NielsenIQ: ‘మాల్స్‌’ విక్రయాల్లో భారత్‌ టాప్‌ | India delivering double-digit sales growth of FMCG, tech durables from modern trade channels | Sakshi
Sakshi News home page

NielsenIQ: ‘మాల్స్‌’ విక్రయాల్లో భారత్‌ టాప్‌

Published Sat, Aug 24 2024 5:25 AM | Last Updated on Sat, Aug 24 2024 5:25 AM

India delivering double-digit sales growth of FMCG, tech durables from modern trade channels

ఎఫ్‌ఎంసీజీ, టెక్‌ డ్యూరబుల్స్‌లో రెండంకెల వృద్ధి 

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో మొదటి స్థానం 

నీల్సన్‌ ఐక్యూ నివేదిక వెల్లడి  

న్యూఢిల్లీ: ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారా విక్రయాల్లో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే భారత్‌ అగ్రస్థానంలో ఉన్నట్టు నీల్సన్‌ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక అంగళ్లలో ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజీ డ్యూరబుల్స్‌ విక్రయాల పరంగా రెండంకెల వృద్ధి చూపిస్తున్న ఏకైక దేశం భారత్‌ అని.. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ, పండుగల విక్రయాలు ఇందుకు సాయపడుతున్నట్టు పేర్కొంది. 

40 శాతం ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు, 30 శాతం టెక్నాలజీ డ్యూరబుల్స్‌ విక్రయాలు ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారానే నమోదవుతున్నట్టు వెల్లడించింది. ఇది భారత వినియోగదారుల ప్రాధాన్యతలను తెలియజేస్తున్నట్టు నీల్సన్‌ ఐక్యూ నివేదిక పేర్కొంది. ఆన్‌లైన్‌ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తున్నా కానీ, భారత వినియోగదారులకు ఆధునిక అంగళ్లు (సూపర్‌ మార్కెట్లు, హైపర్‌ మార్కెట్లు, డిపార్ట్‌మెంట్‌ స్టోర్లు) ప్రాధాన్య మార్గాలుగా ఉన్నట్టు తెలిపింది. 

‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆధునిక వాణిజ్యం బలంగానే నమోదైంది. ధరల అస్థిరతలు ఉన్నప్పటికీ రండంకెల వృద్ధి నమోదైంది. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోంది’’అని ఈ నివేదిక వివరించింది. ఎఫ్‌ఎంసీజీ, టెక్‌ డ్యూరబుల్స్‌ విక్రయాలకు పండగల సీజన్‌ కీలకమని పేర్కొంది. 

ఈ కాలంలోనే ఎఫ్‌ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో 20 శాతం, టెక్నాలజీ డ్యూరబుల్స్‌ అమ్మక్లాలో 60 శాతం నమోదవుతున్నట్టు తెలిపింది. ఆహారోత్పత్తుల కంటే వీటి అమ్మకాలే ఆయా సీజన్‌లలో 1.8 రెట్లు అధికంగా ఉంటున్నట్టు పేర్కొంది. చిన్న తయారీ సంస్థల ఉత్పత్తులతోపాటు, రిటైలర్లు సొంతంగా నిర్వహించే ప్రైవేటు లేబుల్స్‌ రూపంలో పెద్ద కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది.  

ప్రైవేటు లేబుళ్ల అమ్మకాలు 
పెద్ద తయారీ సంస్థల ఉత్పత్తులతో పోలి్చతే ప్రవేటు లేబుళ్ల అమ్మకాలు (రిటైల్‌ సంస్థల సొంత ఉత్పత్తులు) 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక చిన్న తయారీ సంస్థలు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో 70 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి’’అని నీల్సన్‌ ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక చానళ్లలో సంప్రదాయంగా ఎఫ్‌ఎంసీజీలకు సంబంధించి పెద్ద ప్యాక్‌లకు ఆదరణ ఉంటుండగా, ఇది క్రమంగా చిన్న ప్యాక్‌ల వైపు మళ్లుతున్నట్టు వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement