ముంబై: ఆభరణాల మార్కెట్లో సంఘటిత రంగం వాటా ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12–15 శాతం మేర పెరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. పెద్ద సంస్థలన్నీ విస్తరణ ప్రణాళికలతో ముందుకు వెళుతున్న విషయాన్ని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గుర్తు చేసింది. దీంతో స్థూల ఆర్థిక సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ సంఘటిత రంగం వాటా పెంచుకోగలదని ఇక్రా అంచనా వేస్తోంది. ఆభరణాల మార్కెట్ 2023–24లో విలువ పరంగా 8–10 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని తెలిపింది. బంగారం ధరల్లో అస్థిరతల నేపథ్యంలో పరిమాణాత్మకంగా మార్కెట్‌లో పెద్ద వృద్ధి నమోదు కాకపోవచ్చన్న అంచనాతో ఉంది.
కాకపోతే బంగారానికి ఉన్న బలమైన సాంస్కృతిక అనుబంధం నేపథ్యంలో పండుగలు, వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాలకు డిమాండ్ మద్దతుగా నిలుస్తుందని వివరించింది. ‘‘చాలా మంది జ్యుయలరీ రిటైలర్లు 2023 అక్షయ తృతీయ సందర్భంగా ఆదాయంలో 15 శాతానికి పైగా వృద్ధిని చూసినట్టు పేర్కొన్నారు. బంగారం ధరలు పెరగడం, ఎక్కువ సంస్థలు దూకుడుగా రిటైల్ స్టోర్లను పెంచడం ఆదాయ వృద్ధికి మద్దతునిస్తుంది’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ దాస్ పేర్కొన్నారు. జ్యుయలర్ల ఆపరేటింగ్ మార్జిన్ సౌకర్య స్థాయిలో 7.5–8 శాతం మేర వచ్చే రెండేళ్లు ఉంటుందని ఇక్రా అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment