లోటులో రాష్ట్రం.. కావాలి ఊతం | AP Govt To Demand 15th Finance Commission To Waive Central Debt | Sakshi
Sakshi News home page

లోటులో రాష్ట్రం.. కావాలి ఊతం

Published Mon, Dec 16 2019 2:46 AM | Last Updated on Mon, Dec 16 2019 8:01 AM

AP Govt To Demand 15th Finance Commission To Waive Central Debt - Sakshi

సాక్షి, అమరావతి: ఓ వైపు రాష్ట్ర విభజన సమస్యలతో పాటు మరో వైపు గత ప్రభుత్వం విచక్షణ లేని అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడమే కాకుండా కొత్తగా అప్పులు చేసే వెసులు బాటు లేని స్థితిలోకి నెట్టిన వైనాన్ని, రూ.39,423 కోట్ల విలువైన 2,72,266 బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడిందని వివరించనుంది. ఈ కారణాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ, సామాజిక కార్యక్రమాల అమలు తీరును వివరించి సాయం కోరడంతో పాటు కేంద్రానికి రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది.

రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ లోటు భర్తీ గ్రాంటును కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్‌ను జనరల్‌ కేటగిరీగా కాకుండా ప్రత్యేకంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించనుంది. రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు.. నవరత్నాల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును వివరించి ప్రత్యేక నిధులు కోరనుంది. ఈ నెల 18, 19, 20వ తేదీల్లో 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు రానుంది. ఈ మూడు రోజుల్లో ఒక రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానుంది.

రాష్ట్ర ప్రభుత్వం విన్నవించనున్న అంశాలు
► గ్రామ, పట్టణాల మధ్య పేదరికం, నిరుద్యోగం, అభివృద్ధిలో ఉన్న తారతమ్యాలు, వ్యత్యాసాలను తొలగించేందుకు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నందున 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.28,382 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.27,820 కోట్ల గ్రాంటును సిఫార్సు చేయాలి.
►73, 74 రాజ్యాంగ సవరణలకు లోబడి గ్రామ, పట్టణ స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, అధికార వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు. ఈ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా రూ.5,950 కోట్ల కేంద్ర సాయం అందేలా సిఫార్సు చేయాలి.
►మద్య నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలు, బార్లను తగ్గించినందున రాష్ట్రం ఆదాయాన్ని కోల్పోతోంది. సామాజిక బాధ్యతగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తున్నందున ఆ మేరకు ఆదుకునేలా సిఫార్సులు చేయాలి. ఈ విషయంలో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గుర్తించడంతో పాటు ఇందుకు తగిన బహుమతి కూడా ఇవ్వాలి.
►రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆదాయ, వ్యయాల్లో భారీ వ్యత్యాసం నెలకొందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
►అస్తవ్యస్థంగా ఉన్న భూ రికార్డుల ప్రక్షాళనకు సర్వే చేసేందుకు చట్టం తీసుకొచ్చామని, ఈ కార్యక్రమానికి రూ.1,667 కోట్ల కేంద్ర సాయం అందేలా సిఫార్సు చేయాలి.
►గతంలో పంజాబ్‌ రాష్ట్రానికి చేసిన తరహాలో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో ఉన్నందున రూ.11,039 కోట్ల (వచ్చే ఏడాది మార్చి 31 నాటికి) కేంద్ర రుణాలు మాఫీ చేస్తూ సిఫారసు చేయాలి. (తద్వారా కొత్త అప్పులకు అవకాశం ఉంటుంది)
►విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నందున పని తీరు ప్రోత్సాహకాలుగా ఆర్థిక సాయాన్ని సిఫార్సు చేయాలి.
►కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసే మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న 42 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement