ముంబై: సంఘటిత రంగంలోని జ్యుయలరీ వర్తకుల వ్యాపారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో 20 శాతం వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నియంత్రణలు కఠినంగా మారుతుండడం, బ్రాండెడ్ జ్యుయలరీకి కస్టమర్ల ప్రాధాన్యం పెరగడం, కంపెనీల విస్తరణ ఈ వృద్ధికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. మధ్య కాలానికి జ్యుయలరీ పరిశ్రమలో సంఘటిత రంగం వాటా మెరుగైన వృద్ధిని చూపిస్తుందని పేర్కొంది.
అసంఘటిత రంగం నుంచి క్రమంగా మార్కెట్ సంఘటితం వైపు మళ్లుతోందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం జ్యుయలరీ పరిశ్రమ ఆదాయం 15 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని, ఇదే కాలంలో ఈ రంగంలోని సంఘటిత విభాగం 20 శాతం వృద్ధిని చూస్తుందని వివరించింది. బంగారం ఆభరణాల రిటైల్ విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 15 శాతం పెరుగుతాయని అంచనా వే సింది.
మొదటి ఆరు నెలల్లో అక్షయ తృతీయ, పండుగలతో 35 శాతం వృద్ధిని చూడడం ఇందుకు దోహదం చేస్తుందని ఇక్రా పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో అధిక వృద్ధి కారణంగా, చివరి త్రైమాసికంలో (2023 జనవరి–మార్చి) డిమాండ్ స్తబ్ధుగా ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ ఆరోగ్యకరంగానే ఉందంటూ.. అధిక ద్రవ్యోల్బణం, గ్రామీణ ఆర్థిక రికవరీ నిదానంగా ఉండడం, వినియోగదారుల సెంటిమెంట్ బలంగా లేకపోవడం అవరోధాలుగా పేర్కొంది.
2023–24లో 5 శాతానికి పరిమితం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) జ్యుయలరీ రంగంలో వృద్ధి కేవలం 5 శాతానికి పరిమితం అవుతుందని ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక విక్రయాల బేస్ నమోదు కావడం, స్థూల ఆర్థిక అంశాలను కారణంగా చూపించింది. అయినప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులతో సంఘటిత జ్యులయరీ విభాగం 10 శాతం ఆదాయం వృద్ధిని చూపిస్తుందని ఇక్రా అంచనా వేస్తోంది.
జ్యుయలరీ స్టోర్ల విస్తరణను రుణాలతో చేపడుతున్నప్పటికీ, పెద్ద సంస్థల రుణ భారం సౌకర్యవంతంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘చాలా వరకు సంస్థాగత జ్యుయలరీ కంపెనీలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మార్కెట్ వాటాను సొంతం చేసుకునే విధంగా 2022–23 మొదటి ఆరు నెలల్లో అడుగులు వేశాయి. వచ్చే 12–18 నెలల్లో స్టోర్ల సంఖ్య 10 శాతం పెరగనుంది’’ అని ఇక్రా తన నివేదికలో వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment