న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ జూన్ త్రైమాసికంలో మోస్తరు వృద్ధిని చూసింది. విలువ పరంగా వ్యాపారం 10.9 శాతం పెరిగింది. ఆహారేతర వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో తగినప్పటికీ.. మొత్తం మీద వినియోగం పెరగడం కలిసొచ్చింది. డేటా విశ్లేషణ సంస్థ నీల్సన్‌ఐక్యూ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.
మొత్తం మీద వినియోగం మళ్లీ పుంజుకుంటున్నట్టు పేర్కొంది. త్రైమాసికం వారీగా చూస్తే ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో యూనిట్ పరిమాణం పెరిగిందని, వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు తగ్గినట్టు వివరించింది. పరిమాణం పరంగా సానుకూల ధోరణి ఉండొచ్చని, దీనికితోడు ధరల ఆధారిత వృద్ధి కూడా ఉంటుందని అంచనా వేసింది. గడిచిన ఐదేళ్లలో రెండంకెల వృద్ధి నమోదైనట్టు నీల్సన్ ఐక్యూ ఎండీ సతీష్ పిళ్లై (భారత్) చెప్పారు.
గత ఐదు త్రైమాసికాలుగా రెండంకెల స్థాయిలో ధరల పెరుగుదలను చూస్తున్నట్టు తెలిపారు. ద్రవ్యోల్బణం, ఇతరస్థూల ఆర్థిక గణాంకాలను ప్రస్తావించారు. ఎఫ్‌ఎంసీజీలో ఈ ఏడాది రెండంకెల వృద్ధి నమోదవుతుందని నీల్సన్‌ఐక్యూ అంచనా వేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రికవరీ కనిపిస్తోందని.. కొంత నిదానంగా అయినా గ్రామీణ ప్రాంతాల్లోనూ వినియోగం పెరగొచ్చని అంచనా వేసింది. రూ.100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలు జూన్ త్రైమాసికంలో విక్రయాల పరంగా వృద్ధిని నమోదు చేశాయి.
చదవండి👉 'ఏం కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు' తగ్గిన అమ్మకాలతో కంపెనీలు లబోదిబో!
Comments
Please login to add a commentAdd a comment