షాపింగ్‌ మాలే ఆఫీసు! | Offices in star hotels | Sakshi
Sakshi News home page

షాపింగ్‌ మాలే ఆఫీసు!

Published Tue, Jul 17 2018 12:22 AM | Last Updated on Tue, Jul 17 2018 3:24 PM

Offices in star hotels - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మాల్స్, స్టార్‌ హోటల్స్‌.. ఇపుడివి తినడానికో లేదా షాపింగ్‌ చేయడానికో మాత్రమే కాదు!! ఆఫీసులుగానూ మారుతున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఒక వాణిజ్య భవనంలో కో–వర్కింగ్‌ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు... ఇప్పుడు షాపింగ్‌ మాల్స్, స్టార్‌ హోటళ్లనూ కార్యాలయాలుగా కేటాయిస్తున్నాయి. పనిచేసే చోటే రిటైల్, ఫుడ్‌ వసతులూ ఉండటాన్ని కంపెనీలు సైతం స్వాగతిస్తుండటంతో కో–వర్కింగ్‌ సంస్థలు మాల్స్, హోటళ్ల వైపు దృష్టిసారించాయి.

దశాబ్ద కాలంగా దేశంలోని కార్యాలయాల్లో పని వాతావరణంలో విపరీతమైన మార్పులొచ్చాయి. ఆఫీసు డిజైన్, వసతులు, రంగులు వంటివి ఉద్యోగి నైపుణ్యం, ఉత్పాదకత, పని సంస్కృతిపై ప్రభావం చూపిస్తున్నాయనేది ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా అభిప్రాయం. కార్యాలయాల్లో గ్రీనరీ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు, వాసన వంటి వాటితో ఉద్యోగిపై పని ఒత్తిడి తగ్గుతుందని, దీంతో మరింత క్రియేటివిటీ బయటికొస్తుందని పరిశోధనల్లోనూ తేలింది.

ఆయా వసతులను అందుబాటు ధరల్లో కో–వర్కింగ్‌ స్పేస్‌ భర్తీ చేస్తుండటంతో ప్లగ్‌ అండ్‌ ప్లే ఆఫీసులకు డిమాండ్‌ పెరిగింది. దీంతో మధ్య తరహా, చిన్న, స్టార్టప్స్‌ మాత్రమే కాకుండా బహుళ జాతి సంస్థలు కూడా కో–వర్కింగ్‌ స్పేస్‌లో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి.

మెట్రో మాల్స్‌లో కో–వర్కింగ్‌..
త్వరలోనే హైటెక్‌ సిటీ, పంజగుట్ట, మలక్‌పేట్‌ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న హైదరాబాద్‌ మెట్రో మాల్స్‌లో కో–వర్కింగ్‌ స్పేస్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ కో–వర్కింగ్‌ కంపెనీ సంబంధిత సంస్థతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఢిల్లీకి చెందిన ‘ఆఫిస్‌’ సంస్థకు హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో 167 సీట్లు, కోల్‌కతాకు చెందిన అపీజే గ్రూప్‌కు పార్క్‌ హోటల్‌లో 475 సీట్ల కో–వర్కింగ్‌ స్పేస్‌ అందుబాటులో ఉంది.

ఆఫిస్‌కు గుర్గావ్‌లోని ఆంబియెన్స్‌ మాల్‌లో 592 సీట్లు, హీరా పన్నా మాల్‌లో 241 సీట్లు, పుణెలోని క్యూక్లియస్‌ మాల్‌లో 400 సీట్లు, రఘులీలా మాల్‌లో 1,000 సీట్లు కో–వర్కింగ్‌ స్పేస్‌ రూపంలో ఉన్నాయి. ముంబైకి చెందిన రీగస్‌కు ఢిల్లీలోని వసంత్‌ స్క్వేర్‌ మాల్, బెంగళూరులోని లగ్జరీ యూబీ సిటీ, చెన్నైలోని సిటీ సెంటర్‌లో కో–వర్కింగ్‌ స్పేస్‌ అందుబాటులో ఉంది.

20 లక్షల చ.అ.కు కో–వర్కింగ్‌ స్పేస్‌..
2010లో ప్రపంచవ్యాప్తంగా 600 సెంటర్లలో 21 వేల కో–వర్కింగ్‌ సీట్లుండగా.. ఇప్పుడవి 18,900 సెంటర్లలో 17 లక్షల సీట్లకు పెరిగాయి. మన దేశంలో ఏటా 4.1 కోట్ల చ.అ. కార్యాలయాల స్థల లావాదేవీలు జరుగుతుండగా.. ఇందులో 20 లక్షల చ.అ. స్థలం కో–వర్కింగ్‌ స్పేస్‌ ఉంటుందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలియజేసింది.

43 శాతం లావాదేవీలతో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా... తర్వాత ఎన్‌సీఆర్‌లో 16 శాతం, హైదరాబాద్‌ 15 శాతం, పుణె 12 శాతం, ముంబై 10 శాతం, అహ్మదాబాద్‌ 3 శాతం, చెన్నై 2 శాతం ఆక్రమించినట్లు సంస్థ తెలిపింది. ఏటా 30–40 శాతం వృద్ధి నమోదవుతోంది. ప్రస్తుతం దేశంలో రీగస్, వీవర్క్, కోవర్క్స్, ఐకివా, వర్క్‌ ఏ ఫీలా, టేబుల్‌ స్పేస్, ఆఫిస్, అపీజే, స్మార్ట్‌వర్క్స్‌ వంటి సుమారు 200 కో–వర్కింగ్‌ కంపెనీలు 400 సెంటర్లలో సేవలందిస్తున్నాయి.


మౌలిక వసతుల వ్యయం తగ్గుతుంది..
ఐటీ కారిడార్లు, అభివృద్ధి చెందిన వాణిజ్య ప్రాంతాల్లో స్థలాల ధరలు ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసే బదులు కో–వర్కింగ్‌ స్పేస్‌ను అద్దె తీసుకోవటం కంపెనీలకు సులువవుతోంది. ఇదే కో–వర్కింగ్‌ డిమాండ్‌కు ప్రధాన కారణమని ఆఫీస్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ అమిత్‌ రమణి ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌తో పోలిస్తే కో–వర్కింగ్‌ స్పేస్‌లో అద్దెలు 25% వరకు తక్కువ.

అంతేకాకుండా సాధారణ ఆఫీసులో సీట్లతో పోలిస్తే కో–వర్కింగ్‌ స్పేస్‌లో ఒక్కో సీటుకు 5–15% స్థలం ఆదా అవుతుంది. పైగా ప్రతి కంపెనీ ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే బదులు అన్ని కంపెనీలకు కలిపి ఒకటే పార్కింగ్, హౌస్‌ కీపింగ్, క్యాంటీన్, రిసెప్షన్‌ వంటి ఏర్పాట్లుంటాయి. దీంతో కంపెనీలకు మౌలిక వసతుల వ్యయం కూడా తగ్గుతుంది. అయితే  ఒకే చోట పలు కంపెనీల పనిచేస్తుండటంతో కంపెనీల డేటా భధ్రత ప్రధాన సమస్యని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.

గంట, రోజు, నెల వారీగా చార్జీలు..
ఒకే అంతస్తులో ఒక ఆఫీసు బదులు పలు రకాల చిన్న ఆఫీసులుండటాన్ని కో–వర్కింగ్‌ స్పేస్‌గా పిలుస్తారు. ప్రతి ఒక్కరికీ కావాల్సిన ప్రైవేట్‌ ఆఫీసు, ఫిక్స్‌డ్‌ డెస్క్‌లు, సమావేశ గది, క్యాబిన్ల వంటి సౌకర్యాలుంటాయి. కొరియర్, ఫుడ్, లాంజ్, ఎల్‌సీడీ, పార్కింగ్, ప్రింటర్, వైఫై, ప్రొజెక్టర్‌ వంటి ఆధునిక వసతులూ ఉంటాయి. కో–వర్కింగ్‌ ఆఫీసుల అద్దెలు గంట, రోజులు, నెల వారీగా ఉంటాయి.

హైదరాబాద్‌లో నెలకు ఒక సీటుకు రూ.5–10 వేలు, పుణెలో రూ.4–10 వేలు, గుర్గావ్‌లో రూ.7–17 వేలు, ముంబైలో రూ.9–30 వేలు, బెంగళూరులో రూ.4–15 వేలు, చెన్నైలో రూ.7–15 వేలుగా ఉన్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లిహిల్స్‌లో కో–వర్కింగ్‌ ఆఫీసులున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement