు ఆ్రల్ఫాజోలం, సీహెచ్, డైజోఫాం సరఫరా చేయడంలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకతో పాటు ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఈ నిషేధిత పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా జిల్లాకు దిగుమతి చేసుకుంటున్నారు. ఎవరికి వారు జిల్లాలు, మండలాలు, ప్రాంతాల వారీగా పంచుకుని ఏజెంట్లను పెట్టుకుని కోడ్ భాష ఆధారంగా సరుకును ఆయా డిపోలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
నువ్వా? నేనా?
మహబూబ్‌నగర్ పట్టణ శివారులో ఆ ఇద్దరికి సంబంధించిన కల్లు కాంపౌండ్‌లు దగ్గర దగ్గరగా ఉన్నాయి. అటు నిషేధిత మత్తు పదార్థాల రవాణాతో పాటు సదరు కాంపౌండ్‌లలో కల్లు విక్రయాల్లో కూడా ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఇందులో ఒకరికి పట్టణ ప్రధాన కూడలిలో టైర్ల షాపు ఉంది. ఇతను తన పోటీదారుడిని, అతడి కాంపౌండ్‌లోకి కల్లు తాగేందుకు వెళ్లేవారిని బౌన్సర్లతో నిత్యం బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అండదండలు తనకే ఉన్నాయని సదరు వ్యక్తి దబాయిస్తుండగా, ప్రస్తుతం ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వార్ నడుస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ పంచాయితీ సదరు ముఖ్యనేత వద్దకు చేరడంతో, తాను సమస్య పరిష్కరిస్తానని, గొడవలు పడొద్దని మందలించినట్లు సమాచారం.
బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో నీళ్లు!
ఇక ఉమ్మడి జిల్లాలో చీప్ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా సాగుతుండడంతో వాటిలో స్పిరిట్ కలుపుతూ కల్తీ చేస్తున్నారు. అంతేకాదు వైన్స్‌లతోపాటు బార్లలో బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన లిక్కర్ బాటిళ్లలో 40 శాతం మేర మద్యం తీసి నీరు కలుపుతున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక ఓ మద్యం వ్యాపారి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యాపారి ఆధ్వర్యంలోనే వికారాబాద్ నుంచి వచి్చన ఎవరూ కనిపెట్టని విధంగా లిక్కర్ మూతలు తీసి, పెట్టే గ్యాంగ్ పాలమూరులో కార్యకలాపాలను విస్తరించినట్లు సమాచారం.
మునుగోడులో కల్తీ లిక్కర్ వెనుక గద్వాల కింగ్!
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కల్తీ లిక్కర్ ఏరులై పారింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దీన్ని గుర్తించిన అధికారులు కూపీ లాగారు. అనుమతి లేకుండా డిస్టిలరీ ఏర్పాటు చేసి నకిలీ మద్యం ఉమ్మడి నల్లగొండతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు తరలించినట్లు సమాచారం. ఇందులో బాలరాజుగౌడ్ కీలకంగా వ్యవహరించగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గద్వాల జిల్లా పాతపాలెంకి చెందిన లిక్కర్ కింగ్ వెంకన్నగౌడ్ హస్తం కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
కాగా ఇతను కర్ణాటక లిక్కర్‌ను తెలంగాణ, ఏపీకి అక్రమంగా తరలిస్తూ పలుమార్లు పోలీసులకు చిక్కగా ఇరు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తన స్వగ్రామమైన పాతపాలెంలో నకిలీ మద్యం తయారు చేస్తూ కూడా పట్టుబడ్డాడు. గతేడాది నవంబర్‌లో రూ.10 లక్షల విలువ చేసే 750 కిలోల సీహెచ్‌ను హైదరాబాద్‌లో కొనుగోలు చేసి కర్నూలుకు తరలిస్తున్న క్రమంలో భూత్పూర్ సమీపంలో పట్టుకున్నారు. ఇటీవల ఆయనపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ బైండోవర్‌తో సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment