న్యూఢిల్లీ: భారత ఎఫ్‌ఎంసీజీ రంగం మందగమన పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2021లో పట్టణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ వినియోగం తగ్గుముఖం పట్టగా, గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా క్షీణతను చూవిచూసినట్టు డేటా విశ్లేషణ సంస్థ నీల్సన్ ఐక్యూ తెలిపింది. అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు కంపెనీలు ధరల పెంపును చేపట్టాల్సిన పరిస్థితుల్లోకి వెళ్లేలా చేసినట్టు పేర్కొంది. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకునేందుకు 2021లో వరుసగా మూడు త్రైమాసికాల్లో రెండంకెల స్థాయిలో ధరలను పెంచినట్టు తెలిపింది. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో విక్రయాలు తగ్గిపోగా.. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధికి బదులు క్షీణతకు దారితీసినట్టు పేర్కొంది. 2021 చివరి త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల కారణంగా విక్రయాలు మైనస్ 2.6 శాతంగా ఉన్నట్టు వివరించింది.
‘‘ఎఫ్‌ఎంసీజీ కంపెనీల విక్రయాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35 శాతంగా ఉంది. కరోనా రెండో విడత కంపెనీలపై ఎక్కువ ప్రభావం చూపించింది. గత డిసెంబర్ త్రైమాసికంలో హెచ్‌యూఎల్ గణాంకాలను పరిశీలించినా గ్రామీణ మార్కెట్ల విక్రయాలు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ధరల పెంపు చిన్న తయారీ దారులపై ప్రభావం చూపిస్తుంది. అధిక వ్యయాలను వినియోగదారులకు బదిలీ చేయలేని పరిస్థితుల్లో రూ.100 కోట్లు, అంతకంటే తక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీల అమ్మకాలు 13 శాతం తగ్గాయి’’ అని నీల్సన్ ఐక్యూ నివేదిక తెలియజేసింది. అదే సమయంలో మధ్యస్థ, పెద్ద కంపెనీలు స్థిరమైన పనితీరు చూపించినట్టు పేర్కొంది. గడిచిన రెండేళ్లలో కొత్తగా 8 లక్షల ఎఫ్‌ఎంసీజీ స్టోర్లు తెరుచుకున్నాయని.. ఇందులో సగం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు అయినట్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment