Financial management
-
భారత్ అప్పుపై ఆందోళన అక్కర్లేదు
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం నిర్వహించిన చక్కని ఆర్థిక నిర్వహణ వల్ల భారత్ ‘‘అత్యంత రుణగ్రస్తుల దేశం’’ సంక్షోభంలోకి పోకుండా రక్షణ పొందిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘భారతదేశం అప్పులు అధిక స్థాయికి పెరిగిపోయాయని ఆరోపిస్తున్న వారే మహమ్మారి సమయంలో డబ్బును ముద్రించి పంపిణీ చేయమని ప్రభుత్వానికి సలహా ఇచ్చిన వ్యక్తులు’’ ఆమె విమర్శించారు. ప్రభుత్వం వారి సలహాను ఆమోదించినట్లయితే, భారత్ ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కాకుండా అత్యంత రుణగ్రస్తుల దేశంగా మారిపోయి ఉండేదని బీజేపీ ’మహాజన్ స్మా్పర్క్ అభియాన్’లో భాగంగా ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె అన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, అప్పులపై భారత్ ఆందోళన చెందనక్కర్లేదని ఉద్ఘాటించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సీతారామన్, ఇటీవల తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, ఆప్ ప్రభుత్వానికిచెందిన పలువురు మంత్రులు జైలులో ఉన్నారని అన్నారు. ప్రభుత్వ రుణ భారాలు ఇలా... 2002 సెప్టెంబర్ నాటికి భారత్ ప్రభుత్వ మొత్తం రుణ భారం రూ.147 లక్షల కోట్లు ఉంటే, డిసెంబర్ త్రైమాసికానికి ఇది 2.6 శాతం పెరిగి రూ.151 లక్షల కోట్లకు ఎగసింది. మొత్తం రుణాల్లో పబ్లిక్కు చెల్లించాల్సింది 89 శాతం. సెప్టెంబర్ 89.1 శాతంతో పోల్చితే ఇది తగ్గింది. భారత్ మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం పురోగమించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డాలర్లలో చూస్తే, 3.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2023 క్యాలెండర్ ఇయర్లో 3.7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. భారత్ రుణ భారం తగ్గే అవకాశం: మూడీస్ ఇదిలాఉండగా, భారత్ రుణ భారం తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం నాడు ఒక నివేదికలో పేర్కొంది. భారత్ ఆర్థిక బలం, పటిష్ట రుణ చెల్లింపుల పరిస్థితులను ఈ సందర్భంగా మూడీస్ ప్రస్తావించింది. ‘‘భారత్ పటిష్ట జీడీపీ వృద్ధి రేటును కొనసాగించినంతకాలం దేశ రుణ భారం స్థిరంగా ఉంటుంది లేదా కొద్దిగా తగ్గుతుంది‘ అని మూడీస్ తాజా నోట్లో పేర్కొంది. స్థిర అవుట్‌లుక్‌తో మూడీస్ భారత్‌కు అతితక్కువ పెట్టుబడుల గ్రేడ్– బీఏఏ3 సావరిన్ రేటింగ్‌ను ఇస్తోంది. రేటింగ్ పెంపుపై భారత్ అధికారులు మూడీస్ ప్రతినిధులతో శుక్రవారం సమావేశం కానున్నారు. ఒక దేశంలో పెట్టుబడులకు పెట్టుబడిదారులు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థలు ఇచ్చే రేటింగ్‌పై ఆధారపడే సంగతి తెలిసిందే. -
ఏపీకి రానున్న 15వ ఆర్ధిక సంఘం సభ్యులు
-
లోటులో రాష్ట్రం.. కావాలి ఊతం
సాక్షి, అమరావతి: ఓ వైపు రాష్ట్ర విభజన సమస్యలతో పాటు మరో వైపు గత ప్రభుత్వం విచక్షణ లేని అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడమే కాకుండా కొత్తగా అప్పులు చేసే వెసులు బాటు లేని స్థితిలోకి నెట్టిన వైనాన్ని, రూ.39,423 కోట్ల విలువైన 2,72,266 బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడిందని వివరించనుంది. ఈ కారణాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ, సామాజిక కార్యక్రమాల అమలు తీరును వివరించి సాయం కోరడంతో పాటు కేంద్రానికి రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ లోటు భర్తీ గ్రాంటును కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్‌ను జనరల్ కేటగిరీగా కాకుండా ప్రత్యేకంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించనుంది. రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు.. నవరత్నాల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును వివరించి ప్రత్యేక నిధులు కోరనుంది. ఈ నెల 18, 19, 20వ తేదీల్లో 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు రానుంది. ఈ మూడు రోజుల్లో ఒక రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం విన్నవించనున్న అంశాలు ► గ్రామ, పట్టణాల మధ్య పేదరికం, నిరుద్యోగం, అభివృద్ధిలో ఉన్న తారతమ్యాలు, వ్యత్యాసాలను తొలగించేందుకు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నందున 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.28,382 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.27,820 కోట్ల గ్రాంటును సిఫార్సు చేయాలి. ►73, 74 రాజ్యాంగ సవరణలకు లోబడి గ్రామ, పట్టణ స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, అధికార వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు. ఈ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా రూ.5,950 కోట్ల కేంద్ర సాయం అందేలా సిఫార్సు చేయాలి. ►మద్య నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలు, బార్లను తగ్గించినందున రాష్ట్రం ఆదాయాన్ని కోల్పోతోంది. సామాజిక బాధ్యతగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తున్నందున ఆ మేరకు ఆదుకునేలా సిఫార్సులు చేయాలి. ఈ విషయంలో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గుర్తించడంతో పాటు ఇందుకు తగిన బహుమతి కూడా ఇవ్వాలి. ►రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆదాయ, వ్యయాల్లో భారీ వ్యత్యాసం నెలకొందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ►అస్తవ్యస్థంగా ఉన్న భూ రికార్డుల ప్రక్షాళనకు సర్వే చేసేందుకు చట్టం తీసుకొచ్చామని, ఈ కార్యక్రమానికి రూ.1,667 కోట్ల కేంద్ర సాయం అందేలా సిఫార్సు చేయాలి. ►గతంలో పంజాబ్ రాష్ట్రానికి చేసిన తరహాలో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో ఉన్నందున రూ.11,039 కోట్ల (వచ్చే ఏడాది మార్చి 31 నాటికి) కేంద్ర రుణాలు మాఫీ చేస్తూ సిఫారసు చేయాలి. (తద్వారా కొత్త అప్పులకు అవకాశం ఉంటుంది) ►విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నందున పని తీరు ప్రోత్సాహకాలుగా ఆర్థిక సాయాన్ని సిఫార్సు చేయాలి. ►కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసే మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న 42 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. -
ఇంటి మనీ మేనేజర్ మీరేనా!
కుటుంబ ఆర్థిక నిర్వహణ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. సంపాదిస్తే సరిపోదు. ఆ సంపాదనని సరిగ్గా వినియోగించుకోవడమూ ఎంతో ముఖ్యం. డబ్బు నిర్వహణ సమర్ధంగా ఉంటే ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడుతుంది. విహార యాత్రలు, పిల్లల పెళ్లిళ్లు, భవిష్యత్తులో ఆస్తుల కొనుగోలు, ఒకవేళ రుణాలు ఏవైనా ఉంటే వాటిని సకాలంలో తీర్చడం.. ఇలా పలు కోణాల్లో కుటుంబ ఆర్థిక నిర్వహణ మంచి ఫలితాలను అందజేస్తుంది. తగిన ప్రణాళిక, ఆ ప్రణాళిక నిర్వహణ ద్వారా కుటుంబ ఆర్థిక బాట ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. ఇక ఇంట్లో ఉన్న పెద్దలు అందరూ సంపాదించేవారే అయితే... ఆ డబ్బు సమర్థవంతమైన నిర్వహణలో కుటుంబ సారథికి ఎన్నో మెళకువలు అవసరం. సంపాదించే వారికి వారివారి వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి. వారి ఇష్టాలు-అయిష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి. అదే సమయంలో కుటుంబ వ్యయాల విషయాలను ఆలోచించాలి. ఆయా అంశాల ప్రాతిపదికన ఇంటి పెద్ద డబ్బు నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. ఆర్థిక నిర్వహణ భారం కాకుండా తేలిగ్గా సాగిపోయేలా కొన్ని మెళకువలను చూస్తే... ఉమ్మడి అవగాహన ఉండాలి... ఇంట్లో సంపాదించేవారందరి మధ్యా రాబడి-వ్యయాల అంశాలపై ఉమ్మడి అవగాహన అవసరం. దీనివల్ల సంపాదించే కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి పొరపొచ్చాలకూ వీలుండదు. గృహ రుణం ఏదైనా ఉంటే- చెల్లింపులు, పిల్లల చదువులకు సంబంధించి ఫీజులు, టెలిఫోన్ చార్జీల వంటి ఇతర నెలవారీ చెల్లింపులు, కుటుంబ ఖర్చులు ఇలా ప్రతి అంశంపై ఉమ్మడి అవగాహనతో ముందుకు వెళ్లాలి. స్టీరింగ్ ఒకరివద్దే ఉండాలి... డబ్బు కుటుంబంలో పెద్దలందరూ సంపాదిస్తున్నా... నిర్వహణ ఒకరి చేతుల్లోనే ఉండడం మంచిది. దీనివల్ల కుటుంబంలో చక్కని ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది. సహజంగా మన సమాజంలో కుటుంబ పెద్దే ఇంటి ఆర్థిక బాధ్యతల నిర్వహిస్తుంటాడు. వ్యయానికి ఉమ్మడి నిబంధనలు..: వ్యయాల విషయంలో కుటుంబ సభ్యులు అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలు ఉండాలి. కొందరికి మినహాయింపులు ఇవ్వడం వల్ల అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చుచేయడంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి కుటుంబంలోని సభ్యులు అందరికీ మంచి అవగాహన అవసరం. ఈ విషయంలో కుటుంబ పెద్ద చేయాల్సింది ఎంతో ఉంటుంది. వ్యక్తిగత ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి... ఇంట్లో పలువురు సంపాదించేవారుంటే... మనీ మేనేజ్మెంట్ చేసే కుటుంబ పెద్ద వారి వ్యక్తిగత ప్రాధాన్యతలను అర్థం చేసుకోవాలి. అలాగే కుటుంబం పెద్దదైతే... డబ్బు ఆర్జించేవారి అలాగే సంపాదించనివారి ప్రాధాన్యతలనూ, అవసరాలనూ గుర్తెరగాలి. డబ్బు ఎవరికి ఎలా కేటాయించాలన్న అంశంపై ఒక నిర్దిష్టమైన అవగాహన అవసరం. ప్రాధాన్యతల క్రమంలో వ్యక్తుల అవసరాలకు డబ్బు కేటాయింపులు జరపాలి. పొదుపు ప్రాముఖ్యత గురించి కుటుంబ సభ్యులు అందరి మధ్యా అవగాహన పెంచడానికి కూడా కుటుంబ పెద్ద ప్రయత్నం చేయాలి. డబ్బు కేటాయింపు.. రుణ బకాయిల నెలవారీ చెల్లింపులు, చదువుకు సంబంధించి ఫీజులు, బీమా చెల్లింపులు వంటి అత్యవసర, తప్పనిసరి పేమెంట్లకు డబ్బు అప్పటికప్పుడు కాకుండా ముందే కేటాయింపులు జరుపుకుని, ముందుగానే డబ్బు సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల ఆర్థిక ఒత్తిడులను నివారించే వీలుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆయా అంశాలపై ముందుగానే చక్కటి అవగాహన అవసరం. ప్రతి ఒక్కరూ కుటుంబ వ్యయాల పైన పూర్తి బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో మెలగడానికి వీలవుతుంది.