రెండో రోజూనరకాసుర వధ
- హామీలు అమలు చేయాల్సిందే
- రుణమాఫీ పరిమితులపై నిరసన
- కొనసాగిన వైఎస్సార్‌సీపీ ఆందోళన
సాక్షి, విశాఖపట్నం : రుణ మాఫీపై ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీపై పరిమితులు విధించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు రెండో రోజూ ఉద్యమించారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నరకాసుర వధ పేరిట మూడు రోజుల ఆందోళనకు పిలుపునిచ్చిన విషయంతెలిసిందే.
ఇందులో భాగం గా శుక్రవారం కూడా జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. రైతులు, డ్వాక్రా మహిళలతో కలిసి రాస్తారోకో, ధర్నా, మానవహారాలు నిర్వహిం చారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మల్ని ఊరేగించి, దహనం చేశారు. ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నేతృత్వంలో మండల కేంద్రంలోని వారపు సంతలో చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు.
పాయకరావుపేటలోని సత్యవరంలో జెడ్పీటీసీ చిక్కాల రామారావు ఆధ్వర్యంలో రాస్తారోకో, మానవహారం నిర్వహించి, చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
అరకు నియోజకవర్గం పెదబయలులో ఎంపీపీ సల్లంగి ఉమామహేశ్వరరావు, జెడ్‌పీటీసీ జర్సింగి గంగాభవాని ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్‌లో, ఎంపీపీ వి.జమున ఆధ్వర్యంలో డుంబ్రిగుడలో, అరకులోయ అంబేద్కర్ జంక్షన్‌లో ఎంపీపీ కార్తికో అరుణకుమారి ఆధ్వర్యంలో రాస్తారోకో, మానవ హారం నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనకాపల్లి నియోజకవర్గం కశింకోటలో మలసాల కిశోర్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వరకు చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు.
చోడవరం నియోజకవర్గం రావికమతం కొత్తకోటలో నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పిలుపుమేరకు ఆందోళనచేపట్టారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
మాడుగుల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడు నేతృత్వంలో ఘాట్ రోడ్డు జంక్షన్, చీడికాడలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.వి.జి.కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు పి.సత్యవతి ఖండివరంలో మానవహారం నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.