న్యూఢిల్లీ: ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో పేదరిక నిర్మూలన పోరాటానికి కోవిడ్–19 పెద్ద సవాలుగా నిలిచిందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తన తాజా నివేదికలో పేర్కొంది. కరోనా కష్టకాలం లేకపోతే 2020లోనే ఈ ప్రాంతం తీవ్ర పేదరిక సమస్య నుంచి బయటపడి, స్థిరత్వం సాధించేదని విశ్లేషించింది. నిర్దేశించుకున్నట్లు 2022లో కాకుండా 2020లోనే ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు రోజుకు 1.90 డాలర్ల (రూ.152) కంటే తక్కువతో జీవించే పరిస్థితి నుంచి కోలుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుని ఉండేవాళ్లని మనీలా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ నివేదిక అభిప్రాయపడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న మెజారిటీ ప్రజలు ఆర్థికంగా మరింత క్లిష్టతను ఎదుర్కొనవచ్చని అంచనావేసింది. ఏడీబీలో మొత్తం 68 సభ్యదేశాలు ఉండగా, ఇందులో 49 ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన దేశాలు ఉన్నాయి. తన కీలక ఇండికేటర్ల ప్రాతిపదికన ఏడీబీ విడుదల చేసిన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
► 2022లో ఈ ప్రాంతం తీవ్ర పేదరికం నుంచి బయటపడుతుందని కోవిడ్–19 పేరు వినపడకముందు అంచనావేయడం జరిగింది. చాలా మంచి ప్రజలు రోజుకు 1.90 డాలర్లకన్నా ఎక్కువ సంపాదిస్తారని, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని భావించారు. పరిస్థితి ఎంత ఆశాజనకంగా కనిపించిందంటే 2020లోనే లక్ష్యాన్ని ఆసియా పసిఫిక్ సాధించగలదన్న ధీమా ఏర్పడింది. అయితే ఈ పరిస్థితికి కోవిడ్–19 దెబ్బకొట్టింది. కరోనా నేపథ్యంలో చాలామంది ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయి. 2022 సగం పూర్తయినా, మెజారిటీ ప్రజాలు ఇంకా 1.90 డాలర్లకన్నా తక్కువ సంపాదనతోనే జీవనం వెల్లదీస్తున్నారు.
► ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ పురోగతి అసమానంగా ఉంది. దీర్ఘకాలిక సవాళ్లు కొనసాగుతూనే ఉంటాయి.
► ఆహార భద్రత, ఆరోగ్య సేవలు, విద్యా రంగాల్లో పురోగతి కనిపించడం లేదు.
► ప్రతి ఒక్కరికీ మరింతంగా సమాన ఆర్థిక అవకాశాలను అలాగే ఎక్కువ క్రియాశీలతను అందించడానికి ఈ ప్రాంతంలోని ప్రభుత్వాలు పటిష్ట చర్యలను, సమగ్ర విధానాలను తీసుకురావడంపై దృష్టి పెట్టాలి.
► ఆసియా పసిఫిక్‌లో తీవ్ర పేదరికం 2030 నాటికి 1 శాతం కంటే తక్కువగా ఉంటుందని అంచనా. దాదాపు 25 శాతం జనాభా కనీసం మధ్యతరగతి స్థితికి చేరుకోవచ్చు. అంటే ఆయా వర్గం ప్రజలు రోజుకు 15 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం/వినియోగ సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు. అయితే ఇందుకు మొబిలిటీలో అవరోధాలు, ఇతర అనిశ్చితులు ఎదురుకాకుండా ఉండాలి.
► అభివృద్ధి చెందుతున్న ఆసియా ప్రస్తుతం స్టాగ్‌ఫ్లేషన్ (ధరల తీవ్రత, వృద్ధి మందగమన) సమస్యలను ఎదుర్కొంటోంది. భౌగోళిక ఉద్రిక్తతలు ఆహార భద్రతకు సవాళ్లను సృష్టించడంతోపాటు ఇంధన ధరల తీవ్రతకు కారణమవుతున్నాయి.
పేదరికంపై ఆసియా పసిఫిక్ పోరాటానికి కరోనా ఎదురుదెబ్బ
Published Thu, Aug 25 2022 6:19 AM | Last Updated on Thu, Aug 25 2022 6:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment