Co-Working Space
-
వియ్‌వర్క్ ఆదాయం జూమ్
న్యూఢిల్లీ: కోవర్కింగ్ కంపెనీ వియ్‌వర్క్ ఈ కేలండర్ ఏడాది(2022) ఆదాయంలో భారీ వృద్ధిని ఆశిస్తోంది. 70 శాతం అధికంగా రూ. 1,300 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లెగ్జిబుల్ ఆఫీసు స్పేస్‌కు పెరుగుతున్న డిమాండు నేపథ్యంలో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు కంపెనీ సీఈవో కరణ్ వీర్వాణీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది(2023)లోనూ ఇదే స్థాయి వృద్ధిని సాధించేందుకు వీలుగా పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరు కంపెనీ వియవర్క్ ఇండియా ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబైసహా ఆరు ప్రధాన నగరాలలో కార్యకలాపాలు కలిగి ఉంది. 6 మిలియన్ చదరపు అడుగుల విభిన్న వినియోగ కార్యాలయ ప్రాంతంతో పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకుంది. వీటిలో భాగంగా 41 కేంద్రాల ద్వారా 70,000 డెస్క్‌లను నిర్వహిస్తోంది. -
కోవర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ రెండింతలు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో కోవర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ రెండింతలు అయ్యి 90,200 డెస్క్‌లుగా ఉన్నట్టు జేఎల్ఎల్ ఇండియా, క్యూడెస్క్ సంయుక్త నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాలను ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది. ఏడు ప్రధాన పట్టణాల్లో 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవర్కింగ్ స్పేస్ డిమాండ్ 37,300 సీట్లుగా ఉంది. కార్యాలయ స్థలాన్ని పంచుకోవడమే కో వర్కింగ్ స్పేస్. ఒక్కరు విడిగా లేక ఇతరులతో కలసి ఉమ్మడిగా పనిచేసుకునే వేదిక. హైదరాబాద్ మార్కెట్లో కోవర్కింగ్ స్పేస్ డిమాండ్ 2021–22లో 11,312 డెస్క్‌లు (కూర్చుని పనిచేసే స్థానాలు)గా ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 15,659, ముంబైలో 14,900 డెస్క్‌లుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. సానుకూలతలు.. డిమాండ్‌కు తగ్గట్టు సేవలను కాంట్రాక్టుకు ఇచ్చేందుకు కంపెనీలు మొగ్గు చూపిస్తుండడం కోవర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ అధికం కావడానికి కారణమని ఈ నివేదిక తెలిపింది. స్వల్పకాలం పాటు లీజుకు తీసుకునే వెసులుబాటు, పూర్తి స్థాయి సేవలు, సౌకర్యాలు కోవర్కింగ్ స్పేస్‌కు అనుకూలతలుగా పేర్కొంది. 2021–22లో 62 శాతం డెస్క్‌లు ఆఫీస్ స్పేస్ కోసం వినియోగమయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 52 శాతంగా ఉంది. సంస్థలు పెరుగుతుండడమే ఈ విభాగంలో కోవర్కింగ్ స్పేస్ వినియోగం పెరగడానికి కారణంగా ఈ నివేదిక తెలిపింది. 2021–22లో మొత్తం లీజుకు ఇచ్చిన సీట్లలో సగానికి పైన.. 300 సీట్లు అంతకుమించి లావాదేవీలు ఉన్నాయి. మొత్తం లీజుకు ఇచ్చిన సీట్లలో 60 శాతాం వాటాను బెంగళూరు, పుణె, ఢిల్లీ ఎన్సీఆర్ నగరాలు ఆక్రమిస్తున్నాయి. చార్జీలు.. కోవర్కింగ్ స్పేస్ భవనాల్లో ఒక్కో సీటుకు నెలవారీగా లీజు రూ.6,300 నుంచి రూ.14,300 మధ్య ఉంది. అయితే, ముంబై, ఢిల్లీ వంటి పట్టణాల్లోని కీలక ప్రాంతాల్లో ఉన్న కోవర్కింగ్ స్పేస్ భవనాల్లో ఒక్కో సీటుకు లీజు రేట్లు అధికంగా ఉండడాన్ని నివేదిక ప్రస్తావించింది. ముంబైలో ఇది రూ.50,000 వరకు ఉంటే, ఢిల్లీలో రూ.25,000–45,000 మధ్య ఉంది. టైర్–2 పట్టణాల్లో ఒక్కో సీటు రూ.4,000–6,800 మధ్య ఉంది. దేశవ్యాప్తంగా టైర్–1, టైర్–2 పట్టనాల్లో రూ.3,000 వరకు కోవర్కింగ్ సదుపాయ కేంద్రాలు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. ఏడు ప్రధాన పట్టణాల్లో ఇవి 2,300 వరకు ఉంటాయని పేర్కొంది. ఈ కేంద్రాలు ఎక్కువగా ఉన్న పట్టణాల్లో బెంగళూరు ముందుంటే, ముంబై, ఢిల్లీ, పుణె తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టైర్–2 పట్టణాలైన వైజాగ్, కాన్పూర్, గోవా, రాయిపూర్, భోపాల్, కోచి, పాట్నా, లక్నో, ఇండోర్ తదితర వాటిల్లో 650 కోవర్కింగ్ కేంద్రాలు ఉన్నాయి. -
రాజపుష్ప సమ్మిట్‌లో కో–వర్కింగ్ స్పేస్
సాక్షి, హైదరాబాద్: కో–వర్కింగ్ స్పేస్ కంపెనీ అవ్ఫిస్ ప్రీమియం వర్క్‌స్పేస్ సేవలను ప్రారంభించింది. అవ్ఫిస్ గోల్డ్ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద కంపెనీలకు గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌లను అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నాలుగు నెలల్లో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాలలో 8 గోల్డ్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి 2 లక్షలకు పైగా చ.అ. విస్తీర్ణంలో 5 వేలకు పైగా సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రాజపుష్ప సమ్మిట్, బెం గళూరులోని శాంతినికేతన్–1 రెండు సెంటర్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం అవ్ఫిస్‌కు 12 నగరాలలో 90 సెంటర్లు, 51 వేల సీట్లున్నాయి. -
కో–వర్కింగ్, కో–లివింగ్లకు మంచి భవిష్యత్తు
న్యూఢిల్లీ: రాబోయే సంవత్సరాలలో కో–వర్కింగ్, కో–లివింగ్ ప్రాజెక్ట్‌లకు మంచి భవిష్యత్తు ఉంటుందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. నరెడ్కో, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంయుక్తంగా ‘కోవిండ్ అనంతరం కో–వర్కింగ్ అండ్ కో–లివింగ్ వృద్ధి’ అనే అంశం మీద వెబినార్ నిర్వహించాయి. ఈ సందర్భంగా నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హిరానందాని మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నేపథ్యంలో పెద్ద సంస్థల నుంచి ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. గతంలో సొంత ప్రాంగణాలకు ప్రాధాన్యమిచ్చే చాలా కంపెనీలు కరోనా తర్వాతి నుంచి కో–వర్కింగ్ స్పేస్ కోసం వెతుకుతున్నారని చెప్పారు. కోవిడ్‌తో విద్యా సంస్థల మూసివేత, వర్క్ ఫ్రం హోమ్ కారణంగా కో–లివింగ్ విభాగం మీద ప్రభావం చూపించిందని తెలిపారు. కో–లివింగ్‌లో స్టూడెంట్ హౌసింగ్ రాబోయే రెండేళ్లలో విపరీతమైన వృద్ధిని చూడనుందని చెప్పారు. విద్యా సంస్థలు పెద్ద ఎత్తున హాస్టల్ గృహాలను నిర్మించవని.. విద్యార్థి గృహల నిర్వాహకులతో భాగస్వామ్యం చేసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా, సౌత్ఈస్ట్ ఏషియా ఎండీ అన్షుల్ జైన్ మాట్లాడుతూ.. గతంలో కంటే కో–వర్కింగ్ స్పేస్ ఆకర్షణీయంగా మారిందన్నారు. వర్క్ ఫ్రం హోమ్ విధానాలతో తాత్కాలిక కాలం పాటు ఈ విభాగం మీద ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ఈ రెండు రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. కంపెనీలు మూలధన పెట్టుబడుల పొదుపు, సౌకర్యం, వ్యయాల తగ్గింపు వంటి కారణంగా కో–వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ ఏర్పడుతుందని వివరించారు. -
హైదరాబాద్‌లో తగ్గిన కో-వర్కింగ్ స్పేస్ లావాదేవీలు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కో-వర్కింగ్ స్పేస్ లావాదేవీలు గణనీయంగా క్షీణించాయి. గతేడాది నగరంలో 21 లక్షల చ.అ.లు కో-వర్కింగ్ స్పేస్ లీజింగ్స్ జరగగా.. ఈ ఏడాది కేవలం 11 లక్షల చ.అ.లకు పరిమితమయ్యాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ సావిల్స్ ఇండియా తెలిపింది. కార్పొరేట్ కంపెనీల నుంచి స్థలాల డిమాండ్ తక్కువగా ఉండటం, నిర్ణయాలను వాయిదా వేయటమే క్షీణతకు ప్రధాన కారణాలని పేర్కొంది. ఈ ఏడాది దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో 34 లక్షల చ.అ.లకు పడిపోయింది. హైదరాబాద్‌తో సహా ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణేల్లో చూస్తే.. గతేడాది 81 లక్షల చ.అ.లు కో–వర్కింగ్ లీజింగ్స్ జరగగా.. ఇప్పుడది 58 శాతం క్షీణించి 34 లక్షల చ.అ.లకు తగ్గాయని నివేదిక తెలిపింది. 2020లో దేశంలోని మొత్తం కార్యాలయాల స్థలాల లావాదేవీల్లో కో-వర్కింగ్ స్పేస్ వాటా 11 శాతం. నగరాల వారీగా చూస్తే.. గతేడాది 23 లక్షల చ.అ. కో–వర్కింగ్ స్పేస్ లీజింగ్స్ జరిగిన బెంగళూరులో ఈ ఏడాది 11 లక్షల చ.అ.లకు తగ్గాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో 15 లక్షల చ.అ.ల నుంచి ఏకంగా 2 లక్షలకు పడిపోయింది. పుణేలో 10 లక్షల చ.అ. నుంచి 4 లక్షలకు, ముంబైలో 6 లక్షల చ.అ. నుంచి 4 లక్షల చ.అ.లకు క్షీణించాయి. చెన్నైలో 6 లక్షల చ.అ. నుంచి 2 లక్షల చ.అ.లకు తగ్గాయి. -
కో వర్కింగ్... ఇపుడిదే కింగ్!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తక్కువ బడ్జెట్లో కంపెనీని ఏర్పాటు చేశారా? అయినప్పటికీ అన్ని సౌకర్యాలతో ట్రెండీ ఆఫీస్ కావాలా? మీలాంటి వారికి కో-వర్కింగ్ స్పేస్ చక్కని పరిష్కారం. స్టార్టప్స్ మాత్రమే కాదు, పెద్ద కంపెనీల కార్యకలాపాలకూ ఇవి చక్కని వేదికలుగా నిలుస్తున్నాయి. ఉద్యోగుల్లో 46 శాతం మిలీనియల్స్ కావడం.. వీరు టెక్ స్మార్ట్ ఆఫీసులను కోరుకుంటుండడంతో భారత్‌లో ఇప్పుడు కో-వర్కింగ్ స్పేస్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్టప్స్, చిన్న, మధ్యతరహా కంపెనీలు అందుబాటు ధరలో లభించే అద్దె కార్యాలయాల వైపు మొగ్గు చూపడం, అలాగే కార్పొరేట్ కంపెనీలు తమ కార్యకలాపాల విస్తరణకు వీటిని వేదికలుగా చేసుకుంటున్నాయి. భాగ్యనగరిలోనూ కో-వర్కింగ్ కల్చర్ ఊపందుకుంది. హైదరాబాద్‌లో దాదాపు 70 కంపెనీలు ఈ రంగంలో సేవలందిస్తున్నాయి. గంటల వ్యవధి కోసం సైతం.. అందిస్తున్న సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలను బట్టి చార్జీలు ఉంటాయి. సీటింగ్, కంప్యూటర్ సిస్టమ్స్, ఇంటర్నెట్, కెఫెటేరియా, జిమ్, లైబ్రరీ, ప్లే ఏరియా, గేమింగ్ జోన్, మీటింగ్ రూమ్స్, రిక్రియేషనల్ స్పేస్, కాంప్లిమెంటరీ టీ/కాఫీ, ప్రింటర్, టెక్నికల్ సపోర్ట్ వంటి హంగులనుబట్టి చార్జీలు ఆధారపడతాయి. గంటల వ్యవధి కోసం సైతం కో-వర్కింగ్ స్పేస్‌ను వాడుకోవచ్చు. రోజుకు రూ.500 చార్జీ చేస్తున్న కంపెనీలూ ఉన్నాయి. అలాగే నెలకు డెస్క్ వాడుకున్నందుకు కనీస చార్జీ రూ.5 వేలు ఉంటోంది. లీజుకు కార్యాలయాన్ని తీసుకోవడం, సౌకర్యాల కోసం ముందస్తు పెట్టుబడి పెట్టే అవసరం లేకపోవడం కంపెనీలకు కలిసి వచ్చే అంశం. పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అద్దె కార్యాలయంలోకి ఎప్పుడైనా ఎంట్రీ, ఎగ్జిట్ అవొచ్చు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, స్టార్‌బక్స్, ఏటీఅండ్‌టీ వంటి దిగ్గజ సంస్థలూ కో-వర్కింగ్ స్పేస్ లొకేషన్లలో కార్యాలయాలను సాగిస్తుండడం విశేషం. పోటీపడుతున్న కంపెనీలు.. వీవర్క్, 91స్ప్రింగ్‌బోర్డ్, గోహైవ్, గోవర్క్, ఆఫిస్, ఐస్ప్రౌట్.. ఇలా దేశంలో 300లకుపైగా కంపెనీలు ఈ రంగంలో పోటీపడుతున్నాయి. విభిన్న సేవలతో క్లయింట్లను ఆకర్శించడమే కాదు, విస్తరణలోనూ నువ్వా నేనా అని అంటున్నాయి. చిన్న నగరాల్లోనూ అడుగుపెడుతున్నాయి. ఈ రంగంలో 2020 నాటికి రూ.2,800 కోట్ల పెట్టుబడులు రావొచ్చని మైహెచ్‌క్యూ అంచనా వేస్తోంది. అలాగే కో-వర్కింగ్ కేంద్రాల్లో వివిధ కంపెనీలకు చెందిన 1.3 కోట్ల మంది ఉద్యోగులు పనిచేస్తారని జోస్యం చెబుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, కోల్‌కత, ముంబై, పుణే నగరాల్లో వర్క్‌స్పేస్ ఆపరేటర్లు 2019లో 88 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలాన్ని లీజుకు తీసుకుంటారని ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ చెబుతోంది. అందుబాటులో ఉన్న ఆఫీస్ స్పేస్‌లో వర్క్‌స్పేస్ కంపెనీలు తీసుకునే లీజు స్థలం 18-20 శాతముంటుందట. 2018లో ఇది 14 శాతం వాటాతో 68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కైవసం చేసుకున్నాయి. సంప్రదాయ లీజు విధానంతో పోలిస్తే రెండేళ్లలో కో-వర్కింగ్ స్పేస్ వాటాయే అధికంగా ఉంటుందని ఐస్ప్రౌట్ సీఈవో సుందరి పాటిబండ్ల సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. కన్సాలిడేషన్ దిశగా.. ఈ రంగంలో కన్సాలిడేషన్ వచ్చే ఏడాది నుంచి జరుగుతుందని కొలియర్స్ అంటోంది. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన పెద్ద కంపెనీలు ఈ రంగంలోని చిన్న కంపెనీలను కొనుగోలు చేస్తాయి. ఇప్పటికే ఇన్నోవ్-8ను జూలైలో ఓయో దక్కించుకుంది. కన్సాలిడేషన్‌తో విభిన్న ధరల శ్రేణిలో క్లయింట్లకు సేవలు అందించేందుకు పెద్ద సంస్థలకు వీలవుతుంది. ప్రస్తుతం ఈ రంగ కంపెనీల చేతుల్లో మొత్తం 1.7 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం ఉంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఇది 3.5 శాతం. క్లయింట్ల నుంచి డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండడంతో కంపెనీలు భారీ భవంతులను లీజుకు తీసుకుని వర్క్‌స్పేస్ సైట్లుగా తీర్చిదిద్దుతున్నాయి. వర్క్‌స్పేస్ సైట్ల సగటు విస్తీర్ణం రెండేళ్లలో 40 శాతం అధికమై 55,000 చదరపు అడుగులకు చేరుకుంది. ఓయో వర్క్‌స్పేసెస్ ఇటీవలే హైదరాబాద్‌లో 700 సీట్లకుపైగా సామర్థ్యమున్న కేంద్రాన్ని ప్రారంభించింది. -
విస్తరణ బాటలో ఐడబ్ల్యూజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కో–వర్కింగ్ స్పేస్ రంగంలో ఉన్న ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) దేశంలో విస్తరణ బాట పట్టింది. ప్రస్తుతం 110 దేశాల్లో 3,300 కో–వర్కింగ్ స్పేస్ స్టేషన్లున్న ఐడబ్ల్యూజీకి మన దేశంలో 16 నగరాల్లో 120 కార్యాలయాలున్నాయి. వచ్చే 36–48 నెలల్లో 240 కార్యాలయాలకు విస్తరించాలని లకి‡్ష్యంచింది. వీటిల్లో ప్రస్తుతం హైదరాబాద్‌లో 8 కో–వర్కింగ్ కార్యాలయాలున్నాయని.. వీటిని 20కి చేర్చాలన్నది లక్ష్యమని ఐడబ్ల్యూజీ కంట్రీ మేనేజర్ హర్‡్ష లాంబ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 230 మిలియన్ పౌండ్ల పెట్టుబడులు పెట్టనున్నామని.. ఇందులో సింహా భాగం పెట్టుబడులు ఇండియాలోనే ఉంటాయని ఆయన పేర్కొన్నా రు. హైదరాబాద్‌లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ వెకెన్సీ స్థాయి చాలా తక్కువగా ఉందని.. ఇదే కో–వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్‌కు కారణమని చెప్పారు. వచ్చే నెలలో నగరంలో 60 వేల చదరపుటడుగుల్లో 500 సీటింగ్ సామర్థ్యంతో కో–వర్కింగ్ స్పేస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. ప్రస్తుతం ఐడబ్ల్యూజీకి 25 లక్షల కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. మన దేశంతో పాటూ 100కు పైగా కో–వర్కింగ్ స్టేషన్లు జపాన్, చైనా, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. -
షాపింగ్ మాలే ఆఫీసు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మాల్స్, స్టార్ హోటల్స్.. ఇపుడివి తినడానికో లేదా షాపింగ్ చేయడానికో మాత్రమే కాదు!! ఆఫీసులుగానూ మారుతున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఒక వాణిజ్య భవనంలో కో–వర్కింగ్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు... ఇప్పుడు షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లనూ కార్యాలయాలుగా కేటాయిస్తున్నాయి. పనిచేసే చోటే రిటైల్, ఫుడ్ వసతులూ ఉండటాన్ని కంపెనీలు సైతం స్వాగతిస్తుండటంతో కో–వర్కింగ్ సంస్థలు మాల్స్, హోటళ్ల వైపు దృష్టిసారించాయి. దశాబ్ద కాలంగా దేశంలోని కార్యాలయాల్లో పని వాతావరణంలో విపరీతమైన మార్పులొచ్చాయి. ఆఫీసు డిజైన్, వసతులు, రంగులు వంటివి ఉద్యోగి నైపుణ్యం, ఉత్పాదకత, పని సంస్కృతిపై ప్రభావం చూపిస్తున్నాయనేది ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా అభిప్రాయం. కార్యాలయాల్లో గ్రీనరీ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు, వాసన వంటి వాటితో ఉద్యోగిపై పని ఒత్తిడి తగ్గుతుందని, దీంతో మరింత క్రియేటివిటీ బయటికొస్తుందని పరిశోధనల్లోనూ తేలింది. ఆయా వసతులను అందుబాటు ధరల్లో కో–వర్కింగ్ స్పేస్ భర్తీ చేస్తుండటంతో ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులకు డిమాండ్ పెరిగింది. దీంతో మధ్య తరహా, చిన్న, స్టార్టప్స్ మాత్రమే కాకుండా బహుళ జాతి సంస్థలు కూడా కో–వర్కింగ్ స్పేస్‌లో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. మెట్రో మాల్స్‌లో కో–వర్కింగ్.. త్వరలోనే హైటెక్ సిటీ, పంజగుట్ట, మలక్‌పేట్ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న హైదరాబాద్ మెట్రో మాల్స్‌లో కో–వర్కింగ్ స్పేస్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ కో–వర్కింగ్ కంపెనీ సంబంధిత సంస్థతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఢిల్లీకి చెందిన ‘ఆఫిస్’ సంస్థకు హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో 167 సీట్లు, కోల్‌కతాకు చెందిన అపీజే గ్రూప్‌కు పార్క్ హోటల్లో 475 సీట్ల కో–వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంది. ఆఫిస్‌కు గుర్గావ్లోని ఆంబియెన్స్ మాల్లో 592 సీట్లు, హీరా పన్నా మాల్లో 241 సీట్లు, పుణెలోని క్యూక్లియస్ మాల్లో 400 సీట్లు, రఘులీలా మాల్లో 1,000 సీట్లు కో–వర్కింగ్ స్పేస్ రూపంలో ఉన్నాయి. ముంబైకి చెందిన రీగస్కు ఢిల్లీలోని వసంత్ స్క్వేర్ మాల్, బెంగళూరులోని లగ్జరీ యూబీ సిటీ, చెన్నైలోని సిటీ సెంటర్లో కో–వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంది. 20 లక్షల చ.అ.కు కో–వర్కింగ్ స్పేస్.. 2010లో ప్రపంచవ్యాప్తంగా 600 సెంటర్లలో 21 వేల కో–వర్కింగ్ సీట్లుండగా.. ఇప్పుడవి 18,900 సెంటర్లలో 17 లక్షల సీట్లకు పెరిగాయి. మన దేశంలో ఏటా 4.1 కోట్ల చ.అ. కార్యాలయాల స్థల లావాదేవీలు జరుగుతుండగా.. ఇందులో 20 లక్షల చ.అ. స్థలం కో–వర్కింగ్ స్పేస్ ఉంటుందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలియజేసింది. 43 శాతం లావాదేవీలతో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా... తర్వాత ఎన్సీఆర్లో 16 శాతం, హైదరాబాద్ 15 శాతం, పుణె 12 శాతం, ముంబై 10 శాతం, అహ్మదాబాద్ 3 శాతం, చెన్నై 2 శాతం ఆక్రమించినట్లు సంస్థ తెలిపింది. ఏటా 30–40 శాతం వృద్ధి నమోదవుతోంది. ప్రస్తుతం దేశంలో రీగస్, వీవర్క్, కోవర్క్స్, ఐకివా, వర్క్ ఏ ఫీలా, టేబుల్ స్పేస్, ఆఫిస్, అపీజే, స్మార్ట్‌వర్క్స్ వంటి సుమారు 200 కో–వర్కింగ్ కంపెనీలు 400 సెంటర్లలో సేవలందిస్తున్నాయి. మౌలిక వసతుల వ్యయం తగ్గుతుంది.. ఐటీ కారిడార్లు, అభివృద్ధి చెందిన వాణిజ్య ప్రాంతాల్లో స్థలాల ధరలు ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసే బదులు కో–వర్కింగ్ స్పేస్‌ను అద్దె తీసుకోవటం కంపెనీలకు సులువవుతోంది. ఇదే కో–వర్కింగ్ డిమాండ్‌కు ప్రధాన కారణమని ఆఫీస్ ఫౌండర్ అండ్ సీఈఓ అమిత్ రమణి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో అద్దెలు 25% వరకు తక్కువ. అంతేకాకుండా సాధారణ ఆఫీసులో సీట్లతో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో ఒక్కో సీటుకు 5–15% స్థలం ఆదా అవుతుంది. పైగా ప్రతి కంపెనీ ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే బదులు అన్ని కంపెనీలకు కలిపి ఒకటే పార్కింగ్, హౌస్ కీపింగ్, క్యాంటీన్, రిసెప్షన్ వంటి ఏర్పాట్లుంటాయి. దీంతో కంపెనీలకు మౌలిక వసతుల వ్యయం కూడా తగ్గుతుంది. అయితే ఒకే చోట పలు కంపెనీల పనిచేస్తుండటంతో కంపెనీల డేటా భధ్రత ప్రధాన సమస్యని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. గంట, రోజు, నెల వారీగా చార్జీలు.. ఒకే అంతస్తులో ఒక ఆఫీసు బదులు పలు రకాల చిన్న ఆఫీసులుండటాన్ని కో–వర్కింగ్ స్పేస్‌గా పిలుస్తారు. ప్రతి ఒక్కరికీ కావాల్సిన ప్రైవేట్ ఆఫీసు, ఫిక్స్డ్ డెస్క్‌లు, సమావేశ గది, క్యాబిన్ల వంటి సౌకర్యాలుంటాయి. కొరియర్, ఫుడ్, లాంజ్, ఎల్సీడీ, పార్కింగ్, ప్రింటర్, వైఫై, ప్రొజెక్టర్ వంటి ఆధునిక వసతులూ ఉంటాయి. కో–వర్కింగ్ ఆఫీసుల అద్దెలు గంట, రోజులు, నెల వారీగా ఉంటాయి. హైదరాబాద్‌లో నెలకు ఒక సీటుకు రూ.5–10 వేలు, పుణెలో రూ.4–10 వేలు, గుర్గావ్లో రూ.7–17 వేలు, ముంబైలో రూ.9–30 వేలు, బెంగళూరులో రూ.4–15 వేలు, చెన్నైలో రూ.7–15 వేలుగా ఉన్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లిహిల్స్‌లో కో–వర్కింగ్ ఆఫీసులున్నాయి. -
కో–వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో కో–వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోంది. సాధారణ కార్యాలయాల అద్దెలతో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో రెంట్లు తక్కువగా ఉండటం, అనుకున్న వెంటనే ఆఫీసు కార్యకలాపాలను ప్రారంభించే వీలుండటం, ఇంటర్నెట్, అడ్మినిస్ట్రేషన్ వంటి ఇతరత్రా సేవలూ అందుబాటులో ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ♦ దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 81 లక్షల చ.అ. కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీలు జరిగాయని కుష్మన్ వేక్ఫీల్డ్ నివేదిక తెలిపింది. మొత్తం లావాదేవీల్లో బెంగళూరులో 32 శాతం, ముంబైలో 25 శాతం, హైదరాబాద్‌లో 11 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 17 శాతం, పుణెలో 8 శాతం స్థలాలు అందుబాటులో ఉన్నాయని నివేదిక తెలిపింది. ♦ సాధారణ ఆఫీసు అద్దెలతో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్ అద్దెలు 8–11 శాతం తక్కువగా ఉంటాయని కుష్మన్ వేక్ఫీల్డ్ ఇండియా ఎండీ అన్షుల్ మేగజైన్ తెలిపారు. కార్పొరేట్ కంపెనీలు, బహుళ జాతి సంస్థలూ కో–వర్కింగ్ స్పేస్ స్థలాల్లో కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. కో–వర్కింగ్ స్పేస్‌లో ఆఫిస్, స్మార్ట్‌వర్క్స్, కోవర్క్స్, వీవర్క్స్, ఐకెవా, డీబీఎస్ వంటి కంపెనీలున్నాయి. -
హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎఫ్ఐఎస్ సేవలు ప్రారంభం
⇒ గంటల వారీగా ఆఫీస్ స్థలాన్ని అద్దెకు... ⇒ 2018 మార్చి నాటికి 20 వేల సీట్ల లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గంటలు, రోజుల వారీగా ఆఫీసు స్థలాన్ని అద్దెకిచ్చే (కో–వర్కింగ్ స్పేస్) విభాగంలో ఉన్న ఏడబ్ల్యూఎఫ్ఐఎస్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. తాజ్ డెక్కన్ భాగస్వామ్యంతో 200 సీటింగ్ సామర్థ్యం గల ఈ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించింది. ఇందులో ప్రీమియం క్యాబిన్స్, ఫిక్స్డ్ డెస్క్‌లు, మీటింగ్ రూమ్‌లు, లాంజ్‌లను ఏర్పాటు చేసింది. ధరల శ్రేణి ఫ్లెక్సీ వర్క్ స్టేషన్లకు రోజుకు రూ.350, ఫిక్స్డ్ సీట్లు రూ.750, క్యాబిన్స్ నెలకు రూ.13 వేలు, మీటింగ్ గదులు గంటకు రూ.600లుగా ఉంటాయని ఏడబ్ల్యూఎఫ్ఐఎస్ ఫౌండర్ అండ్ సీఈఓ అమిత్ రమణి గురువారమిక్కడ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం ఏడబ్ల్యూఎఫ్ఐఎస్ దేశంలోని 18 నగరాల్లో 5 వేల సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందని.. 2018 మార్చి నాటికి 20 వేల సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్‌లో వచ్చే 6 నెలల్లో గచ్చిబౌలి, బేగంపేట్ల్లో 1,500 సీట్లు రానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యూఎఫ్ఐఎస్ మార్కెటింగ్ హెడ్ సుమిత్ లఖానీ పాల్గొన్నారు. -
‘ఇంటి నుంచి పని’కి ఇక సెలవ్!
న్యూఢిల్లీ: అబ్బ ఇంత పొల్యూషన్లో ఆఫీస్‌కు అంత దూరం ఏ వెళ్తాం.... ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని హాయిగా పనిచేసుకోవచ్చు. ఇది ఒకప్పటి మాట. అవుటాఫ్ హోమ్ అయితేనే ఆలోచనలు పెరుగుతాయి. ఇది నేటి మాట. అవును.. కొన్ని బహుళ జాతి కంపెనీల ఉద్యోగులు ఇంటినుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నా...సొంతగా ఇంటినుంచి వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రం పనిచేసే చోటు వేరొకరితో పంచుకోవడానికే ఇష్టపడుతున్నారు. సోనీ అనే వ్యక్తి కో-వర్కింగ్ స్పేస్ అనే కాన్సెప్ట్‌ను కనిపెట్టారు. వివిధ ఉద్యోగాలు చేసే వారు ఒకే ఆవరణలో తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకోవడం కో-వర్కింగ్ స్పేస్ విధానం. కన్నాట్ పేస్ల్‌లో నాలుగు నెలల కిందట భావసారూప్యం ఉన్న వ్యక్తులతో కలిసి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకరి ఉద్యోగంతో ఇంకొకరితో సంబంధం ఉండదు. అయినా ఒకరి విజయాన్ని మరొకరు పంచుకుంటారు. ఒకరు వెనుకబడితే మరొకరు వెన్ను తడతారు. ఇంటినుంచి పని చేయడంలో ఏం లాభముంది? ఇలా పనిచేసే చోటు ఇతరులతో పంచుకోవడం వల్ల ఎక్కువగా నేర్చుకోగలుగుతున్నాను అంటున్నాడు సోనీ. ఏదైనా సాధించినప్పడు సంతోషాన్ని పంచుకునేవారు, పోగొట్టుకున్నప్పుడు మన వెన్నంటే ఉండేవారు ఈ వర్క్ స్పేస్ షేరింగ్ వల్లే దొరుకుతారు అంటున్నాడు మరో సంస్థ యజమాని ప్రణవ్ భాటియా. సోనీలాంటి యువ వ్యాపారవేత్తలు, ఫ్రీలాన్సర్ల సంఖ్య పెరుగుతోంది. సొంతగా సంస్థలు ప్రారంభిస్తున్న వీరు ఆఫీసుల నుంచి కాకుండా కో-వర్కింగ్ స్పేస్ ద్వారా పనిచేయడానికే ఇష్టపడుతున్నారు. కార్యాలయం పంచుకోవడం అనేది దేశ రాజధానిలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. అయితే ఇలాంటి కార్యాలయాలు ఇప్పటికే బెంగళూరులో నడుస్తున్నాయి. గ్రేటర్ కైలాష్‌లోని మూన్‌లైటింగ్, గుర్గావ్, సరితా విహార్ సమీపంలోని మోహన్ ఎస్టేట్ల లో ఉ్న 91 స్పింగ్‌బోర్డ్, కల్కాజీలోని ద స్టూడియో అనేవి నగరంలో కొత్తగా వెలసిన కో వర్కింగ్ స్పేస్‌లు. ఇక్కడ నెలసరి ఛార్జీ 4,500నుంచి 7,500వరకు ఉంటోంది. అయితే కార్యాలయ క్యాబిన్స్ వేరువేరుగా ఉన్నా.. కేఫ్టేరియా, సమావేశ మందిరాలు, వినోదం కలిగించే గదులు, లాంజ్ ఏరియా, పరిపాలనా విభాగం, టెక్నికల్ సపోర్టువంటివన్నీ అన్ని ఆఫీసులకు కలిసే ఉంటాయి. వీరంతా కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. కో-వర్కింగ్ స్పేస్ ఆలోచన ఆర్థికంగా కలిసొస్తుంది. దీనివల్ల ఉద్యోగులను తగ్గించుకోవడమే కాకుండా నిధుల కొరత నుంచి కూడా బయటపడొచ్చని అంటున్నారు ప్రియాంకా ప్రభాకర్. ఈ కాన్సెపట్‌తోనే ఏర్పాటైన ద స్టూడియో చిన్న ఆవరణ. ఎనిమిది మంది మాత్రమే ఉంటారు. ఇందులో ఆర్టిస్టులు, బ్లాగర్లు, ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. పనిచేసే చోటును పంచుకోవడమనేది చాలా శక్తినిస్తుంది. దీనివల్ల బంధాలు పెరగడమే కాదు... వ్యాపారం వృద్ధి చెందుతుందంటున్నారు 91స్ప్రింగ్‌బోర్డ్‌లోని వరుణ్ చావ్లా. ఇంటినుంచి పనిచేయడం కంటే వర్కింగ్ స్పేస్ పంచుకోవడం కాన్సెప్ట్ వల్ల క్రమశిక్షణ కూడా పెరుగుతుందంటున్నారు ఆయన. గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైన స్టిర్రింగ్ మైండ్స్ కార్యాలయంలో మొత్తం 21 సంస్థలున్నాయి. 53 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ తరహా విధానం క్రమేపీ దేశంలోని వివిధ నగరాలకు కూడా విస్తరించే అవకాశాలు కూడా మెండుగానే కనిపిస్తున్నాయి.