ఆసియా–పసిఫిక్‌లో భారతే కీలకం | ASEAN An Integral Part Of Our Act East Policy | Sakshi
Sakshi News home page

ఆసియా–పసిఫిక్‌లో భారతే కీలకం

Published Mon, Nov 4 2019 4:45 AM | Last Updated on Mon, Nov 4 2019 4:45 AM

ASEAN An Integral Part Of Our Act East Policy - Sakshi

ఆసియాన్‌–భారత్‌ శిఖరాగ్రంలో సంఘీభావం తెలుపుకుంటున్న ప్రధాని మోదీ, ఇతర నేతలు

బ్యాంకాక్‌: ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ పలుకుబడి పెరుగుతోందనటానికి తాజా ఉదాహరణ ఇది. ఈ ప్రాంతంలో కీలకంగా మారిన భారత్‌కు బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్‌) శిఖరాగ్ర సమావేశం మద్దతు తెలిపింది. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవడంతోపాటు ఉగ్రవాదం వంటి పెను సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆసియాన్‌ నిర్ణయించిందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్‌ ఠాకూర్‌ సింగ్‌ తెలిపారు. ఆసియాన్, చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యంపై వివాదం కొనసాగుతుండటం, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ప్రాబల్యం కోసం జరుగుతున్న పోటీ నేపథ్యంలో ఆసియాన్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడా ఆసియాన్‌ చర్చించిందని, అంతర్జాతీయ చట్టాలు, నియమాల ఆధారిత వ్యవస్థ కీలకమని ఇరువర్గాలు గుర్తించాయన్నారు.

అనుసంధానతే ముఖ్యం
ఆసియాన్‌తో సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్‌ సానుకూలంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రారంభ సమావేశంలో ఆసియాన్‌తో సాన్నిహిత్యం పెంచుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ కార్యాచరణను ప్రకటించారు. ఆసియాన్‌లోని 10 దేశాలతో భూ, వాయు, సముద్ర అనుసంధానత పెంపు ద్వారా ప్రాంతీయ వాణిజ్యం, ఆర్థిక ప్రగతి గణనీయంగా మెరుగవుతాయన్నారు. డిజిటల్‌ అనుసంధానత కూడా చాలా కీలకమైందన్నారు.

థాయ్‌లాండ్‌తో రక్షణ రంగంలో సహకారం
రక్షణ పరిశ్రమల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకునేందుకు ప్రధాని మోదీ, థాయ్‌లాండ్‌ ప్రధాని ప్రయుత్‌ చనోచా అంగీకరిం చారు. బ్యాంకాక్‌ నుంచి గువాహటికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించాలని, థాయ్‌లాండ్‌లోని రణోంగ్‌ పోర్టుతో భారత్‌లోని కోల్‌కతా, చెన్నై, విశాఖ నౌకాశ్రయాల మధ్య అనుసంధానత పెంచాలని నిర్ణయించారు. వాణిజ్యం పెంపుపైనా ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement