న్యూఢిల్లీ: కోవిడ్ ప్రేరిత ఆరోగ్య సంక్షోభం పూర్తిస్థాయి ఆర్థిక విపత్తుగా మారకుండా వర్థమాన దేశాలకు తగిన సహాయం అందించాలని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)సహా వివిధ బహుళజాతి రుణ సంస్థలకు భారత్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం విజ్ఞప్తి చేశారు. మనీలా (ఫిలిప్పైన్స్) ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడీబీ, గవర్నర్ల బోర్డు 54వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆర్థికమంత్రి ప్రసంగించారు. వర్థమాన దేశాలపై దీర్ఘకాలంలో మహమ్మారి ప్రభావం పడకుండా చూడడానికి ‘‘సమన్వయ, సమ్మిళిత’’ అంతర్జాతీయ వ్యూహం అవసరమని ఆమె ఈ వెర్చువల్ సదస్సులో పేర్కొన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో జరిగిన రెండవ ఏడీబీ గవర్నర్ల బోర్డ్ వెర్చువల్ సమావేశమిది. తాజా సమావేశంలో ఆర్థికమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
►2020 తొలి ఆరు నెలల కాలంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అన్నీ కరోనా ప్రేరిత సవాళ్ల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. అయితే అటు తర్వాత మళ్లీ రికవరీ జాడలు కనిపించాయి. అయితే ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త కేసుల నేపథ్యలో ఆర్థిక రికవరీని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రస్తుతం మనముందు ఉంది.
►ప్రపంచ ఆర్థిక ఫలాలను సంరక్షించుకోడానికి అభివృద్ధి చెందిన దేశాలు, అలాగే బహుళజాతి బ్యాంకింగ్ సంస్థలు వర్థమాన సభ్య దేశాల (డీఎంసీ) తరఫున నిలవాలి.
►జాగ్రత్తగా పరిశీలిస్తే, కొన్ని సంవత్సరాల నుంచీ పేదరికం క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే 2020వ సంవత్సరం.. ఒక్కసారిగా 7.8 కోట్ల మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టేసింది. సంపద అసమానతలు భారీగా పెరిగిపోయాయి.
►మహమ్మారి తలెత్తడంతోటే ఈ సవాళ్లను అడ్డుకోడానికి ఏడీబీ తన వంతు ప్రయత్నాన్ని సమర్థవంతంగా నిర్వహించింది. దేశాల ఎకానమీలు, అలాగే ఆరోగ్య వ్యవస్థలకు తోడ్పాటును అందించింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ విస్తృతికి కృషి చేస్తోంది. భారత్ విషయంలో కోవిడ్, నాన్–కోవిడ్ ప్రాజెక్టులకు ఏడీబీ సకాలంలో తగిన మద్దతును అందజేసింది.
►గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020లో క్షీణతలోకి జారిపోయింది. వృద్ధి రికవరీలో తీవ్ర విఘాతం ఏర్పడింది. వర్థమాన దేశాల దీర్ఘకాల పురోభివృద్ధి లక్ష్యాలను గండి పడింది.
►కోవిడ్ తదనంతర ఎకానమీలు కోవిడ్ ముందస్తు ఎకానమీల అంత పటిష్టంగా ఉండజాలవు. దీర్ఘకాల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రస్తుతం అంతర్జాతీయంగా అన్ని దేశాల సమన్వయ సహకారం అవసరం.
►2021–22లో 12.5 శాతం పటిష్ట వృద్ధి ఉంటుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలతో 2021ని భారత్ ఎంతో ఆశావహంగా ప్రారంభించింది. అయితే దేశం ప్రస్తుతం సెకండ్‌వేవ్ కోవిడ్ సవాళ్లను ఎదుర్కొంటోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆరోగ్య రక్షణ వ్యవస్త తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఎకనమీ రికవరీ ప్రక్రియకు తాజా పరిస్థితి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి మద్దతుగా సహాయం అందిస్తున్న అంతర్జాతీయ సమాజానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుం టోంది. కోవిడ్ బారిన పడిన ప్రజలకు సకాలంలో చికిత్స అందేందుకు తగిన కృషి జరుగుతోంది. అదే సమయంలో ఎకానమీ పట్టాలు తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కష్టాల నుంచి భారత్ గట్టెకుతుందన్న గట్టి విశ్వాసం ఉంది.
►దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థాన్ని పెంచుతున్నాము. వ్యాక్సినేషన్ విస్తృతికి తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటున్నాము.
►ఏడీబీ రుణ సామర్థ్యాలు మరింత పెరగడానికి తగిన చర్యలు ఉండాలి. సావరిన్ రుణాల విషయంలో ఏడీబీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రైవేటు రంగ భాగస్వామ్యం ఆకర్షణ విషయంలో బ్యాంక్ మరింత తగిన , వినూత్న ఫైనాన్షింగ్ ఇన్‌స్ట్రమెంట్స్‌ను ఆవిష్కరించాలి. ప్రైవేటు రంగంలో మరింత క్రియాశీల చర్యల కోసం ముంబైలో ప్రైవేట్ రంగ ఆఫరేషన్స్ బ్రాంచ్ ఆఫీస్‌ను ఏడీబీ ఏర్పాటు చేయాలి.
►ప్రాంతీయ సమగ్ర అభివృద్ధికి ఉద్ధేశించిన సౌత్ ఆసియా సబ్–రీజినల్ ఎకనమిక్ కో–ఆపరేషన్ (ఎస్‌ఏఎస్‌ఈసీ) సెక్రటేరియట్‌ను భారత్‌లో ఏర్పాటు చేయాలని ఏడీబీని కోరుతున్నాం.
ఆరోగ్య రంగంపై పెట్టుబడులే కీలకం: ఏడీబీ
ఇదిలావుండగా, మహమ్మరి కరోనా సవాళ్ల నుంచి బయటపడ్డానికి ఆరోగ్యం, విద్య, సామాజిక రంగాలపై పెట్టుబడులే ప్రస్తుతం కీలకమని ఏడీబీ బుధవారం పేర్కొంది. ఆయా అంశాలతో పాటు సమగ్ర ప్రాంతీయ సహకారం ప్రస్తుతం ఆసియా పసిఫిక్ ప్రాంతానికి కీలకమని తెలిపింది. బుధవారం ముగిసిన మూడు రోజుల గవర్నర్ల బోర్డ్ సమావేశంలో ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సుగు అసకావా మాట్లాడుతూ, కోవిడ్–19 కష్టాల నుంచి ఆసియా గట్టెక్కుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.పర్యావరణం, అసమానత, మౌలిక రంగం, ప్రాంతాయ సహకారం, వనరుల సమీకరణ వంటి అంశాల్లో సాధించిన ప్రగతిని మించి కోవిడ్–19పై ఈ ప్రాంతం విజయం సాధిస్తుం దన్న భరోసా ఉందని అన్నారు. ఇందుకు ఏడీబీ తగిన సహాయసహకారాలను అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే 20 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఏడీబీ అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే సహకారం మున్ముందూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే మహమ్మారి వల్ల ఏడీబీ ఇప్పటికే చేపట్టిన పథకాల అమల్లో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తబోవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment