న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం నిర్వహించిన చక్కని ఆర్థిక నిర్వహణ వల్ల భారత్ ‘‘అత్యంత రుణగ్రస్తుల దేశం’’ సంక్షోభంలోకి పోకుండా రక్షణ పొందిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘భారతదేశం అప్పులు అధిక స్థాయికి పెరిగిపోయాయని ఆరోపిస్తున్న వారే మహమ్మారి సమయంలో డబ్బును ముద్రించి పంపిణీ చేయమని ప్రభుత్వానికి సలహా ఇచ్చిన వ్యక్తులు’’ ఆమె విమర్శించారు.
ప్రభుత్వం వారి సలహాను ఆమోదించినట్లయితే, భారత్ ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కాకుండా అత్యంత రుణగ్రస్తుల దేశంగా మారిపోయి ఉండేదని బీజేపీ ’మహాజన్ స్మా్పర్క్ అభియాన్’లో భాగంగా ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె అన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, అప్పులపై భారత్ ఆందోళన చెందనక్కర్లేదని ఉద్ఘాటించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సీతారామన్, ఇటీవల తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, ఆప్ ప్రభుత్వానికిచెందిన పలువురు మంత్రులు జైలులో ఉన్నారని అన్నారు.
ప్రభుత్వ రుణ భారాలు ఇలా...
2002 సెప్టెంబర్ నాటికి భారత్ ప్రభుత్వ మొత్తం రుణ భారం రూ.147 లక్షల కోట్లు ఉంటే, డిసెంబర్ త్రైమాసికానికి ఇది 2.6 శాతం పెరిగి రూ.151 లక్షల కోట్లకు ఎగసింది. మొత్తం రుణాల్లో పబ్లిక్‌కు చెల్లించాల్సింది 89 శాతం. సెప్టెంబర్ 89.1 శాతంతో పోల్చితే ఇది తగ్గింది. భారత్ మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం పురోగమించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డాలర్లలో చూస్తే, 3.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2023 క్యాలెండర్ ఇయర్‌లో 3.7 ట్రిలియన్ డాలర్లకు
చేరుతుందని అంచనా.
భారత్ రుణ భారం తగ్గే అవకాశం: మూడీస్
ఇదిలాఉండగా, భారత్ రుణ భారం తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం నాడు ఒక నివేదికలో పేర్కొంది. భారత్ ఆర్థిక బలం, పటిష్ట రుణ చెల్లింపుల పరిస్థితులను ఈ సందర్భంగా మూడీస్ ప్రస్తావించింది. ‘‘భారత్ పటిష్ట జీడీపీ వృద్ధి రేటును కొనసాగించినంతకాలం దేశ రుణ భారం స్థిరంగా ఉంటుంది లేదా కొద్దిగా తగ్గుతుంది‘ అని మూడీస్ తాజా నోట్‌లో పేర్కొంది. స్థిర అవుట్‌లుక్‌తో మూడీస్ భారత్‌కు అతితక్కువ పెట్టుబడుల గ్రేడ్– బీఏఏ3 సావరిన్ రేటింగ్‌ను ఇస్తోంది. రేటింగ్ పెంపుపై భారత్ అధికారులు మూడీస్ ప్రతినిధులతో శుక్రవారం సమావేశం కానున్నారు. ఒక దేశంలో పెట్టుబడులకు పెట్టుబడిదారులు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థలు ఇచ్చే రేటింగ్‌పై ఆధారపడే సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment