
ఏదైనా శుభవార్త చెప్పే ముందు నోరు తీపి చేస్తారు. ఇది ఒకప్పటి మాట. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.. ప్రతి చిన్న విషయానికీ స్వీట్‌తో పండుగ చేసుకుంటున్నారు. అంతేనా! అంటే కాదు..కొందరు భోజనానికి ముందు.. కొందరు భోజనానికి తర్వాత కూడా స్వీట్ తినే అలవాటు చేసుకుంటున్నారు. ఈ అలవాటుకు అనుకూలంగా నగరంలోని పలు రెస్టారెంట్స్, హోటల్స్ ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు చివరి వంటకంగా డిసర్ట్స్ సర్వ్ చేస్తున్నారు. స్టార్టర్స్, మెయిన్ కోర్సు వగైరాలన్నీ పూర్తయ్యాక ఫైనల్‌గా అందించే తీపి కబురు కోసం ఫుడ్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటిని తరచూ మారుస్తూ చెఫ్స్ కూడా ఆ ఆసక్తిని సజీవంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు మిఠాయి అంటే స్వీట్ షాప్ మాత్రమే గుర్తొచ్చే నగరవాసులు.. ఇప్పుడు కొన్ని రకాల డిసర్ట్స్‌ను ఎంజాయ్ చేసేందుకు రెస్టారెంట్స్‌కు క్యూ కడుతున్నారు.
భోజనం అయిపోగానే కాస్తంత తీపి రుచిని ఆస్వాదించడం చాలా కాలంగా ఒక సంప్రదాయంగా స్థిరపడింది. ఇప్పుడు ఆ సంప్రదాయం ఇంతింతై వటుడింతై అన్నట్లు.. రెస్టారెంట్స్ వడ్డించే విందులో డిసర్ట్స్‌ని అత్యంత ప్రాధాన్యత కలిగిన భాగంగా మార్చేసింది. మిఠాయిలు ఆస్వాదించాలంటే కేవలం స్వీట్ షాప్స్ మాత్రమే శరణ్యం అనే పరిస్థితి మారి కేవలం డిసర్ట్స్ కోసం రెస్టారెంట్స్‌కి వెళ్లడం ఇప్పుడు సాధారణంగా మారింది.
జామ్.. బూమ్..
రెస్టారెంట్ల తొలినాళ్లలో గులాబ్ జామ్ వంటి అందరికీ తెలిసిన స్వీట్లను మాత్రమే వడ్డించేవారు. అయితే ఆ తర్వాత క్రమంలో పూర్తి భోజనాన్ని మూడు భాగాలుగా విభజించిన తర్వాత డిసర్ట్స్ పేరుతో మెనూలో ప్రత్యేక స్థానాన్ని తీపి వంటకాలకు కేటాయించారు. తొలినాళ్లలో గులాబ్ జామ్, హల్వా, జిలేబీ, రస్‌మలాయ్, కోవా మాత్రమే చాలాకాలం డిసర్ట్స్‌గా రాజ్యమేలాయి. అయితే మల్టీ క్యుజిన్‌ల వెల్లువ ధాటికి మెయిన్ కోర్సుతో పాటు డిసర్ట్స్ కూడా విభిన్న రుచులకు విస్తరించాయి. ఒకప్పుడు ఆరు వెరైటీల దగ్గర నుంచి ఇప్పుడు అతిథులకు తీపి రుచులను పెద్ద సంఖ్యలో లంచ్, డిన్నర్‌లలో వడ్డిస్తున్నారు.
బేకరీ ఉత్పత్తులకూ చోటు..
తొలుత అందరికీ బాగా తెలిసిన ప్రాంతీయ తీపి వంటకాలు ఆ తర్వాత పేస్ట్రీలకు కూడా డిసర్ట్స్ స్టైల్ మారుతూ వచి్చంది. రస్‌మలాయ్‌కి బదులు అదే ఫ్లేవర్‌లో ఐస్‌క్రీమ్ పెడుతున్నారు. బఫేలో కాంటినెంటల్ చీజ్ కేక్, బ్రౌనీ, చాకోలావా, మథుపై.. ఇలా బేకరీ ఐటమ్స్ కూడా భాగం చేస్తున్నారు. కొంత కాలంగా ఐస్‌క్రీమ్ కూడా డిసర్ట్స్‌లో తప్పనిసరి భాగం అయిపోయింది. ఐస్‌క్రీమ్‌కి కాంబినేషన్‌గా గులాబ్‌జామ్/పేస్ట్రీస్/ మూంగ్‌దాల్ హల్వా వంటివి అతిథుల నోరూరిస్తున్నాయి. కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాలైన ఖద్దూ కా ఖీర్, ఫ్రూట్ కస్టర్డ్.. సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసం, పూర్ణాలు, బొబ్బట్లు కూడా వడ్డిస్తున్నారు.
ఆరోగ్య ‘తీపి’..రస్తు..
ఇటీవల ప్రారంభమైన ఆరోగ్యకరమైన వంటకాల ప్రభావం రెస్టారెంట్స్ మీద కూడా పడింది. దీనిలో భాగంగా కొత్తగా పరిచయమైన మిల్టెట్స్‌తో తయారైన తీపి వంటకాలను అతిథులకు అందిస్తున్నారు. కొర్రల పరమాన్నం, జవారి లడ్డు, రాగుల పాయసం, ఊదల లడ్డు, సామల పరమాన్నం.. వంటివి నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ పంచదార కాకుండా తృణధాన్యాలు, బెల్లంతో తయారవడం డయాబెటిక్ రోగులకు కూడా పెద్దగా హానికారకం కాకపోవడంతో వీటి పట్ల నగరవాసుల్లో మోజు పెరిగిందని చెఫ్ యాదగిరి చెబుతున్నారు. ఆయా సీజన్లలో వచ్చే పండ్లను ఉపయోగించి తయారు చేసే సీజనల్ డిసర్ట్స్ కూడా రెస్టారెంట్స్‌లో సందడి చేస్తున్నాయి. సీతాఫలం దొరికే సీజన్లో సీతాఫల్ రబ్డీ, ప్రస్తుతం జామకాయలు విరివిగా దొరుకుతాయి కాబట్టి జామూన్ డిలైట్ ఇలా ఆయా సీజన్స్ ప్రకారం కొత్త రుచులను అందిస్తున్నారు. అలాగే మల్‌బరీ పండ్లు విరివిగా లభించే సమయంలో ఐస్‌క్రీమ్ మల్‌బరీస్ మిక్స్, మల్‌బరీ జ్యూస్ వంటివి అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment