వృధా పదార్థాలు పడేయడంపై బ్యాన్
పారేసేది వాడెయ్యమన్నది నానుడి.. అంటే మనకు పనికి రానిది మరొకరికి ఉపయోగపడేలా చేయాలని అర్థం. ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో ఇది వర్తిస్తుంది. వృధాగా పోయే పదార్థాలను ఆపన్నులకు అందించాలన్న సూత్రం ఈ సందర్భంలో వెల్లడవుతుంది. పేదవారికి ప్రత్యేకంగా సహాయం అందించలేక పోయినా.. ఇటువంటి నియమాలను పాటించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఆహార పదార్థాలు వృధా చేయడంపై కొన్ని దేశాల్లో కఠినమైన చట్టాలు అమలవుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ లో సూపర్ మార్కెట్లలోని అమ్ముడుపోని పదార్థాలను చెత్తబుట్టల్లోకి విసిరేయడంపై నిషేధం విధించారు.
ఫ్రాన్స్ లో సూపర్ మార్కెట్లలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సరుకులను చెత్తబుట్టలకు తరలిస్తుంటారు. ఇటువంటి పోకడలకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేందుకు కఠిన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వస్తువులను వృధాగా పారేసేవారికి పరిమాణాన్ని బట్టి ఫైన్ వేసేందుకు నిర్ణయించింది. అంతేకాదు ఒక్కోసారి అవసరాన్ని బట్టి, తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడ విధిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ మార్కెట్లలో వస్తువులు ఎక్స్ పైరీ డేటుకు ముందే అనాధ శరణాలయాలకు, ఫుడ్ బ్యాంక్ లకు ఇచ్చేయాలని సూచిస్తున్నారు. ఇదే అంశంపై ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలో బిల్లు కూడ పాస్ చేశారు. ఫ్రాన్స్ లో ప్రతియేటా 7.1 మిలియన్ టన్నుల ఆహారం వేస్ట్ అవుతుండటం కూడా ఈ బిల్లు అమల్లోకి రావడానికి కారణంగా చెప్పాలి. ముఖ్యంగా ఈ వృధా చేస్తున్న పదార్థాల్లో అమ్మకందార్లు 11 శాతం వృధా చేస్తుంటే... కొని పారేసే వారు 67 శాతం, రెస్టారెంట్ల లో తినకుండా వదిలేసేవారు 15 శాతం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం అటువంటివారికి భారీ జరిమానా విధించేందుకు ఈ కఠిన చట్టాన్నిఅమలుపరుస్తోంది.
ప్రపంచంలో ఎంతోమంది తిండి లేక నానా ఇక్కట్లూ పడుతున్నారు. మరోపక్క అవసరానికి మించి ఆహారం కొనుగోలు చేసి వృధా చేసేవారూ అధికంగానే ఉన్నారు. దీన్ని అరికట్టాలన్నదే ఫ్రాన్స్ ప్రభుత్వ లక్ష్యం. అందుకే అక్కర్లేని పదార్థాలను సేవా సంస్థలు, ఆహార బ్యాంకులకు దానం చేయమని సూచిస్తోంది. పారిస్ కు దగ్గరలోని కౌర్బివాయి కౌన్సిలర్... ఆరాష్ దెరాంబర్ష్ ప్రవేశ పెట్టిన పిటిషన్ ను ఫ్రెంచ్ సెనేట్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 400 స్క్వేర్ మీటర్లు, అంతకు మించి ఉన్న సూపర్ మార్కెట్లన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఉల్లంఘించిన వారికి ప్రభుత్వం 3750 యూరోల జరిమానా విధిస్తుంది. ఆహార పదార్థాల వృధాను అరికట్టేందుకు ఇదే చట్టాన్ని ఇప్పుడు యూరప్ లోని అన్ని సూపర్ మార్కెట్లకు వ్యాప్తి చేసేందుకు ఆరాష్ దెరాంబర్ష్ కృషి చేస్తున్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లలోని ఆహారం... వృధా కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తామని ఆయన అంటున్నారు.