Supermarkets
-
NielsenIQ: ‘మాల్స్’ విక్రయాల్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారా విక్రయాల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు నీల్సన్ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక అంగళ్లలో ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాల పరంగా రెండంకెల వృద్ధి చూపిస్తున్న ఏకైక దేశం భారత్ అని.. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ, పండుగల విక్రయాలు ఇందుకు సాయపడుతున్నట్టు పేర్కొంది. 40 శాతం ఎఫ్ఎంసీజీ అమ్మకాలు, 30 శాతం టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాలు ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారానే నమోదవుతున్నట్టు వెల్లడించింది. ఇది భారత వినియోగదారుల ప్రాధాన్యతలను తెలియజేస్తున్నట్టు నీల్సన్ ఐక్యూ నివేదిక పేర్కొంది. ఆన్లైన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నా కానీ, భారత వినియోగదారులకు ఆధునిక అంగళ్లు (సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, డిపార్ట్మెంట్ స్టోర్లు) ప్రాధాన్య మార్గాలుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆధునిక వాణిజ్యం బలంగానే నమోదైంది. ధరల అస్థిరతలు ఉన్నప్పటికీ రండంకెల వృద్ధి నమోదైంది. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది’’అని ఈ నివేదిక వివరించింది. ఎఫ్ఎంసీజీ, టెక్ డ్యూరబుల్స్ విక్రయాలకు పండగల సీజన్ కీలకమని పేర్కొంది. ఈ కాలంలోనే ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో 20 శాతం, టెక్నాలజీ డ్యూరబుల్స్ అమ్మక్లాలో 60 శాతం నమోదవుతున్నట్టు తెలిపింది. ఆహారోత్పత్తుల కంటే వీటి అమ్మకాలే ఆయా సీజన్లలో 1.8 రెట్లు అధికంగా ఉంటున్నట్టు పేర్కొంది. చిన్న తయారీ సంస్థల ఉత్పత్తులతోపాటు, రిటైలర్లు సొంతంగా నిర్వహించే ప్రైవేటు లేబుల్స్ రూపంలో పెద్ద కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రైవేటు లేబుళ్ల అమ్మకాలు పెద్ద తయారీ సంస్థల ఉత్పత్తులతో పోలి్చతే ప్రవేటు లేబుళ్ల అమ్మకాలు (రిటైల్ సంస్థల సొంత ఉత్పత్తులు) 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక చిన్న తయారీ సంస్థలు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో 70 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి’’అని నీల్సన్ ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక చానళ్లలో సంప్రదాయంగా ఎఫ్ఎంసీజీలకు సంబంధించి పెద్ద ప్యాక్‌లకు ఆదరణ ఉంటుండగా, ఇది క్రమంగా చిన్న ప్యాక్‌ల వైపు మళ్లుతున్నట్టు వివరించింది. -
సెకండ్ వేవ్ కరోనా: స్నాక్స్, చిరుతిళ్లకు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్యాకేజ్డ్, రెడీ టు ఈట్ బ్రేక్ ఫాస్ట్, ఇతర ఫుడ్ ఐటెమ్స్‌కు గిరాకీ బాగా పెరిగింది. ప్రధాన నగరాలు, పట్టణాలే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ వీటికి డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రోగ నిరోధకశక్తి పెంచే, ఆరోగ్యకర, పరిశుభ్ర ఆహారం, అదీకూడ సులభంగా సిద్ధమయ్యే ఆహారంపై, ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటెమ్స్ కొనుగోలుకు ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇటీవల కాలంలో వీటికి సంబంధించిన వివిధ వస్తువుల అమ్మకాల డిమాండ్ కూడా గణనీయంగా వృద్ధి చెందినట్టు వేగంగా అమ్ముడయ్యే వినియోగదారుల వస్తువుల(ఎఫ్ఎంసీజీ)ను విక్రయించే కంపెనీలు, నిత్యావసరాలు, రోజువారీ వస్తువులను అమ్మే రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులు, సంస్థలు చెబుతున్నాయి. గత అక్టోబర్ నుంచి ఈ మార్చి వరకు ఈ కేటగిరిలో వివిధ ఆహార వస్తువులు, స్నాక్స్, తినుబండారాలు వంటి విక్రయాలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్యకాలంలో కరోనా కేసులసంఖ్య, వ్యాప్తి తగ్గడం, దశలవారీగా అన్ని రంగాలు తెరుచుకోవడమే కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత నెలతో పోల్చితే ఏప్రిల్ 20 రోజుల్లోనే బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్, బిస్కెట్లు, ఇతర స్నాక్స్, సాస్, బట్టర్ వంటి వాటి అమ్మకాలు 44 శాతం పెరిగినట్టు దేశవ్యాప్తంగా రిటైల్ సంస్థలకు హోల్‌సేల్ పంపిణీ సంస్థ మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోరీ వెల్లడించింది. తేనే, చ్యవన్‌ప్రాశ్, ఆయుర్వేదిక్ టీకి డిమాండ్ ప్రజలు మళ్లీ సురక్షిత, పరిశుభ్రతాచర్యలపై అధికదృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఈ నెలలో తేనే, చ్యవన్‌ప్రాశ్, ఆయూర్వేదిక్ టీ వంటి వాటి డిమాండ్ ఆమాంతం 60 శాతం పెరిగినట్టు, మాస్క్‌లకు 73 శాతం, టాయ్‌లెట్ సోప్స్‌కు 157 శాతం పెరిగినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్‌లో తులసి, అశ్వగంథ, ప్రొటీన్ పౌడర్ వంటి వాటి డిమాండ్ 30 శాతం వృద్ధి చెందినట్టు ఆమ్వే వర్గాలు తెలిపాయి. చ్యవన్ ప్రాశ్, తేనే, ఇతర ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రొడక్షన్‌ను గణనీయంగా పెంచినట్టు డాబర్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో రెడీ టు ఈట్ తినుబండరాలు, ప్యాకేజ్డ్, హైజీన్ ఫుడ్ ఐటెమ్స్, ఇతర వస్తువులకు పెరిగిన డిమాండ్‌పై ‘సాక్షి’తో ఆయా రంగాల్లో కృషి చేస్తున్నవారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు... వారి మాటల్లోనే... ఈ నెలలో అమ్మకాలు పెరిగాయి ఈ నెలలో వివిధ వస్తువులు బాగా కొంటున్నారు. దీనికి రంజాన్ మాసం కూడా తోడైంది. డ్రై ఫ్రూట్స్, న్యూట్రీషియన్ ఫుడ్ ఐటెమ్స్, బిస్కెట్లు, స్నాక్స్, పల్లీపట్టీలు, పళ్లరసాలు, ఇతర నిత్యావసర వస్తువుల డిమాండ్ పెరిగింది. నగరంలోని మూడుచోట్ల ఉన్న మా సూపర్ మార్కెట్ స్టోర్లలో అమ్మకాలు పెరిగాయి. కోవిడ్ కేసులు పెరిగితే ప్యానిక్ బయ్యింగ్ పెరగొచ్చేమో. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. నిత్యావసరాలు, సబ్బులు, షాంపూలు వంటివి, ఫ్లోర్ క్లీనర్స్, ఇతర క్లీనింగ్ ఉత్పత్తులు తదితరాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులకు డిమాండ్ పెరిగింది. బేకింగ్, కుకింగ్, పిజ్జా తయారీ వస్తువులను ఎక్కువగానే కొంటున్నారు. పౌష్టికాహారం, ఆరోగ్యపరిరక్షణ వస్తువులు, పరిశుభ్రతకు దోహదపడే పరికరాలు, ఇతర వస్తువులను బాగానే కొనుగోళు చేస్తున్నారు. – సన్నీ అగర్వాల్, దిలీప్ సూపర్ మార్కెట్ స్టోర్స్ అధినేత 2 వారాల్లోనే 60 శాతం పెరుగుదల ‘గత రెండు వారాల్లోనే మా రెడీ టు ఈట్ ఫుడ్ ప్రొడక్టŠస్ విక్రయాలు 60 శాతం పెరిగాయి. ఈ వారం అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. వచ్చే 3, 4 వారాలు పెరగనున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మా ఉత్పత్తులను సిద్ధం చేసుకున్నాం. ఆన్లైన్ ఆర్డర్లు గణనీయంగా వృద్ధి చెందాయి. ప్రధానంగా నాన్‌వెజ్ ఫుడ్ ఐటెమ్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ మొదలు స్నాక్స్, లంచ్, డిన్నర్ ఇలా అన్ని కేటగిరీల్లో అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. చికెన్ కర్రీ రైస్, ఉప్మాతోపాటు సంప్రదాయబద్ధమైన పొంగల్, దాల్ కిచిడీ, దాల్‌రైస్ వంటి వాటి వైపు అధికంగా మొగ్గుచూపుతున్నారు. కాఫీ, టీకి నీటిని వేడి చేసేంత టైమ్‌లోనే ఆహారం సిద్ధమైపోతుంది. కోవిడ్ ఇన్ఫెక్టెడ్ స్టేట్స్ అంటే మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఆన్లైన్ ఆర్డర్లు బాగా పెరిగాయి. అవి ఆర్డర్ చేసిన ఒకటి, రెండు రోజుల్లోనే అవి కస్టమర్లకు చేరుతున్నాయి. హైదరాబాద్, తెలంగాణలో ఐసోలేషన్‌లో ఉన్న వారు, పాజిటివ్ పేషెంట్లు కూడా మా ఫుడ్ ప్రొడక్టŠస్ను తమ వారి ద్వారా ఆన్లైన్, ఇతరత్రా పద్ధతుల ద్వారా ఎక్కువగా తెప్పించుకుంటున్నారు. – రాజు వానపాల, ఫౌండర్ అండ్ సీఈవో -
విద్యార్థులను సూపర్ మార్కెట్లోకి..
-
సూపర్మార్కెట్లలో నిషేధిత పదార్థాల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : సూపర్ మార్కెట్లలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న జన్యుమార్పిడి ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయంటూ ఓ షాకింగ్ రిపోర్ట్ వెలువడింది. నిషేధిత జీఎం(జెనిటికల్లీ మోడిఫైడ్) ఆహార పదార్థాలను ఆకర్షణీయమైన ప్యాకేజీల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్సీ) నివేదించింది. విదేశాలకు చెందిన ఫ్యాన్సీ ఉత్పతులు ముఖ్యంగా శిశువుల ఆహార ఉత్పత్తులు వుండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. పాన్ కేక్ సిరప్, మల్టీ గ్రెయిన్ సిరల్స్( సెరిలాక్ లాంటివి) కార్న్ పఫ్స్, నూనెలు లాంటివి అమ్ముతున్నారని తెలిపింది. గుజరాత్, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో సంస్థ పరిశోధకులు 65 ఆహార నమూనాలను పరీక్షించారు. వీటిల్లో 21 నమూనాల్లో 32 శాతం జీఎం పాజిటివ్ అని కనుగొన్నారు. భారతదేశంలో తయారు చేసిన వాటిల్లో 30 శాంపిల్స్‌లో కేవలం ఐదు లేదా 17 శాతం జీఎం పాజిటివ్‌గా ఉండగా, కెనడా, యుఎఇ, అమెరికా, నెదర్లాండ్స్, థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న 35శాంపిల్స్‌లో 16-46 శాతం జీఎం పాజిటివ్‌గా ఉన్నాయని నివేదించింది. అలాగే జీఎం పాజిటివ్ అయి వుండి జీఎం ఫ్రీ పేరుతో అక్రమంతా విక్రయిస్తున్న ఉత్పత్తులు దాదాపు 15శాతం ఉన్నట్టు వెల్లడించింది. జన్యుమార్పిడి ఆహారాలకు దేశంలో అనుమతి లేనప్పటికీ , సూపర్ మార్కెట్లో ఇలా అక్రమంగా విక్రయిస్తున్నారని తాజా అధ్యయనంలో సీఎస్ఈ తేల్చింది. పైగా వీటిల్లో కొన్నింటిని జీఎం ఫ్రీ అని తప్పుడు ప్రకటనలతో మోసం చేస్తున్నారని నివేదించింది. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 లోని సెక్షన్ 22 ప్రకారం జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులను భారతదేశంలో తయారుచేయడం, దిగుమతి లేదా విక్రయించడం నిషేధమని పేర్కొంది. నిఘా విభాగం లోపం వల్లే దేశంలోని అనేక సూపర్మార్కెట్లలో జన్యుమార్పిడి ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయని జీఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నారెన్ చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆహార ఉత్పత్తులు జన్యుమార్పిడివి వుండటం ఆందోళకరమన్నారు.అంతేకాదు జీఎం ఫ్రీ అనే లేబుల్‌తో ఈ ఉత్పత్తులను విక్రయించడం మరింత విచారకరమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అమెరికా, నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఎనిమిదింటిలో రెండు చిన్నారి ఆహార పదార్థాల నమూనాలు జీఎం పాజిటివ్‌గా ఉన్నప్పటికీ, లేబుళ్ళు ఈ విషయాన్ని వెల్లడించలేదని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ అంటీముట్టనట్టు వ్యవహరిస్తోందని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇందు భూషణ్ వ్యాఖ్యానించారు. జన్యుపరంగా మార్పు చెందిన బిటి పత్తి పెంపకానికి మాత్రమే భారత్‌లో అనుమతి ఉందన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మ కంపెనీ శిశువుల ఆహార ఉత్పత్తులను (జీఎం, నాన్ జీఎం) విక్రయిస్తుందని కానీ అక్కడి సూపర్మార్కెట్లలో సంబంధిత సూచనలు, తప్పనిసరి హెచ్చరికలుంటాయని సునీతా చెప్పారు. కానీ భారతదేశంలో అలా ఎందుకు కాదు అని ఆమె ప్రశ్నించారు. జన్యుమార్పిడి ఆహార పదార్థాలు హానికరమైనవా, కాదా అనేదానిపై సుదీర్ఘ చర్చ ఉన్నప్పటికీ, వీటి ఎంపికలో వినియోగదారుడికి స్వేచ్ఛ ఉండాలని ఆమె అన్నారు. -
వృధా పదార్థాలు పడేయడంపై బ్యాన్
పారేసేది వాడెయ్యమన్నది నానుడి.. అంటే మనకు పనికి రానిది మరొకరికి ఉపయోగపడేలా చేయాలని అర్థం. ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో ఇది వర్తిస్తుంది. వృధాగా పోయే పదార్థాలను ఆపన్నులకు అందించాలన్న సూత్రం ఈ సందర్భంలో వెల్లడవుతుంది. పేదవారికి ప్రత్యేకంగా సహాయం అందించలేక పోయినా.. ఇటువంటి నియమాలను పాటించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఆహార పదార్థాలు వృధా చేయడంపై కొన్ని దేశాల్లో కఠినమైన చట్టాలు అమలవుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ లో సూపర్ మార్కెట్లలోని అమ్ముడుపోని పదార్థాలను చెత్తబుట్టల్లోకి విసిరేయడంపై నిషేధం విధించారు. ఫ్రాన్స్ లో సూపర్ మార్కెట్లలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సరుకులను చెత్తబుట్టలకు తరలిస్తుంటారు. ఇటువంటి పోకడలకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేందుకు కఠిన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వస్తువులను వృధాగా పారేసేవారికి పరిమాణాన్ని బట్టి ఫైన్ వేసేందుకు నిర్ణయించింది. అంతేకాదు ఒక్కోసారి అవసరాన్ని బట్టి, తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడ విధిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ మార్కెట్లలో వస్తువులు ఎక్స్ పైరీ డేటుకు ముందే అనాధ శరణాలయాలకు, ఫుడ్ బ్యాంక్ లకు ఇచ్చేయాలని సూచిస్తున్నారు. ఇదే అంశంపై ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలో బిల్లు కూడ పాస్ చేశారు. ఫ్రాన్స్ లో ప్రతియేటా 7.1 మిలియన్ టన్నుల ఆహారం వేస్ట్ అవుతుండటం కూడా ఈ బిల్లు అమల్లోకి రావడానికి కారణంగా చెప్పాలి. ముఖ్యంగా ఈ వృధా చేస్తున్న పదార్థాల్లో అమ్మకందార్లు 11 శాతం వృధా చేస్తుంటే... కొని పారేసే వారు 67 శాతం, రెస్టారెంట్ల లో తినకుండా వదిలేసేవారు 15 శాతం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం అటువంటివారికి భారీ జరిమానా విధించేందుకు ఈ కఠిన చట్టాన్నిఅమలుపరుస్తోంది. ప్రపంచంలో ఎంతోమంది తిండి లేక నానా ఇక్కట్లూ పడుతున్నారు. మరోపక్క అవసరానికి మించి ఆహారం కొనుగోలు చేసి వృధా చేసేవారూ అధికంగానే ఉన్నారు. దీన్ని అరికట్టాలన్నదే ఫ్రాన్స్ ప్రభుత్వ లక్ష్యం. అందుకే అక్కర్లేని పదార్థాలను సేవా సంస్థలు, ఆహార బ్యాంకులకు దానం చేయమని సూచిస్తోంది. పారిస్ కు దగ్గరలోని కౌర్బివాయి కౌన్సిలర్... ఆరాష్ దెరాంబర్ష్ ప్రవేశ పెట్టిన పిటిషన్ ను ఫ్రెంచ్ సెనేట్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 400 స్క్వేర్ మీటర్లు, అంతకు మించి ఉన్న సూపర్ మార్కెట్లన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఉల్లంఘించిన వారికి ప్రభుత్వం 3750 యూరోల జరిమానా విధిస్తుంది. ఆహార పదార్థాల వృధాను అరికట్టేందుకు ఇదే చట్టాన్ని ఇప్పుడు యూరప్ లోని అన్ని సూపర్ మార్కెట్లకు వ్యాప్తి చేసేందుకు ఆరాష్ దెరాంబర్ష్ కృషి చేస్తున్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లలోని ఆహారం... వృధా కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తామని ఆయన అంటున్నారు. -
ఆన్లైన్లో కిరాణా జోరు...
సూపర్మార్కెట్లకు గట్టి పోటీ ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలతో నగరవాసుల నయా రూట్ భవిష్యత్తుపై నమ్మకంతో ఇన్వెస్టర్ల ఆసక్తి సూపర్ మార్కెట్లేమో ఒకదానితో మరొకటి పోటీపడలేక కుదేలవుతున్నాయి. ఎక్కువ స్టోర్లతో పాటు నష్టాల్ని తట్టుకునే సామర్థ్యం కూడా ఉంటే తప్ప మనలేకపోతున్నాయి. మరోవంక ఆన్లైన్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కిరాణ దుకాణాల జోరు పెరుగుతోంది. ట్రాఫిక్ రద్దీ, తగినంత పార్కింగ్ స్పేస్ దొరక్కపోతుండటం తదితర అంశాల కారణంగా నగరాల్లో ఉండేవారు కూరగాయలు, పప్పు.. ఉప్పు లాంటి కిరాణా సరుకులకు కూడా ఈ-కామర్స్ సైట్ల వైపు మళ్లుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అందుకే బిగ్‌బాస్కెట్, లోకల్ బనియా వంటి ఆన్లైన్ కిరాణ దుకాణాల వ్యాపారం రోజురోజుకీ వృద్ధి చెందటంతో పాటు కొత్త కొత్త కంపెనీలూ పుట్టుకొస్తున్నాయి. ఒకవైపేమో ఈ-కామర్స్ సంస్థలు ఇంకా లాభాల్ని కళ్లచూడటం లేదు. పారిశ్రామిక దిగ్గజాలు ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలోని మోర్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన రిలయన్స్ ఫ్రెష్ వంటివి కూడా సంప్రదాయ ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ఇంకా లాభాల్లోకి రాలేదు. అయితే మూడేళ్ల కిందట ప్రారంభమైన బిగ్‌బాస్కెట్‌డాట్‌కామ్ లాంటి ఆన్లైన్ కిరాణా స్టోర్లు లాభాల్లోకి మళ్లుతుండటం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన విషయమే. ఇవీ... సానుకూలాంశాలు చాలా ఈ-కామర్ సైట్లు తమ గిడ్డంగుల్ని శివార్లలో ఏర్పాటు చేస్తున్నాయి. దీని వల్ల నగరాల్లో సూపర్ మార్కెట్లలాగా భారీ అద్దెలు చెల్లించాల్సిన పని లేదు. సొంత డెలివరీ నెట్వర్క్ ఉంటుంది కనక వ్యయాలు బాగా తక్కువ. తద్వారా చౌకగా ఉత్పత్తులను అందించి కొనుగోలుదారులకు చేరువ కావొచ్చు. ఉదాహరణకు 2011 చివర్లో ప్రారంభమైన బిగ్‌బాస్కెట్‌కు ప్రస్తుతం 2,20,00 మంది పైచిలుకు కస్టమర్లున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబైల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ త్వరలో పుణె, ఢిల్లీ, చెన్నైకి కూడా విస్తరించనుంది. ట్రాఫిక్, పార్కింగ్ కష్టాలు పడలేని చాలా మంది నగరవాసులు కాస్త ఎక్కువ చెల్లించైనా సరుకులు ఇంటికే తెప్పించుకునేందుకు ఇష్టపడుతున్నారు. వీరే ఆన్లైన్ షాపులకు లాభాలు తెచ్చిపెడుతున్నారు. ఉదాహరణకు బిగ్‌బాస్కెట్ లాంటి సంస్థలు.. కొన్ని వస్తువులకు సూపర్మార్కెట్ల కన్నా ఎక్కువే వసూలు చేస్తున్నాయి. మామూలు రిటైలర్లకు దాదాపు 20 శాతం మార్జిన్లు ఉంటున్న నేపథ్యంలో ఆన్లైన్ షాపులు.. ఈ సేవల ద్వారా మరింత లాభాలు ఆర్జిస్తున్నాయి. ఇన్వెస్టర్ల ఆసక్తి.. కన్సల్టెన్సీ సంస్థ టెక్నోపాక్ అధ్యయనం ప్రకారం రిటైల్ వస్తువుల అమ్మకాల్లో మూడింట రెండొంతులు ఆహారోత్పత్తులు, కిరాణా వస్తువులే ఉంటున్నాయి. 2020 నాటికి వీటి విలువ 686 బిలియన్ డాలర్ల స్థాయికి పెరగనుంది. మధ్యతరగతి వర్గ జనాభా పెరుగుతుండటం, ఇంటర్నెట్ మరింతగా అందుబాటులోకి వస్తుండటం.. తదితర అంశాలతో ఆన్లైన్ షాపులకు అపార అవకాశాలు ఉన్నాయన్నది పరిశ్రమ వర్గాల విశ్లేషణ. సంప్రదాయ కిరాణ దుకాణాలు పెద్ద ఎత్తున విస్తరించలేని నేపథ్యంలో ఆన్లైన్ దుకాణాలు తక్కువ పెట్టుబడితో మరింత ఎక్కువమందికి చేరువయ్యేందుకు వీలుంది. ఇన్వెస్టర్లు కూడా ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతున్నారు. అందుకే, సెప్టెంబర్‌లో హీలియన్ వెంచర్స్, జోడియస్ క్యాపిటల్ వంటి సంస్థలు బిగ్‌బాస్కెట్‌లో రూ.200 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. పోటీ సంస్థ లోకల్‌బనియా కూడా దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించేందుకు ఇదే స్థాయిలో నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. -
‘చిల్లర వర్తకం’లో షైనింగ్ కెరీర్..
టాప్ స్టోరీ ఒకప్పుడు పెద్ద పట్టణాలకే పరిమితమైన సూపర్ మార్కెట్లు, ఫ్యాక్టరీ ఔట్లెట్లు, డిస్కౌంట్ స్టోర్లు వంటివి ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకూ విస్తరిస్తున్నాయి. ‘‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్పీ; రిటైలర్స్ అసోిిసియేషన్ ఆఫ్ ఇండియా’’ నివేదిక ప్రకారం... 2013లో భారతీయ రిటైల్ మార్కెట్ విలువ 520 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇది 2018 నాటికి 950 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరనుంది. ఇంతగా విస్తరిస్తున్న రిటైల్ రంగంలో నిపుణులైన మానవ వనరులకు డిమాండ్ ఏర్పడుతోంది. ఇదే యువతకు సమున్నత కెరీర్ అవకాశాలను అందిస్తోంది. ఉన్నత కెరీర్‌కు ఊతమిచ్చే కోర్సులు! చిల్లర వర్తక రంగం మంచి జోరుమీదుండటంతో దీనికి అవసరమైన మానవ వనరులను దృష్టిలో ఉంచుకొని, విద్యా సంస్థలు పలు కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. ఎంబీఏలో పీజీ స్థాయిలో రిటైల్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. ఇంకా పీజీ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను కూడా విద్యా సంస్థలు అందిస్తున్నాయి. దూరవిద్యలోనూ కోర్సులున్నాయి. వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన మార్కెటింగ్ విభాగంలో అవకాశాలు పొందడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ వివిధ కోర్సులు అందిస్తోంది. కామన్ అడ్మిషన్ రిటైల్ టెస్ట్ (కార్ట): రిటైలర్స అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ).. దేశంలోని రిటైల్ రంగ ప్రముఖులతో ఏర్పడిన సంస్థ. ఈ సంస్థ రిటైల్ రంగ వ్యాపార విస్తరణ అంశాలతోపాటు, సుశిక్షితులైన మానవ వనరులను కూడా అందిస్తోంది. ఇందుకోసం ఏటా కామన్ అడ్మిషన్ రిటైల్ టెస్ట్ పేరుతో జాతీయస్థాయి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఏదైనా బ్యాచిలర్‌స డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పరీక్షకు అర్హులు. ఈ పరీక్షలో ర్యాంకు ద్వారా దేశంలోని 17 బి-స్కూల్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ రిటైల్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. అవకాశాలు బోలెడు!: రిటైల్ మార్కెట్ సంబంధిత కోర్సులు పూర్తిచేసిన వారికి వివిధ విభాగాల్లో అవకాశాలుంటాయి. వీటిలో స్టోర్ ఆపరేషన్స్; హ్యూమన్ రిసోర్సెస్/ట్రైనింగ్; ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్; కస్టమర్ కాంటాక్ట్ సెంటర్స్; మార్కెటింగ్; లాజిస్టిక్స్ వంటివి ఉన్నాయి. జాబ్ ప్రొఫైల్: స్టోర్ మేనేజర్ - డిపార్ట్మెంట్ మేనేజర్ - ఫ్లోర్ మేనేజర్ - హెచ్ఆర్ మేనేజర్ - రిటైల్ స్టోర్ సూపర్వైజర్ - రిటైల్ ఎగ్జిక్యూటివ్ - విజువల్ మర్చండైజర్స్ - సేల్స్ మేనేజర్ - బ్రాండ్ మేనేజర్ - ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్ - రిటైల్ బయ్యర్స్. ఇతర రంగాల్లోనూ: రిటైల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేసిన వారికి సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లలోనే ఉద్యోగాలు లభిస్తాయనుకోవడం పొరపాటు. ఇతర పరిశ్రమల్లోనూ రిటైల్ మేనేజ్మెంట్ అర్హులకు అవకాశాలుంటున్నాయి. ముఖ్యంగా అగ్రికల్చర్, టెలికం, బ్యాంకింగ్, బెవరేజెస్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుట్‌వేర్ పరిశ్రమల్లోనూ అవకాశాలు లభిస్తాయి. భారతీయ రిటైల్ పరిశ్రమ - సూపర్ మార్కెట్ - అప్పరెల్స్ అండ్ ఫుట్‌వేర్ - హోమ్ ఫర్నీచర్ - లైఫ్‌స్టైల్ అండ్ పర్సనల్ ప్రొడక్ట్స్ - హెల్త్ అండ్ వెల్నెస్ - కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రిటైల్ రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు: - కమ్యూనికేషన్ స్కిల్స్ - బృంద స్ఫూర్తి - టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ - ఆత్మస్థైర్యం - మార్కెటింగ్ నైపుణ్యాలు - సమస్య పరిష్కార నైపుణ్యాలు టాప్ రిక్రూటర్స్: ఆదిత్యా బిర్లా గ్రూప్; షాపర్స్ స్టాప్, పాంటాలూన్స్, లైఫ్ స్టైల్, వాల్‌మార్ట్, బిగ్ బజార్, ఫ్యూచర్ గ్రూప్. వేతనాలు: రిటైల్ రంగంలో ప్రారంభంలో నెలకు రూ.15,000 నుంచి వేతనాలు ఉంటాయి. రెండు, మూడేళ్ల అనుభవంతో నెలకు రూ.25,000కు పైగా సంపాదించొచ్చు. పేరున్న సంస్థల్లో అధిక వేతనాలను అందుకోవచ్చు. సంస్థలు, కోర్సులు ఉస్మానియా యూనివర్సిటీ రిటైల్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ - హైదరాబాద్.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తోంది. వెబ్సైట్:www.ipeindia.org ఇండియన్ రిటైల్ స్కూల్ -ఢిల్లీ కోర్సులు: పీజీ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్మెంట్ వెబ్సైట్: www.indianretailschool.com సింబయాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స లెర్నింగ్ -పుణె కోర్సు: పీజీడీఆర్ఎం వెబ్సైట్: www.scdl.net ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ - న్యూఢిల్లీ కోర్సు: బీబీఏ ఇన్ రిటైలింగ్, వ్యవధి: మూడేళ్లు, అర్హత: 10+2 ఉత్తీర్ణత. వెబ్సైట్: www.ignou.ac.in సుస్థిర కెరీర్‌ను ఖాయం చేసే కోర్సులు ‘‘దేశంలో నేడు యువతకు విద్య, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలోనే కొనుగోలు శక్తి మెరుగుపడి, రిటైల్ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. విదేశీ పెట్టుబడుల కారణంగా భవిష్యత్తులో మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశాలున్నాయి. రిటైల్ పరిశ్రమ ప్రధానంగా 18-25 ఏళ్ల లోపు యువతపైనే ఆధారపడి ఉంది. రిటైల్ రంగంలో ఉన్నత అవకాశాలను అందుకోవాలనుకునే వారికి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు చేస్తున్నప్పుడు మార్కెట్‌ను అధ్యయనం చేస్తూ నైపుణ్యాలను అలవరచుకోవాలి. ఆపై మార్కెట్లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను తెలుసుకుంటూ ఓర్పు-నేర్పుతో శ్రమిస్తూ ముందుకెళ్తే రిటైల్ రంగంలో సుస్థిర కెరీర్‌ను ఖాయం చేసుకోవచ్చు’’ - ప్రొఫెసర్ బి.కృష్ణారెడ్డి, డీన్, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఓయూ