
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భారత్‌కు సాయంగా నిలిచేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ముందుకొచ్చింది. భారత్‌కు 1.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 11.3 వేల కోట్లు) రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం, నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు పేదలకు భద్రత కల్పించేందుకు ఈ రుణం అందజేయనున్నట్టు తెలిపింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో భారత ప్రభుత్వానికి మద్దుతుగా నిలవడానికి కట్టుబడి ఉన్నామని ఏడీబీ అధ్యక్షుడు మసత్సుగు అసకావా చెప్పారు.
‘భారత్ చేపడుతున్న కరోనా నివారణ చర్యలకు మద్దతుగా నిలవాని మేము నిర్ణయం తీసుకున్నాం. భారత ప్రజలకు.. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాలకు సమర్ధవంతమైన సాయం అందించేలా చూడాలని అనుకుంటున్నాం’ అని అసకావా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటివరకు 31,332 కరోనా కేసులు నమోదు కాగా, 1007 మంది మృతిచెందారు. 7,695 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment