Asia-Pacific Region
-
NielsenIQ: ‘మాల్స్’ విక్రయాల్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారా విక్రయాల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు నీల్సన్ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక అంగళ్లలో ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాల పరంగా రెండంకెల వృద్ధి చూపిస్తున్న ఏకైక దేశం భారత్ అని.. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ, పండుగల విక్రయాలు ఇందుకు సాయపడుతున్నట్టు పేర్కొంది. 40 శాతం ఎఫ్ఎంసీజీ అమ్మకాలు, 30 శాతం టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాలు ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారానే నమోదవుతున్నట్టు వెల్లడించింది. ఇది భారత వినియోగదారుల ప్రాధాన్యతలను తెలియజేస్తున్నట్టు నీల్సన్ ఐక్యూ నివేదిక పేర్కొంది. ఆన్లైన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నా కానీ, భారత వినియోగదారులకు ఆధునిక అంగళ్లు (సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, డిపార్ట్మెంట్ స్టోర్లు) ప్రాధాన్య మార్గాలుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆధునిక వాణిజ్యం బలంగానే నమోదైంది. ధరల అస్థిరతలు ఉన్నప్పటికీ రండంకెల వృద్ధి నమోదైంది. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది’’అని ఈ నివేదిక వివరించింది. ఎఫ్ఎంసీజీ, టెక్ డ్యూరబుల్స్ విక్రయాలకు పండగల సీజన్ కీలకమని పేర్కొంది. ఈ కాలంలోనే ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో 20 శాతం, టెక్నాలజీ డ్యూరబుల్స్ అమ్మక్లాలో 60 శాతం నమోదవుతున్నట్టు తెలిపింది. ఆహారోత్పత్తుల కంటే వీటి అమ్మకాలే ఆయా సీజన్లలో 1.8 రెట్లు అధికంగా ఉంటున్నట్టు పేర్కొంది. చిన్న తయారీ సంస్థల ఉత్పత్తులతోపాటు, రిటైలర్లు సొంతంగా నిర్వహించే ప్రైవేటు లేబుల్స్ రూపంలో పెద్ద కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రైవేటు లేబుళ్ల అమ్మకాలు పెద్ద తయారీ సంస్థల ఉత్పత్తులతో పోలి్చతే ప్రవేటు లేబుళ్ల అమ్మకాలు (రిటైల్ సంస్థల సొంత ఉత్పత్తులు) 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక చిన్న తయారీ సంస్థలు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో 70 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి’’అని నీల్సన్ ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక చానళ్లలో సంప్రదాయంగా ఎఫ్ఎంసీజీలకు సంబంధించి పెద్ద ప్యాక్‌లకు ఆదరణ ఉంటుండగా, ఇది క్రమంగా చిన్న ప్యాక్‌ల వైపు మళ్లుతున్నట్టు వివరించింది. -
పేదరికంపై ఆసియా పసిఫిక్ పోరాటానికి కరోనా ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో పేదరిక నిర్మూలన పోరాటానికి కోవిడ్–19 పెద్ద సవాలుగా నిలిచిందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తన తాజా నివేదికలో పేర్కొంది. కరోనా కష్టకాలం లేకపోతే 2020లోనే ఈ ప్రాంతం తీవ్ర పేదరిక సమస్య నుంచి బయటపడి, స్థిరత్వం సాధించేదని విశ్లేషించింది. నిర్దేశించుకున్నట్లు 2022లో కాకుండా 2020లోనే ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు రోజుకు 1.90 డాలర్ల (రూ.152) కంటే తక్కువతో జీవించే పరిస్థితి నుంచి కోలుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుని ఉండేవాళ్లని మనీలా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ నివేదిక అభిప్రాయపడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న మెజారిటీ ప్రజలు ఆర్థికంగా మరింత క్లిష్టతను ఎదుర్కొనవచ్చని అంచనావేసింది. ఏడీబీలో మొత్తం 68 సభ్యదేశాలు ఉండగా, ఇందులో 49 ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన దేశాలు ఉన్నాయి. తన కీలక ఇండికేటర్ల ప్రాతిపదికన ఏడీబీ విడుదల చేసిన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► 2022లో ఈ ప్రాంతం తీవ్ర పేదరికం నుంచి బయటపడుతుందని కోవిడ్–19 పేరు వినపడకముందు అంచనావేయడం జరిగింది. చాలా మంచి ప్రజలు రోజుకు 1.90 డాలర్లకన్నా ఎక్కువ సంపాదిస్తారని, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని భావించారు. పరిస్థితి ఎంత ఆశాజనకంగా కనిపించిందంటే 2020లోనే లక్ష్యాన్ని ఆసియా పసిఫిక్ సాధించగలదన్న ధీమా ఏర్పడింది. అయితే ఈ పరిస్థితికి కోవిడ్–19 దెబ్బకొట్టింది. కరోనా నేపథ్యంలో చాలామంది ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయి. 2022 సగం పూర్తయినా, మెజారిటీ ప్రజాలు ఇంకా 1.90 డాలర్లకన్నా తక్కువ సంపాదనతోనే జీవనం వెల్లదీస్తున్నారు. ► ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ పురోగతి అసమానంగా ఉంది. దీర్ఘకాలిక సవాళ్లు కొనసాగుతూనే ఉంటాయి. ► ఆహార భద్రత, ఆరోగ్య సేవలు, విద్యా రంగాల్లో పురోగతి కనిపించడం లేదు. ► ప్రతి ఒక్కరికీ మరింతంగా సమాన ఆర్థిక అవకాశాలను అలాగే ఎక్కువ క్రియాశీలతను అందించడానికి ఈ ప్రాంతంలోని ప్రభుత్వాలు పటిష్ట చర్యలను, సమగ్ర విధానాలను తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. ► ఆసియా పసిఫిక్‌లో తీవ్ర పేదరికం 2030 నాటికి 1 శాతం కంటే తక్కువగా ఉంటుందని అంచనా. దాదాపు 25 శాతం జనాభా కనీసం మధ్యతరగతి స్థితికి చేరుకోవచ్చు. అంటే ఆయా వర్గం ప్రజలు రోజుకు 15 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం/వినియోగ సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు. అయితే ఇందుకు మొబిలిటీలో అవరోధాలు, ఇతర అనిశ్చితులు ఎదురుకాకుండా ఉండాలి. ► అభివృద్ధి చెందుతున్న ఆసియా ప్రస్తుతం స్టాగ్ఫ్లేషన్ (ధరల తీవ్రత, వృద్ధి మందగమన) సమస్యలను ఎదుర్కొంటోంది. భౌగోళిక ఉద్రిక్తతలు ఆహార భద్రతకు సవాళ్లను సృష్టించడంతోపాటు ఇంధన ధరల తీవ్రతకు కారణమవుతున్నాయి. -
ఆసియా–పసిఫిక్‌లో భారతే కీలకం
బ్యాంకాక్: ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో భారత్ పలుకుబడి పెరుగుతోందనటానికి తాజా ఉదాహరణ ఇది. ఈ ప్రాంతంలో కీలకంగా మారిన భారత్‌కు బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్) శిఖరాగ్ర సమావేశం మద్దతు తెలిపింది. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవడంతోపాటు ఉగ్రవాదం వంటి పెను సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆసియాన్ నిర్ణయించిందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్ తెలిపారు. ఆసియాన్, చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యంపై వివాదం కొనసాగుతుండటం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ప్రాబల్యం కోసం జరుగుతున్న పోటీ నేపథ్యంలో ఆసియాన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడా ఆసియాన్ చర్చించిందని, అంతర్జాతీయ చట్టాలు, నియమాల ఆధారిత వ్యవస్థ కీలకమని ఇరువర్గాలు గుర్తించాయన్నారు. అనుసంధానతే ముఖ్యం ఆసియాన్‌తో సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్ సానుకూలంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రారంభ సమావేశంలో ఆసియాన్‌తో సాన్నిహిత్యం పెంచుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ కార్యాచరణను ప్రకటించారు. ఆసియాన్‌లోని 10 దేశాలతో భూ, వాయు, సముద్ర అనుసంధానత పెంపు ద్వారా ప్రాంతీయ వాణిజ్యం, ఆర్థిక ప్రగతి గణనీయంగా మెరుగవుతాయన్నారు. డిజిటల్ అనుసంధానత కూడా చాలా కీలకమైందన్నారు. థాయ్‌లాండ్‌తో రక్షణ రంగంలో సహకారం రక్షణ పరిశ్రమల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకునేందుకు ప్రధాని మోదీ, థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చనోచా అంగీకరిం చారు. బ్యాంకాక్ నుంచి గువాహటికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించాలని, థాయ్‌లాండ్‌లోని రణోంగ్ పోర్టుతో భారత్‌లోని కోల్‌కతా, చెన్నై, విశాఖ నౌకాశ్రయాల మధ్య అనుసంధానత పెంచాలని నిర్ణయించారు. వాణిజ్యం పెంపుపైనా ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు. -
పనిచేసే వాళ్లు భారత్‌లోనే ఎక్కువ!
వాషింగ్టన్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2050కల్లా పనిచేసే వయసు వారు(15-64 ఏళ్లు) ఎక్కువగా ఉన్న దేశంగా భారత్ నిలుస్తుందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) పేర్కొంది. మరో 30 ఏళ్లలో వందకోట్లకు పైగా భారత జనాభా ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించేందుకు అర్హత సాధిస్తారని ప్రాంతీయ మానవ అభివృద్ధి నివేదిక తెలిపింది. 2050 కల్లా భారత్‌లో 68శాతం మంది పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటారని, 32 శాతం మందే వీరిపై ఆధారపడి ఉంటారని వెల్లడించింది. 65 ఏళ్లలో ఆసియా పసిఫిక్ జనాభా 3రెట్లు పెరిగిందని పేర్కొంది. -
టాప్-10 పర్యాటక ప్రాంతాల్లో ముంబై
న్యూఢిల్లీ : ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని టాప్-10 పర్యాటక ప్రదేశాల జాబితాలో దేశ వాణిజ్య రాజధాని ముంబై స్థానం దక్కించుకుంది. ముంబైకి అంతర్జాతీయ సందర్శకుల సంఖ్య పెరిగిందని మాస్టర్‌కార్డ్ తెలిపింది. మాస్టర్‌కార్డ్ సూచీ టాప్-10 జాబితాలో బ్యాంకాక్ అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాతి స్థానాల్లో సింగపూర్ (2వ స్థానం), కౌలాలంపూర్ (3వ స్థానం), సియోల్ (4వ స్థానం), హాంగ్‌కాంగ్ (5వ స్థానం), టోక్యో (6), తైపే (7), షాంఘై (8), ముంబై (9), ఒసాకా (10) ఉన్నాయి. ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలతో పోలిస్తే ఆసియాలోని పర్యాటక ప్రాంతాలు విమాన ప్రయాణికులను ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు మాస్టర్‌కార్డ్ చీఫ్ ఎకనమిస్ట్ యువా హెడ్రిక్ వాంగ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సందర్శకుల తాకిడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో లండన్ అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో బ్యాంకాక్, పారిస్ ఉన్నాయి. గత ఆరేళ్లలో సందర్శకుల సంఖ్య వేగంగా పెరుగుతున్న ఆసియా ప్రాంతాల్లో కొలంబో, చెంగ్దు, అబుధాబి ఉన్నాయి.