ఆన్‌లైన్లో కిరాణా జోరు...
సూపర్‌మార్కెట్లకు గట్టి పోటీ
ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలతో
నగరవాసుల నయా రూట్
భవిష్యత్తుపై నమ్మకంతో ఇన్వెస్టర్ల ఆసక్తి
సూపర్ మార్కెట్లేమో ఒకదానితో మరొకటి పోటీపడలేక కుదేలవుతున్నాయి. ఎక్కువ స్టోర్లతో పాటు నష్టాల్ని తట్టుకునే సామర్థ్యం కూడా ఉంటే తప్ప మనలేకపోతున్నాయి. మరోవంక ఆన్‌లైన్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కిరాణ దుకాణాల జోరు పెరుగుతోంది. ట్రాఫిక్ రద్దీ, తగినంత పార్కింగ్ స్పేస్ దొరక్కపోతుండటం తదితర అంశాల కారణంగా నగరాల్లో ఉండేవారు కూరగాయలు, పప్పు.. ఉప్పు లాంటి కిరాణా సరుకులకు కూడా ఈ-కామర్స్ సైట్ల వైపు మళ్లుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
అందుకే బిగ్‌బాస్కెట్, లోకల్ బనియా వంటి ఆన్‌లైన్ కిరాణ దుకాణాల వ్యాపారం రోజురోజుకీ వృద్ధి చెందటంతో పాటు కొత్త కొత్త కంపెనీలూ పుట్టుకొస్తున్నాయి. ఒకవైపేమో ఈ-కామర్స్ సంస్థలు ఇంకా లాభాల్ని కళ్లచూడటం లేదు. పారిశ్రామిక దిగ్గజాలు ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలోని మోర్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన రిలయన్స్ ఫ్రెష్ వంటివి కూడా సంప్రదాయ ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ఇంకా లాభాల్లోకి రాలేదు. అయితే మూడేళ్ల కిందట ప్రారంభమైన బిగ్‌బాస్కెట్‌డాట్‌కామ్ లాంటి ఆన్‌లైన్ కిరాణా స్టోర్లు లాభాల్లోకి మళ్లుతుండటం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన విషయమే.
ఇవీ... సానుకూలాంశాలు
చాలా ఈ-కామర్ సైట్లు తమ గిడ్డంగుల్ని శివార్లలో ఏర్పాటు చేస్తున్నాయి. దీని వల్ల నగరాల్లో సూపర్ మార్కెట్లలాగా భారీ అద్దెలు చెల్లించాల్సిన పని లేదు. సొంత డెలివరీ నెట్‌వర్క్ ఉంటుంది కనక వ్యయాలు బాగా తక్కువ. తద్వారా చౌకగా ఉత్పత్తులను అందించి కొనుగోలుదారులకు చేరువ కావొచ్చు. ఉదాహరణకు 2011 చివర్లో ప్రారంభమైన బిగ్‌బాస్కెట్‌కు ప్రస్తుతం 2,20,00 మంది పైచిలుకు కస్టమర్లున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబైల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ త్వరలో పుణె, ఢిల్లీ, చెన్నైకి కూడా విస్తరించనుంది.
ట్రాఫిక్, పార్కింగ్ కష్టాలు పడలేని చాలా మంది నగరవాసులు కాస్త ఎక్కువ చెల్లించైనా సరుకులు ఇంటికే తెప్పించుకునేందుకు ఇష్టపడుతున్నారు. వీరే ఆన్‌లైన్ షాపులకు లాభాలు తెచ్చిపెడుతున్నారు. ఉదాహరణకు బిగ్‌బాస్కెట్ లాంటి సంస్థలు.. కొన్ని వస్తువులకు సూపర్‌మార్కెట్ల కన్నా ఎక్కువే వసూలు చేస్తున్నాయి. మామూలు రిటైలర్లకు దాదాపు 20 శాతం మార్జిన్లు ఉంటున్న నేపథ్యంలో ఆన్‌లైన్ షాపులు.. ఈ సేవల ద్వారా మరింత లాభాలు ఆర్జిస్తున్నాయి.
ఇన్వెస్టర్ల ఆసక్తి..
కన్సల్టెన్సీ సంస్థ టెక్నోపాక్ అధ్యయనం ప్రకారం రిటైల్ వస్తువుల అమ్మకాల్లో మూడింట రెండొంతులు ఆహారోత్పత్తులు, కిరాణా వస్తువులే ఉంటున్నాయి. 2020 నాటికి వీటి విలువ 686 బిలియన్ డాలర్ల స్థాయికి పెరగనుంది. మధ్యతరగతి వర్గ జనాభా పెరుగుతుండటం, ఇంటర్నెట్ మరింతగా అందుబాటులోకి వస్తుండటం.. తదితర అంశాలతో ఆన్‌లైన్ షాపులకు అపార అవకాశాలు ఉన్నాయన్నది పరిశ్రమ వర్గాల విశ్లేషణ. సంప్రదాయ కిరాణ దుకాణాలు పెద్ద ఎత్తున విస్తరించలేని నేపథ్యంలో ఆన్‌లైన్ దుకాణాలు తక్కువ పెట్టుబడితో మరింత ఎక్కువమందికి చేరువయ్యేందుకు వీలుంది. ఇన్వెస్టర్లు కూడా ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతున్నారు. అందుకే, సెప్టెంబర్లో హీలియన్ వెంచర్స్, జోడియస్ క్యాపిటల్ వంటి సంస్థలు బిగ్‌బాస్కెట్‌లో రూ.200 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. పోటీ సంస్థ లోకల్‌బనియా కూడా దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించేందుకు ఇదే స్థాయిలో నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది.