
న్యూఢిల్లీ: పన్ను వివాదాల పరిష్కారానికి తీసుకువచ్చిన వివాద్ సే విశ్వాస్ పథకానికి ఆదాయపన్ను శాఖ తాజాగా తుది గడువును ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు 2025 ఏప్రిల్ 30లోగా పథకాన్ని వినియోగించుకునేందుకు డిక్లరేషన్‌ను సమర్పించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. తద్వారా 2024 అక్టోబర్1న ప్రవేశపెట్టిన ఈ పథకానికి తొలిసారి తుది గడువును సీబీడీటీ నోటిఫై చేసింది.
పన్ను సంబంధ బకాయిలపై ప్రత్యక్ష పన్నుల పథకాన్ని ఆశ్రయించేవారు ఈ నెల 30లోగా డిక్లరేషన్‌ను ఇవ్వవలసి ఉంటుందని ఆదాయపన్ను శాఖ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పన్ను సంబంధిత వివాదాలు లేదా వివిధ అప్పీళ్లలో భాగమైన పన్ను చెల్లింపుదారులు పథకాన్ని తుది గడువులోగా వినియోగించుకోవచ్చునని వివరించింది.
సుమారు 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను డిమాండ్ల ద్వారా రూ. 35 లక్షల కోట్లు వివిధ వివాదాలలో నమోదైన నేపథ్యంలో పథకానికి ప్రాధాన్యత ఏర్పడింది. పన్ను చెల్లింపుదారులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలంటే.. వివాదంలో ఉన్న పన్నుపై 110 శాతాన్ని చెల్లించవలసి ఉంటుంది. 2024 వివాద్ సే విశ్వాస్ పథకానికి 2024–25 బడ్జెట్‌లో తెరతీశారు. 2024 అక్టోబర్ 1న నోటిఫై చేశారు.