Thailand tour
-
ఆసియా–పసిఫిక్‌లో భారతే కీలకం
బ్యాంకాక్: ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో భారత్ పలుకుబడి పెరుగుతోందనటానికి తాజా ఉదాహరణ ఇది. ఈ ప్రాంతంలో కీలకంగా మారిన భారత్‌కు బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్) శిఖరాగ్ర సమావేశం మద్దతు తెలిపింది. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవడంతోపాటు ఉగ్రవాదం వంటి పెను సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆసియాన్ నిర్ణయించిందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్ తెలిపారు. ఆసియాన్, చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యంపై వివాదం కొనసాగుతుండటం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ప్రాబల్యం కోసం జరుగుతున్న పోటీ నేపథ్యంలో ఆసియాన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడా ఆసియాన్ చర్చించిందని, అంతర్జాతీయ చట్టాలు, నియమాల ఆధారిత వ్యవస్థ కీలకమని ఇరువర్గాలు గుర్తించాయన్నారు. అనుసంధానతే ముఖ్యం ఆసియాన్‌తో సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్ సానుకూలంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రారంభ సమావేశంలో ఆసియాన్‌తో సాన్నిహిత్యం పెంచుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ కార్యాచరణను ప్రకటించారు. ఆసియాన్‌లోని 10 దేశాలతో భూ, వాయు, సముద్ర అనుసంధానత పెంపు ద్వారా ప్రాంతీయ వాణిజ్యం, ఆర్థిక ప్రగతి గణనీయంగా మెరుగవుతాయన్నారు. డిజిటల్ అనుసంధానత కూడా చాలా కీలకమైందన్నారు. థాయ్‌లాండ్‌తో రక్షణ రంగంలో సహకారం రక్షణ పరిశ్రమల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకునేందుకు ప్రధాని మోదీ, థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చనోచా అంగీకరిం చారు. బ్యాంకాక్ నుంచి గువాహటికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించాలని, థాయ్‌లాండ్‌లోని రణోంగ్ పోర్టుతో భారత్‌లోని కోల్‌కతా, చెన్నై, విశాఖ నౌకాశ్రయాల మధ్య అనుసంధానత పెంచాలని నిర్ణయించారు. వాణిజ్యం పెంపుపైనా ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు. -
ఉగ్ర మూలాల్ని నాశనం చేశాం
బ్యాంకాక్/న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం వేళ్లూనుకునేందుకు గల కారణాన్ని గుర్తించి, తొలగించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్న ప్రధాని భారత సంతతి ప్రజలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలో వేర్పాటువాదం, ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు మూలాలను నాశనం చేశాం. ఆగస్టు 5న ఆర్టికల్ 370ను రద్దు చేశాం. జమ్మూకశ్మీర్‌కు సొంత రాజ్యాంగాన్ని కల్పించడం వంటి అనేక తాత్కాలిక నిబంధనలను తొలగించాం. మన నిర్ణయం సరైందే అని ప్రపంచం గుర్తించింది. థాయ్‌లాండ్‌లోనూ అదే విషయం ప్రతిధ్వనించింది. మీరిచ్చే ప్రశంసలు భారత్ పార్లమెంట్, పార్లమెంట్ సభ్యులకే చెందుతాయి’అని ప్రధాని పేర్కొన్నారు. దీంతో అక్కడి వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. పనిచేసి, ఫలితం చూపేవారి నుంచే ప్రజలు ఎక్కువగా ఆశిస్తారని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన వంటి పథకాలు, కర్తార్‌పూర్ కారిడార్‌తో ప్రయోజనాలను ప్రధాని వారికి వివరించారు. ఈ నెల 3వ తేదీన బ్యాంకాక్ సమీపంలోని నొంతబురిలో జరిగే ఆసియాన్–ఇండియా 16వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. 4న 14వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం, ఆర్సెప్ మూడో శిఖరాగ్ర సమావేశంలోనూ మోదీ హాజరవుతారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర భేటీలో ఆసియాన్‌లోని 10 దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా పాల్గొననున్నాయి. ప్రయోజనాన్ని బట్టే ఆర్సీఈపీ దేశానికి ఒనగూరే ప్రయోజనాలను బేరీజు వేశాకే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్సీఈపీ) ఒప్పందంపై సంతకం చేస్తామని మోదీ తెలిపారు. బ్యాంకాక్ పర్యటనకు వెళ్లే ముందు ఆయన ఒక ప్రకటన చేస్తూ.. ‘ఈ నెల 4వ తేదీన జరిగే భేటీ సందర్భంగా ఆర్సీఈపీ చర్చల్లో పురోగతిని పరిశీలిస్తాం. మన సరుకులు, సేవలు, పెట్టుబడులకు సంబంధించిన ప్రయోజనాలు ఈ ఒప్పందంతో ఎంతవరకు నెరవేరతాయనే అంశాన్ని పరిశీలిస్తాం. ఈ ఒప్పందం అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి. ఈ శిఖరాగ్రం సందర్భంగా ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తాం. ఆసియాన్‌కు సంబంధించిన ఈ సమావేశాలు మనకు చాలా ముఖ్యం. అనుసంధానత, సామర్థ్యం పెంపు, సాంస్కృతిక, వాణిజ్యపరమైన ప్రాథమ్యాంశాలపై ఆసియాన్‌తో మన భాగస్వామ్యం ఆధారపడి ఉంది’అని తెలిపారు. -
పాముకాటు.. మంచిదే!
హాలీవుడ్ స్టార్ లిండ్సే లోహన్‌కు ట్రావెలింగ్ అంటే పిచ్చి. టైమ్ దొరికితే చాలు దేశాలు తిరిగేస్తుంది. తాజాగా ఆమె హాలీడేపై థాయ్‌లాండ్ వెళ్లింది. చల్లని సాయంత్రం. ఎంచక్కా స్విమ్మింగ్ పూల్‌లో కూర్చొని సేదతీరుతోంది. ఎక్కణ్నుంచి వచ్చిందో తెలీదు, ఓ పాము వచ్చి, ఆమె ఎడమ కాలిపై కాటు వేసింది. వెంటనే తేరుకొని, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్న లిండ్సే, ప్రాణాపాయం లేకుండా సేఫ్‌గా బయటపడింది. అయితే ఇదేమీ ఇలా చెప్పుకొని వదిలేసేంత చిన్న విషయం కాదు. కొంచెం అటూ ఇటైనా ప్రాణానికే ప్రమాదం జరిగి ఉండేది. ఇదిలా ఉంటే ‘పాముకాటు ఓ రకంగా మంచికే జరిగిందిలే!’ అంటూ లిండ్సే కామెంట్ చేయడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. ‘‘థాయ్‌లాండ్ ట్రిప్ బాగా జరిగింది. ఒక్క పాముకాటెయ్యడం తప్పితే! అయినా అదీ ఒక రకంగా మంచికేనేమో! పాముకాటేస్తే అదృష్టం కలిసివస్తుందని, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు.’’ అంటూ ఈ విషయాన్ని చాలా సింపుల్‌గా తేల్చిపడేసింది లిండ్సే లోహన్. గతంలో ఇలాగే హాలీడేలో ఆమె చేతి వేలు సగం తెగింది. ఇంతా జరిగినా ట్రావెలింగ్ అంటే నాకున్న పిచ్చి ఎప్పటికీ తగ్గదు అంటోంది లిండ్సే లోహన్. -
అలా బుక్కయ్యారు
న్యూజిలాండ్‌కు చెందిన తండ్రీకొడుకులు బ్రయాన్ రస్సెల్ ఫిన్, ల్యూక్ రస్సెల్ ఫిన్‌లు 2013లో థాయ్‌లాండ్ పర్యటనకు వచ్చారు. పటాంగ్ జిల్లాలోని బ్లూ మరైన్ రిసార్టులో 27 వేల రూపాయల ఫుడ్ బిల్లును చెల్లించకుండా వెళ్లిపోయారు. బహుశా ఈ సంగతిని వారు మర్చిపోయి ఉంటారు. రిసార్టు యాజమాన్యం మాత్రం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగే లోపే వీరిద్దరూ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే గత సోమవారం పర్యాటక నగరమైన ఫుకెట్‌లో దిగగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు వీరిద్దరినీ అరెస్టు చేశారు. న్యూజిలాండ్ రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి... స్థానిక పోలీసులకు అప్పగించారు. బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయినందుకు వీరిద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. థాయ్‌లాండ్‌లో కేసును ఎదుర్కొంటున్నారు. -
ఐఆర్సీటీసీ థాయ్‌లాండ్ టూర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లే పర్యాటక ప్రియుల కోసం ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 4 రాత్రులు, 5 పగళ్లతో కూడిన ఈ పర్యటన హైదరాబాద్‌లో మార్చి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తుంది.రూ.45,250 చార్జీ ఉంటుంది. విమాన చార్జీలతో పాటు ఇతర అన్ని సదుపాయాలు కల్పిస్తారు. వివరాల కోసం ఫోన్- 040-277012407 నంబర్‌కు సంప్రదించవచ్చు.