Kalti Kallu Victims Increasing In Mahbubnagar District - Sakshi
Sakshi News home page

‘కల్తీ’ కల్లు కల్లోలం! మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న బాధితులు

Published Wed, Apr 12 2023 7:43 AM | Last Updated on Wed, Apr 12 2023 10:13 AM

Kalti Kallu Victims Increasing In Mahbubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌:  ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం సృష్టిస్తోంది. కల్తీ కల్లు (మందు కల్లు) తాగి అస్వస్థతకు గురై మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నెల ఏడో తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 32 మంది రాగా.. 23 మంది వరకు అప్పటికప్పుడే చికిత్స పొంది డిశ్చార్జి అయినట్లు సమాచారం.

అయితే దీనిని ఆస్పత్రి అధికారులు గానీ, ఎక్సైజ్‌ శాఖ గానీ ధ్రువీకరించడం లేదు. అయితే సోమవారం ఒక వ్యక్తి మరణించడం, ఇందుకు కల్తీ కల్లే కారణమనే అనుమానాలు వ్యక్తం కావడం కలకలం రేపుతోంది. కల్తీ కల్లు తాగిన మరో ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరి మృతి 
మహబూబ్‌నగర్‌ మండలం కోడూరు గ్రామానికి చెందిన హరిజన ఆశన్న (58) ఈ నెల పదో తేదీ తెల్లవారుజామున మరణించాడు. అతను ఈనెల 9న మధ్యాహ్నం దొడ్డలోనిపల్లిలోని దుకాణంలో కల్లు తాగాడని.. ఇంటికెళ్లిన తర్వాత పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడని సమాచారం. మాటలు తడబడడం, చేతులు, మూతి వంకర్లు తిరగడంతో రాత్రి 108 అంబులెన్స్‌లో బంధువులు అతడిని జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో చేర్చారు.

ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ ఆశన్న తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. వైద్యులు సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. అతడి తమ్ముడు బెంగళూరు నుంచి వచ్చేసరికి సమయం పట్టడంతో మంగళవారం దహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు, ఎక్సైజ్‌శాఖ గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

మరో ఇద్దరు ఐసీయూలో.. 
జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఐసీయూలో మరో ఇద్దరు కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన విష్ణుబాబు భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌లో పోస్టల్‌ శాఖలో ఏబీపీఎంగా చేస్తున్నాడు. ఆయనతో పాటు దొడ్డలోనిపల్లి గ్రామానికి చెందిన రేణుక ఐసీయూలో చికిత్స పొందుతోంది. విష్ణుబాబుకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. దొడ్డలోనిపల్లికి చెందిన రేఖతో పాటు మరో ఆరుగురికి సాధారణ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.  

ఆ్రల్ఫాజోలం మోతాదులో తేడా వల్లేనా.. 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా మందు కల్లు విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. కల్లులో ప్రధానంగా నిషేధిత మత్తు పదార్థం ఆ్రల్ఫాజోలంను కలుపుతున్నారు. అయితే మోతాదులో తేడా రావడం వల్లే బాధితులు పిచి్చపిచి్చగా ప్రవర్తిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన అందరిలో మెడ తిమ్మిర్లు, చేతులు వణకడం, తలవెనక్కి వాలడం, నాలుక బయటకు రావడం, నత్తి, శరీరంలో చలనం లేకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి.   

ఎవరూ కల్లు తాగి అడ్మిట్‌ కాలేదు.. 
కల్తీ కల్లు తాగి ఆస్పత్రిలో ఎవరూ ఆడ్మిట్‌ కావడం లేదు. కేవలం వింత వింత ప్రవర్తనతో పాటు ఫిట్స్‌ ఇతర సమస్యలతో వస్తున్నారు. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు దాదాపు 25 మంది వరకు ఇలాంటి లక్షణాలతో ఆడ్మిట్‌ అయ్యారు. వీరిలో కొందరికి ఊపిరితిత్తుల సమస్యతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు నిర్ధారించాం. అందరికీ కావాల్సిన చికిత్స అందించి డిశ్చార్జి చేయడం జరుగుతుంది. 
– డాక్టర్‌ రామకిషన్, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 

ఐదురోజులుగా ఆస్పత్రిలోనే.. 
మహబూబ్‌నగర్‌ పట్టణంలోని మోతీనగర్‌ ప్రాంతానికి చెందిన ఇంద్రజ ఈ నెల 7న కల్లు తాగి అస్వస్థతకు గురికావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ్మిట్‌ అయింది. ఆమె మాట్లాడలేని స్థితిలో ఉంది. సపర్యలు చేస్తున్న ఆమె తల్లి మాట్లాడుతూ.. ‘ఐదు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం..ఇంద్రజకు కల్లు తాగే అలవాటు ఉంది.. పిచి్చపిచి్చగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తీసుకొచ్చాం..’ అని తెలిపింది.
చదవండి: అదిరిపోయే ఎండలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement