ద్రవ్యోల్బణంతో తగ్గుతున్న అమ్మకాలు
వంటనూనెలు, కొబ్బరి, పామాయిల్ వంటి కీలక ముడిసరుకుల రేట్లు పెరిగిపోవడం, ధరల పెంపుపరంగా తీసుకున్న చర్యలు మొదలైనవన్నీ ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (FMCG) కంపెనీలకు సవాలుగా మారాయి. వీటి కారణంగా అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు నెమ్మదించడం, స్థూల మార్జిన్లు క్షీణించడంతో పాటు నిర్వహణ లాభాలు ఒక మోస్తరు స్థాయిలోనే ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. పలు ఎఫ్‌ఎంసీజీ సంస్థల ఆదాయ వృద్ధి కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
డాబర్(Dabur), మారికో తదితర లిస్టెడ్ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు సంబంధించి ఇచ్చిన అప్‌డేట్‌లను బట్టి చూస్తే అమ్మకాల వృద్ధి అదే స్థాయిలో లేదా కనిష్ట సింగిల్–డిజిట్ స్థాయిలోనో ఉండొచ్చని విశ్లేషకులు తెలిపారు. ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం కారణంగా పట్టణ ప్రాంతాల్లో వినియోగం తగ్గిపోయిందన్నారు. ముడి వస్తువుల ధరల పెరుగుదలవల్ల ఉత్పత్తుల రేట్లను తప్పనిసరిగా పెంచాల్సి రావడం పరిశ్రమకు కాస్త ప్రతికూలం కాగలదని వివరించారు. డిసెంబర్ క్వార్టర్‌లో కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్‌కు పరిమితం కావచ్చని డాబర్ అంచనా వేస్తోంది. క్యూ3లో కొన్ని సెగ్మెంట్లలో నెలకొన్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను, వ్యయాల తగ్గింపు, ఉత్పత్తుల రేట్లను కొంత మేర పెంచడం ద్వారా ఎదుర్కొన్నట్లు డాబర్ తెలిపింది.
మెరుగ్గా గ్రామీణం ..
పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం మరింత వేగంగా వృద్ధి చెందినట్లు డాబర్ చ్యవన్‌ప్రాశ, వాటికా తదితర బ్రాండ్లను తయారు చేసే డాబర్ వెల్లడించింది. ఈ–కామర్స్(E-Commerce), క్విక్ కామర్స్ వంటి ప్రత్యామ్నాయ మాధ్యమాలు వృద్ధి చెందుతుండగా, కిరాణా స్టోర్స్ వంటి విభాగాల్లో కొంత ఒత్తిడి నెలకొన్నట్లు వివరించింది. మారికో కూడా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం దన్నుతో డిమాండ్ స్థిరపడుతున్న ధోరణులు కనిపిస్తున్నాయని తెలిపింది. డిసెంబర్ క్వార్టర్లో వార్షిక ప్రాతిపదికన దేశీయంగా అమ్మకాల పరిమాణం వృద్ధి చెందవచ్చని, కానీ ముడి సరుకుల రేట్లు అధికంగా ఉన్నందున సీక్వెన్షియల్ ప్రాతిపదికన నిర్వహణ లాభాల వృద్ధి ఒక మోస్తరు స్థాయిలోనే ఉండొచ్చని వివరించింది.
ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్.. తులం ఎంతంటే..
ముడిసరుకుల రేట్లు ఊహించిన దాని కన్నా అధికంగా పెరిగిపోవడంతో స్థూల మార్జిన్లు ముందుగా అనుకున్న దానికంటే తక్కువగా ఉండొచ్చని మారికో పేర్కొంది. సఫోలా(Safola), పారాచూట్, హెయిర్ అండ్ కేర్, నిహార్, లివాన్ తదితర ఉత్పత్తులను కంపెనీ విక్రయిస్తోంది. పట్టణాల్లో ఇంకో మూడు క్వార్టర్లు ఇలాగే ..ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వేతనాల వృద్ధి అంతంతమాత్రంగాన ఉండటం, ఇళ్ల అద్దెలు భారీగా పెరిగిపోవడంతో పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని వెల్త్ మేనేజ్‌మెంట్ సేవల సంస్థ నువామా తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో మందగమనం మరో రెండు, మూడు త్రైమాసికాలపాటు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ క్రమంగా పుంజుకుంటోందని, మెరుగైన వర్షపాతం, ఉచిత పథకాలు మొదలైన అంశాల కారణంగా పట్టణ ప్రాంత డిమాండ్‌ను దాటేయొచ్చని పేర్కొంది.
చిన్న ప్యాక్‌లవైపే మొగ్గు
సబ్బులు, స్నాక్స్, టీ మొదలైన వాటి విషయంలో ధరల పెంపు కారణంగా వినియోగదారులు చిన్న ప్యాక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారని నువామా తెలిపింది. కొన్ని ముడి సరుకులకు సంబంధించి వార్షికంగా ద్రవ్యోల్బణం దాదాపు 30 శాతం పెరిగిందని, దీంతో సబ్బులు, టీ, స్నాక్స్ వంటి ఉత్పత్తులకు సంబంధించి మార్జిన్లు గణనీయంగా తగ్గొచ్చని వివరించింది. ఇక చలికాలం రావడం కూడా కాస్త ఆలస్యం కావడంతో బాడీ లోషన్, చ్యవన్‌ప్రాశ్ వంటి నిర్దిష్ట సీజన్ ఉత్పత్తులపై ప్రభావం పడుతోంది. డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్లు, క్విక్ కామర్స్ వేగంగా వృద్ధి చెందుతుండటం వల్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment