న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు ఇంకా ముగిసిపోలేదు. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మందగమనం, తయారీ వ్యయాలు పెరిగిపోవడం తదితర సవాళ్ల నుంచి అవి గట్టెక్కాల్సి ఉంది. కాకపోతే రానున్న నెలల్లో పరిస్థితులు సానుకూలిస్తాయన్న అంచనాలతో కంపెనీలు ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ2) విక్రయాలు స్తబ్దుగా ఉన్నట్టు ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలైన మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్, డాబర్ ప్రకటించాయి. వీటి అమ్మకాల్లో వృద్ధి ఒక అంకెకే పరిమితమైంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిల్లో ఉండడాన్ని అవి ప్రధానంగా ప్రస్తావించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన రెండు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం నెమ్మదించి, పండుగల సీజన్ కారణంగా వినియోగం పుంజుకుంటుందని ఇవి అంచనా వేస్తున్నాయి.
వినియోగం పుంజుకుంటుంది..
‘‘కమోడిటీల ధరలు దిగిరావడంతో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు నెమ్మదించనున్నాయి. వర్షాలు కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా అంచనాలకు తగ్గట్టే ఉన్నాయి. దీంతో వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో పుంజుకుంటుందని అంచనా వేస్తున్నాం’’అని గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ పేర్కొంది. సఫోలా, ప్యారాచూట్ తదితర ప్రముఖ బ్రాండ్లను కలిగిన మారికో సైతం విక్రయాల్లో వృద్ధి ఒక అంకెకే పరిమితమైనట్టు ప్రకటించింది. ‘‘డిమాండ్ సెంటిమెంట్ అంతకుముందు త్రైమాసికం మాదిరే క్యూ2లోనూ కొనసాగింది. కాకపోతే చివరి నెలలో (సెప్టెంబర్) కాస్త పుంజుకుంది. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు బలహీనంగా ఉండడం కనిపించింది’’అని మారికో తెలిపింది.
కాకపోతే పట్టణ ప్రాంతాలు, ప్రీమియం ఉత్పత్తుల విక్రయాలు మెరుగ్గా ఉండడం కంపెనీలకు కాస్తంత వెసులుబాటు ఇస్తోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని, ద్వితీయ ఆరు నెలల కాలంలో విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్టు మారికో తెలిపింది. అధిక పంటల దిగుబడి, పండుగల సీజన్ సానుకూలిస్తుందని అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల పెరిగిపోయిన ద్రవ్యోల్బణం ప్రభావం వ్యాపారంపై క్యూ2లోనూ కొనసాగినట్టు డాబర్ వెల్లడించింది. దీంతో అన్ని విభాగాల్లో డిమాండ్ బలహీనంగా ఉందని తెలిపింది. పట్టణాలు, ఈ కామర్స్ వేదికల్లో మాత్రం విక్రయాలు రెండంకెల వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగి రావడం, పండుగల సీజన్ వల్ల రానున్న నెలల్లో విక్రయాలు మెరుగుపడతాయని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment