
సాక్షి,విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన చంద్రన్న మాల్స్‌కు గ్రహణం పట్టింది. తగినంత ఆదాయం రాదని భావిస్తున్న డీలర్లు వీటిని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదు. ఏదో విధంగా మాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
స్పందన నిల్
జిల్లాలో 2,229 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. చంద్రన్న మాల్స్ వల్ల ఆదాయం బాగా ఉంటుందని డీలర్లు భావిస్తే.. ఇప్పటికే ఈ 2,229 మంది డీలర్లు తమకు చంద్రన్న మాల్ ఇప్పించాలంటూ దరఖాస్తు చేసుకునే వారు. డిమాండ్‌ను బట్టి ప్రజాప్రతినిధుల చేత అధికారులుపై ఒత్తిడి చేయించేవారు. వాటికి అంత సీను లేకపోవడంతో అధికారులే రంగంలోకి దిగి డీలర్ల చేత మాల్స్ పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలోని డీలర్ల అందరితోనూ పౌరసరఫరాలశాఖాధికారులు సమావేశాలు పెట్టి మాల్ ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనాలను ఏకరువు పెట్టారు. మాల్స్ పెట్టుకోవాలంటూ ప్రోత్సహించినా ఇప్పటివరకు 160 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 10 మండలాల నుంచి కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని సమాచారం.
కనీసం రెండు దుకాణాలు
విజయవాడలో రెండు నెలల కిందట మాల్ ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల మాల్స్ ఏర్పాటు చేయించాలంటూ ప్రభుత్వం నుంచి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఒకొక్క నియోజకవర్గంలో కనీసం రెండు దుకాణాలు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటుచేయించేందుకు కసరత్తు జరుగుతోంది. రెండవ విడతలో విజయవాడలో మూడు, ఆగిరిపల్లి, కలిదిండి, జీ.కొండూరులలో ఒకొక్కటి చొప్పున ఏర్పాటు చేయిస్తున్నారు. వీటిని మరో పక్షం రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది.
దుకాణం చూపిస్తే...
డీలర్లు 180 అడుగులు నుంచి 200 అడుగుల దుకాణం చూపిస్తే చాలు.. రిలయన్స్ సంస్థ ఆ దుకాణానికి టైల్స్ ఫ్లోరింగ్, సీలింగ్, ఎలక్ట్రిఫికేషన్, ర్యాక్స్ సమకూర్చుతుంది. ఇందులో విక్రయిం చేందుకు రూ.2లక్షలు సరుకు ఇస్తుంది. చౌకధరల దుకాణం ద్వారా విక్రయించే బియ్యాన్ని, ఇతర వస్తువులు డీలర్ విక్రయించుకోవచ్చు. డీలర్‌కు 8శాతం కమీషన్ ఇస్తారు. ఒకొక్క దుకాణం ఏర్పాటుకు కనీసం 25 రోజులు వ్యవధి పడుతుంది. ప్రతి రెండు మూడు రోజులకు విక్రయించిన సొమ్మును రిలయన్స్ సంస్థకు జమచేయాలి. నెల గడిచిన తరువాత కమీషన్ డీలర్ అకౌంట్‌కు వస్తుంది.
ప్రతిబంధకాలు ఇవే..
నగరం, పట్టణాలలోనూ 200 అడుగుల దుకాణం దొరకడం కష్టంగా వుంది. కనీసం రూ. 7 నుంచి రూ.10వేలు అద్దె చెల్లిస్తేనే అంత దుకాణం దొరుకుతుంది. డీలర్ రోజంతా దుకాణంలో కూర్చుని బేరం చూసుకోవాల్సి ఉంటుంది. 8శాతం మాత్రమే కమీషన్ ఇస్తున్నందున నెలకు కనీసం 2.5 లక్షల అమ్మితే రూ.20వేలు ఆదాయం వస్తుంది. అందులోనే దుకాణం అద్దె, కరెంటు బిల్లులు, డీలర్ జీతం చూసుకోవాల్సి ఉంటుంది. నగరాల్లో నెలకు రూ.2.5 లక్షలు అమ్మినా వచ్చే కమీషన్ సరిపోదు. గ్రామాల్లో ప్రతినెల రూ.2.5లక్షలు అమ్మడం కష్టమని డీలర్లు వాపోతున్నారు. అందువల్ల కమీషన్ పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రిటైల్స్ దుకాణాలతో పోల్చితే మాల్స్‌లో ధరలు ఎక్కువగా వుండటంతో ఎక్కువ మొత్తంలో విక్రయించడం కష్టమని అంటున్నారు. చౌకధరల దుకాణాలు నిర్వహించుకుంటే నెలకు 15 రోజులే పని ఉంటుంది. తరువాత ఖాళీయే కావడంతో ఇతర వనరుల ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు. మాల్స్‌లో ఈ సౌకర్యం లేకపోవడంతో డీలర్లు ఆసక్తి చూపడం లేదు.
అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయిస్తాం
16 నియోజకవర్గాల్లోనూ 32 చంద్రన్న మాల్స్ పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే డీలర్లతో సమావేశాలు పెట్టాం. మాల్స్ పెట్టమని ఒత్తిడి చేయడం లేదు. అవగాహన కల్పిస్తున్నాం. డీలర్లు ఎంత కష్టపడి పనిచేసుకుంటే అంత ఆదాయం వస్తుంది. పెట్టుబడి అవసరం లేదు. కేవలం దుకాణం ఉంటే చాలని చెబుతున్నాం. –నాగేశ్వరరావుజిల్లా పౌరసరఫరాలశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment