
సాక్షి, హైదరాబాద్: దేశంలో కో–వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోంది. సాధారణ కార్యాలయాల అద్దెలతో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌లో రెంట్లు తక్కువగా ఉండటం, అనుకున్న వెంటనే ఆఫీసు కార్యకలాపాలను ప్రారంభించే వీలుండటం, ఇంటర్నెట్, అడ్మినిస్ట్రేషన్ వంటి ఇతరత్రా సేవలూ అందుబాటులో ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
♦ దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 81 లక్షల చ.అ. కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీలు జరిగాయని కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ నివేదిక తెలిపింది. మొత్తం లావాదేవీల్లో బెంగళూరులో 32 శాతం, ముంబైలో 25 శాతం, హైదరాబాద్‌లో 11 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 17 శాతం, పుణెలో 8 శాతం స్థలాలు అందుబాటులో ఉన్నాయని నివేదిక తెలిపింది.
♦ సాధారణ ఆఫీసు అద్దెలతో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్ అద్దెలు 8–11 శాతం తక్కువగా ఉంటాయని కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ ఇండియా ఎండీ అన్షుల్ మేగజైన్ తెలిపారు. కార్పొరేట్ కంపెనీలు, బహుళ జాతి సంస్థలూ కో–వర్కింగ్ స్పేస్ స్థలాల్లో కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. కో–వర్కింగ్ స్పేస్‌లో ఆఫిస్, స్మార్ట్‌వర్క్స్, కోవర్క్స్, వీవర్క్స్, ఐకెవా, డీబీఎస్ వంటి కంపెనీలున్నాయి.