Organized sector
-
వస్త్ర రిటైలర్లకు మెరుగైన ఆదాయం
ముంబై: సంఘటిత వస్త్ర రిటైలర్ల అమ్మకాల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–8 శాతం వృద్ధి చెందుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. జూన్ క్వార్టర్లో విచక్షణారహిత వినియోగాన్ని ద్రవ్యోల్బణం ప్రభావితం చేసినప్పటికీ.. వివాహాలు, పండుగల సీజన్ డిమాండ్ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. అలాగే సంఘటిత రిటైల్ సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి తమ స్టోర్లను విస్తరిస్తుండడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు, మధ్యకాలంలో అమ్మకాల వృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. కరోనా ముందు సంఘటిత వస్త్ర రిటైలర్ల అమ్మకాల్లో వృద్ధి 8 శాతం స్థాయిలోనే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. కరోనా కారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో.. అక్కడ నుంచి చూసుకుంటే (లోబేస్) గత ఆర్థిక సంత్సరంలో (2022–23) వస్త్ర రిటైలర్ల ఆదాయంలో 38 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. నిర్వహణ మార్జిన్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ, గత ఆర్థిక సంవత్సరం మాదిరే 8 శాతంగా ఉంటాయని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. మార్కెటింగ్ వ్యయాలు పెరిగినప్పటికీ ఆ ప్రభావాన్ని తగ్గిన ముడి సరుకుల ధరలు, ప్రీమియం ఉత్పత్తుల విక్రయాలతో అధిగమిస్తాయని పేర్కొంది. స్టోర్ల విస్తరణ ఇక వస్త్ర రిటైల్ స్టోర్ల విస్తరణ కరోనా ముందు స్థాయిలోనే 2.2 మిలియన్ చదరపు అడుగుల మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. గత ఆర్థిక సంతవ్సంలో రిటైల్ స్టోర్ల విస్తరణ 3.7 మిలియన్ చదరపు అడుగులుగానే ఉన్నట్టు గుర్తు చేసింది. 39 సంఘటిత అప్పారెల్ రిటైలర్లపై క్రిసిల్ రేటింగ్స్ అధ్యయనం చేసి ఈ నివేదికను విడుదల చేసింది. గతేడాది వస్త్ర రిటైలర్ల రూ.1.9 లక్షల కోట్ల ఆదాయంలో ఈ సంస్థల వాటా 25 శాతంగా ఉంది. వినియోగదారులు బ్రాండెడ్ వ్రస్తాలకు ప్రాధాన్యం ఇస్తుండడం, తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేస్తుండంతో ప్రీమియం విభాగంలో డిమాండ్ క్రమంగా పెరుగుతున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్సేథి తెలిపారు. మధ్యస్థ ధరలు, వ్యాల్యూ విభాగంలో తక్కువ డిమాండ్ ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రీమియం విభాగం డిమాండ్ సాయపడుతున్నట్టు చెప్పారు. వస్త్ర రిటైలర్ల ఆదాయంలో 60 శాతం మధ్యస్థ, తక్కువ శ్రేణి విభాగాల నుంచే వస్తున్నట్టు తెలియజేశారు. స్టోర్ల విస్తరణ, రాబోవు పండుగలు, వివాహాల సీజన్ ఫలితంగా మూడో త్రైమాసికం (డిసెంబర్ క్వార్టర్) మెరుగైన అమ్మకాలు నమోదవుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
మే నెలలో కొత్తగా 8.83 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలలో 8.83 లక్షల మంది కొత్త వారికి ఉపాధి లభించింది. వీరంతా ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా వచ్చి చేరారు. ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, మే నెలలో ఈపీఎఫ్‌వో కిందకు చేరిన సభ్యుల సంఖ్య 16.30 లక్షలుగా ఉంది. కేంద్ర కార్మిక శాఖ ఈ వివరాలను గురువారం విడుదల చేసింది. కొత్తగా 3,673 సంస్థలు తమ ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ సంస్థలు అన్నీ కూడా మొదటిసారి ఈపీఎఫ్‌వో కింద నమోదయ్యాయి. గత ఆరు నెలల కాలంలో ఎక్కువ సభ్యుల చేరిక మేలోనే నమోదైంది. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసు వారు 56 శాతంగా ఉన్నారు. సంఘటిత రంగంలో యువత గణనీయ స్థాయిలో ఉపాధి పొందినట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సాధారణంగా విద్య పూర్తయిన తర్వాత ఈ వయసు వారే ఉద్యోగాన్వేషణ చేస్తుంటారని తెలిసిందే. కొత్త సభ్యుల్లో 2.21 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం మీద మే నెలలో చేరిన మహిళా సభ్యుల 3.15 లక్షలుగా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల నుంచి కొత్త సభ్యులు అధికంగా చేరినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల నుంచే 57.85 శాతం మంది ఈపీఎఫ్‌వో కిందకు వచ్చి చేరారు. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 19.32 శాతం మంది సభ్యులయ్యారు. బిల్డింగ్, నిర్మాణం, వ్రస్తాల తయారీ, ఎల్రక్టానిక్ మీడియా, టెక్స్టైల్స్, రబ్బర్ ఉత్పత్తులు, ఆర్థిక సేవల సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. మొత్తం సభ్యుల్లో 42 శాతం మేర నైపుణ్య సేవల విభాగం కిందే ఉన్నారు. -
ఆభరణాల మార్కెట్లో సంఘటిత రంగం పట్టు!
ముంబై: ఆభరణాల మార్కెట్లో సంఘటిత రంగం వాటా ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12–15 శాతం మేర పెరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. పెద్ద సంస్థలన్నీ విస్తరణ ప్రణాళికలతో ముందుకు వెళుతున్న విషయాన్ని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గుర్తు చేసింది. దీంతో స్థూల ఆర్థిక సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ సంఘటిత రంగం వాటా పెంచుకోగలదని ఇక్రా అంచనా వేస్తోంది. ఆభరణాల మార్కెట్ 2023–24లో విలువ పరంగా 8–10 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని తెలిపింది. బంగారం ధరల్లో అస్థిరతల నేపథ్యంలో పరిమాణాత్మకంగా మార్కెట్లో పెద్ద వృద్ధి నమోదు కాకపోవచ్చన్న అంచనాతో ఉంది. కాకపోతే బంగారానికి ఉన్న బలమైన సాంస్కృతిక అనుబంధం నేపథ్యంలో పండుగలు, వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాలకు డిమాండ్ మద్దతుగా నిలుస్తుందని వివరించింది. ‘‘చాలా మంది జ్యుయలరీ రిటైలర్లు 2023 అక్షయ తృతీయ సందర్భంగా ఆదాయంలో 15 శాతానికి పైగా వృద్ధిని చూసినట్టు పేర్కొన్నారు. బంగారం ధరలు పెరగడం, ఎక్కువ సంస్థలు దూకుడుగా రిటైల్ స్టోర్లను పెంచడం ఆదాయ వృద్ధికి మద్దతునిస్తుంది’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ దాస్ పేర్కొన్నారు. జ్యుయలర్ల ఆపరేటింగ్ మార్జిన్ సౌకర్య స్థాయిలో 7.5–8 శాతం మేర వచ్చే రెండేళ్లు ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. -
సంఘటిత ఆభరణాల పరిశ్రమకు స్వర్ణయుగం
ముంబై: సంఘటిత రంగంలోని జ్యుయలరీ వర్తకుల వ్యాపారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో 20 శాతం వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నియంత్రణలు కఠినంగా మారుతుండడం, బ్రాండెడ్ జ్యుయలరీకి కస్టమర్ల ప్రాధాన్యం పెరగడం, కంపెనీల విస్తరణ ఈ వృద్ధికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. మధ్య కాలానికి జ్యుయలరీ పరిశ్రమలో సంఘటిత రంగం వాటా మెరుగైన వృద్ధిని చూపిస్తుందని పేర్కొంది. అసంఘటిత రంగం నుంచి క్రమంగా మార్కెట్ సంఘటితం వైపు మళ్లుతోందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం జ్యుయలరీ పరిశ్రమ ఆదాయం 15 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని, ఇదే కాలంలో ఈ రంగంలోని సంఘటిత విభాగం 20 శాతం వృద్ధిని చూస్తుందని వివరించింది. బంగారం ఆభరణాల రిటైల్ విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 15 శాతం పెరుగుతాయని అంచనా వే సింది. మొదటి ఆరు నెలల్లో అక్షయ తృతీయ, పండుగలతో 35 శాతం వృద్ధిని చూడడం ఇందుకు దోహదం చేస్తుందని ఇక్రా పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో అధిక వృద్ధి కారణంగా, చివరి త్రైమాసికంలో (2023 జనవరి–మార్చి) డిమాండ్ స్తబ్ధుగా ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఆరోగ్యకరంగానే ఉందంటూ.. అధిక ద్రవ్యోల్బణం, గ్రామీణ ఆర్థిక రికవరీ నిదానంగా ఉండడం, వినియోగదారుల సెంటిమెంట్ బలంగా లేకపోవడం అవరోధాలుగా పేర్కొంది. 2023–24లో 5 శాతానికి పరిమితం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) జ్యుయలరీ రంగంలో వృద్ధి కేవలం 5 శాతానికి పరిమితం అవుతుందని ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక విక్రయాల బేస్ నమోదు కావడం, స్థూల ఆర్థిక అంశాలను కారణంగా చూపించింది. అయినప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులతో సంఘటిత జ్యులయరీ విభాగం 10 శాతం ఆదాయం వృద్ధిని చూపిస్తుందని ఇక్రా అంచనా వేస్తోంది. జ్యుయలరీ స్టోర్ల విస్తరణను రుణాలతో చేపడుతున్నప్పటికీ, పెద్ద సంస్థల రుణ భారం సౌకర్యవంతంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘చాలా వరకు సంస్థాగత జ్యుయలరీ కంపెనీలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మార్కెట్ వాటాను సొంతం చేసుకునే విధంగా 2022–23 మొదటి ఆరు నెలల్లో అడుగులు వేశాయి. వచ్చే 12–18 నెలల్లో స్టోర్ల సంఖ్య 10 శాతం పెరగనుంది’’ అని ఇక్రా తన నివేదికలో వివరించింది. -
ఈపీఎస్ నుంచీ డబ్బు తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలోని ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) తీసుకుంది. ఒక ఉద్యోగి ఒక సంస్థలో చేరి ఆరు నెలల్లోపు మానేస్తే, కేవలం తన పీఎఫ్ ఖాతాలోని బ్యాలన్స్ వరకే వెనక్కి తీసుకోగలరు. పెన్షన్ ఖాతా (ఈపీఎస్–95)లోని జమలను తీసుకోవడానికి లేదు. కానీ, ఆరు నెలల సర్వీసు కూడా లేకుండా ఉద్యోగం మానేసే వారు పెన్షన్ ఖాతాలోని బ్యాలన్స్‌ను సైతం వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సోమవారం నాటి 232వ సమావేశంలో నిర్ణయించింది. ఇక ఈటీఎఫ్‌లలో తన పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన విధానానికీ ఆమోదం తెలిపింది. 2018లో కొనుగోలు చేసిన ఈటీఎఫ్ యూనిట్లకు సంబంధించి లాభాలను వెనక్కి తీసుకుని, 2022–23 సంవత్సరానికి వడ్డీ ఆదాయం లెక్కింపులోకి పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. -
సంఘటిత రంగంలో పెరుగుతున్న ఉపాధి
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు దేశంలో బలపడుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 2021 డిసెంబర్ త్రైమాసికంలో తొమ్మిది పరిశ్రమలలో దాదాపు 3.14 కోట్ల మంది కార్మికులు ఉపాధి పొందారని, ఇది సంఘటిత రంగంలో ఉపాధిలో పెరుగుతున్న ధోరణిని సూచిస్తోందని ఆయన ఒక ట్వీట్ చేశారు. 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సంఖ్య 3.10 కోట్లని తెలిపారు. ఈ మేరకు కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ త్రైమాసిక (అక్టోబర్–డిసెంబర్) సర్వే నివేదికలోని గణాంకాలను ఆయన ఉటంకించారు. గురువారం విడుదలైన నివేదికకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► తొమ్మిది రంగాలు– తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, వసతి/రెస్టారెంట్లు, ఐటీ/బీపీఓ, ఆర్థిక సేవల విభాగాల్లో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న సంస్థలకు సంబంధించి ఉపాధి డేటా ప్రాతిపదికన ఈ గణాంకాలు వెలువడ్డాయి. మొత్తం ఉపాధి రంగంలో ఈ తొమ్మిది రంగాల వాటా దాదాపు 85 శాతం. ► నివేదిక ప్రకారం అంచనా వేసిన మొత్తం కార్మికుల సంఖ్యలో దాదాపు 39 శాతం వాటాతో తయారీ రంగం మొదటి స్థానంలో నిలిచింది. తరువాత విద్యా రంగం 22 శాతంతో ఉంది. సమీక్షా కాలంలో తయారీ రంగంలో అత్యధికంగా 124 లక్షల మంది కార్మికులు ఉన్నారు. విద్యా రంగం 69.26 లక్షల మందిని కలిగిఉంది. ► వాటి తర్వాత ఐటీ/బీపీఓలు (34.57 లక్షలు), ఆరోగ్యం (32.86 లక్షలు), వాణిజ్యం (16.81 లక్షలు), రవాణా (13.20 లక్షలు), ఆర్థిక సేవలు (8.85 లక్షలు), వసతి/రెస్టారెంట్లు (8.11 లక్షలు), నిర్మాణ (6.19 లక్షలు) రంగాలు ఉన్నాయి. ► దాదాపు అన్ని (99.4 శాతం) విభాగాలు వేర్వేరు చట్టాల క్రింద నమోదయ్యాయి. ► మొత్తంమీద, దాదాపు 23.55 శాతం యూనిట్లు తమ కార్మికులకు ఉద్యోగ శిక్షణను అందించాయి. తొమ్మిది రంగాల్లో ఆరోగ్య విభాగంలోని 34.87 శాతం యూనిట్లు ఉద్యోగ శిక్షణను అందించగా, ఐటీ/బీపీఓల వాటా ఈ విషయంలో 31.1 శాతంగా ఉంది. ► కార్మిక మంత్రిత్వశాఖ నియంత్రణలో లేబర్ బ్యూరోతో ఈ సర్వే జరిగింది. వ్యవసాయేతర సంస్థల్లోని మొత్తం ఉపాధిలో ఎక్కువ భాగం ఈ తొమ్మిది ఎంపిక చేసిన రంగాలదే కావడం గమనార్హం. వ్యవస్థీకృత, అసంఘటిత విభాగాలలో ఉద్యోగాలు, నియామకాలకు సంబంధించి ఈ సర్వే నిర్వహణ జరుగుతుంది. -
ఎకానమీ ‘యూ’ టర్న్!
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ ఇంతకన్నా మరింత నష్టానికి గురయ్యే అవకాశాలు లేవని ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. సంఘటిత రంగం 2021 ముగింపుకల్లా కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కూడా ఆయన విశ్లేíÙంచారు. అయితే ఈ రికవరీ ఆయా రంగాలను బట్టి విభిన్నంగా ఉంటుందని అంచనావేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో భారత్ ఆర్థిక వ్యవస్థలో కీలకప్రాత పోషించిన అహ్లూవాలియా తాజాగా ఒక వెర్చువల్ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యంశాలను పరిశీలిస్తే... ► సంఘటిత రంగం తొలత పురోగమిస్తే, దానిని అసంఘటిత రంగం అనుసరిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుంది. ఆయా పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఇది ఎకానమీ పురోగతిలో కీలకం ► వ్యవసాయ రంగంలో ఆధునికీకరణ అవసరం ఉంది. అయితే దానిని ఎలా నిర్వహించాలన్న అంశం కీలకం. చట్టాల అమలు(కేంద్రం ఇటీవలి మూడు చట్టాల అమలు) విషయంలో రైతుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.పంజాబ్, హర్యానా, పశి్చమ ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వందలాది మంది రైతులు గత ఏడాది నుంచీ ఢిల్లీ సరిహద్దుల సమీపంలో ఆందోళనలు చేస్తూ, మూడు చట్టాల రద్దును కోరుతున్న సంగతి తెలిసిందే. ఎన్ఎంపీ ప్రయోజనకరమే: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) విధానానికి యూపీఏ ప్రభుత్వంలో ఎకానమీలో కీలక బాధ్యతలు పోషించిన అహ్లూవాలియా మద్దతు పలకడం గమనార్హం. ప్రభుత్వ ఆస్తుల లీజు ద్వారా నిధుల సమీకరణకు సంబంధించి కేంద్రం ఆవిష్కరించిన ఆరు లక్షల కోట్ల రూపాయల నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) విధానం వల్ల విద్యుత్ రంగం నుంచి రోడ్లు, రైల్వేల వరకూ వివిధ రంగాల్లో మౌలిక రంగం ఆస్తుల విలువలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్ఎంపీకి తాను అనుకూలమని ఆయన స్పష్టం చేశారు. ఇది సరిగా అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థకు మంచే జరుగుతుందని వివరించారు. బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ కార్యక్రమం కింద.. కేంద్రం ప్యాసింజర్ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్‌లో లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్’ చేయనుంది. ఇప్పటికే పూర్తయి నిరుపయోగంగా పడి ఉన్నవి లేదా పూర్తి స్థాయిలో వినియోగంలో లేనివి, పూర్తి స్థాయిలో విలువను అందించలేకపోతున్న బ్రౌన్‌ఫీల్డ్ ఇన్ఫ్రా అసెట్స్ మాత్రమే ఎన్ఎంపీ పరిమితం. ఇందులో యాజమాన్య హక్కులు లేదా స్థలం బదలాయింపు ఉండదు. ప్రైవేట్ రంగం పాలుపంచుకునేందుకు అవకాశం కలి్పంచడం ద్వారా ఆయా ఆస్తుల నుంచి మరింత విలువను రాబట్టడానికి వీలవుతుందని, అలాగే మానిటైజేషన్ ద్వారా వచి్చన నిధులను మౌలిక సదుపాయాల కల్పనపై ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుందని కేంద్రం పేర్కొంది. అయితే 70 యేళ్లపాటు కూడబెట్టిన ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారని ఈ విధానాన్ని ఉటంకిస్తూ, రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గతంలో స్పందిస్తూ, ‘‘అసలు ఆయన (రాహుల్ గాం«దీ) మోనిటైజేషన్ అంటే ఏమిటో అర్థం చేసుకున్నారా?’’ అని ఆర్థికమంత్రి ప్రశ్నించారు. ప్రైవేటుకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను మాత్రమే అప్పగిస్తున్నామని, యజమాని ప్రభుత్వమేనని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. -
హైదరాబాద్‌లో ఈజీ వాష్ కేర్ లాండ్రీ సర్వీసులు
వ్యవస్థీకృత రంగంలో రాష్ట్రంలో తొలి కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవస్థీకృత రంగంలో లాండ్రీ సర్వీసులు అందించే హైదరాబాద్‌కు చెందిన ఎన్ఆర్ ఈజీవాష్కేర్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఈజీ వాష్ కేర్ పేరుతో తొలి కేంద్రాన్ని ఇక్కడి మాదాపూర్‌లో ఏర్పాటు చేసింది. బట్టలు ఉతకడమేగాక ఇస్త్రీ చేసి మరీ కస్టమర్‌కు అప్పగిస్తారు. కంపెనీ సిబ్బంది కస్టమర్ ఇంటికి వెళ్లి దుస్తులను సేకరించి, తిరిగి డెలివరీ చేస్తారు. సెప్టెంబరులో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇటీవలే వాణిజ్యపరంగా కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఇప్పటికే 750కిపైగా కస్టమర్లున్నారని కంపెనీ వ్యవస్థాపకులు కలిశెట్టి నాయుడు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. కస్టమర్ల సౌకర్యార్థం మొబైల్ యాప్‌ను త్వరలో తీసుకొస్తామన్నారు. ఏడాదిలో నాలుగు కేంద్రాలు.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూఎస్ కంపెనీ మేట్యాగ్ వాషింగ్ మెషీన్లను భారత్‌లో తొలిసారిగా తాము వినియోగిస్తున్నామని కలిశెట్టి నాయుడు చెప్పారు. ‘బట్టలు ఉతకడానికి ట్రీటెడ్ వాటర్‌తోపాటు నాణ్యమైన డిటర్జంట్, కండీషనర్, కలర్ బ్లీచ్‌ను వాడుతున్నాం. చార్జీలు ప్యాక్‌నుబట్టి రూ.999 నుంచి ప్రారంభం. ఇక రూ.2,999 ప్యాక్‌లో ఒక కుటుంబానికి నెలంతా సేవలందిస్తాం. ఈ ప్యాక్‌లో ఉన్నవారికి ఎనమిదిసార్లు బట్టలు సేకరించి డెలివరీ చేస్తాం. ప్రస్తుతం ఆరు మెషీన్లను దిగుమతి చేసుకున్నాం. అధిక సామర్థ్యమున్న మెషీన్లు మరిన్ని రానున్నాయి. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఏడాదిలో నాలుగు కేంద్రాలు ప్రారంభిస్తాం’ అని తెలిపారు. -
పాత టూ వీలర్ల విక్రయాల్లోకి శ్రీరామ్ ఆటోమాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత వాహనాల విక్రయ రంగంలో ఉన్న శ్రీరామ్ ఆటోమాల్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద విక్రయాలను ప్రారంభించామని కంపెనీ డెరైక్టర్, సీఈవో సమీర్ మల్హోత్రా బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. దేశంలో ఏటా కొత్త టూ వీలర్లు ఎన్నైతే అమ్ముడవుతున్నాయో, అంతే స్థాయిలో పాతవి విక్రయం అవుతున్నాయని వివరించారు. ‘భారత్‌లో అన్ని రకాల పాత వాహనాల విక్రయ పరిమాణం రూ.1 లక్ష కోట్లు. వృద్ధి రేటు 5 శాతముంది. వ్యవస్థీకృత రంగ వాటా 4-5 శాతముంటుందని అంచనా’ అని చెప్పారు. 100కుపైగా వేలం కేంద్రాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గతేడాది 70 వేల వాహనాలను విక్రయించాం. 2014-15లో లక్ష యూనిట్లు లక్ష్యమని పేర్కొన్నారు. కంపెనీ విక్రయ కేంద్రాలైన ఆటోమాల్స్ దేశవ్యాప్తంగా 43 ఉన్నాయి. మార్చికల్లా మరో 17 ప్రారంభించనుంది.