న్యూఢిల్లీ: సిమెంట్ అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 9–10 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. మౌలిక సదుపాయాలు, పట్టణ గృహాల రంగాల నుండి డిమాండ్ ఇందుకు కారణమని తెలిపింది. ‘ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (ఏప్రిల్–సెపె్టంబర్) పరిశ్రమ విక్రయాలు 12 శాతం అధికం అయ్యాయి.
మొత్తం పంటల ఉత్పత్తిపై సాధారణం కంటే తక్కువ రుతుపవనాల కారణంగా వ్యవసాయ ఆదాయాలపై, అలాగే కొన్ని మార్కెట్లలో గ్రామీణ గృహాల డిమాండ్‌పై ప్రతికూల ప్రభావంతో అక్టోబర్–మార్చి కాలంలో మితమైన వృద్ధి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా కొనసాగుతున్న ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు నిధుల విడుదల మందగించవచ్చు. దీని ప్రభావంతో రెండవ అర్ధ భాగంలో సిమెంట్ విక్రయాల పరిమాణం తగ్గవచ్చు. సిమెంట్ పరిశ్రమ నిర్వహణ లాభాలు ప్రస్తుత ఆర్థిక సంంత్సరంలో 260–310 బేసిస్ పాయింట్లు పెరిగి 16–16.5 శాతానికి మెరుగుపడతాయని అంచనా’ అని ఇక్రా వివరించింది.
63–70 మెట్రిక్ టన్నులు..
‘పునరుత్పాదక ఇంధన వనరులపై సిమెంట్ పరిశ్రమ ఆసక్తి పెరిగింది. అధిక ధరలో లభించే థర్మల్ పవర్, విద్యుత్ అవసరాల కోసం గ్రిడ్‌పై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉంది. తద్వారా నిర్వహణ ఖర్చులు 15–18 శాతం తగ్గుతాయని అంచనా. ఆరోగ్యకర డిమాండ్ అవకాశాలతో సిమెంట్ పరిశ్రమ సామర్థ్య విస్తరణను కొనసాగిస్తుంది. 2025 మార్చి నాటికి సిమెంట్ పరిశ్రమలో 63–70 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం తోడవుతుందని అంచనా.
ఇందులో దాదాపు 33–37 మిలియన్ మెట్రిక్ టన్నులు 2024 మార్చి నాటికి జతకూడనుంది. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం. తూర్పు, మధ్య భారత ప్రాంతాల్లో అధిక విస్తరణ జరుగనుంది. 2022–23లో పరిశ్రమకు 27 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం తోడైంది’ అని ఇక్రా వివరించింది. సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) ప్రకారం భారత్‌లో సిమెంట్ కంపెనీల స్థాపిత సామర్థ్యం మొత్తం 541 మిలియన్ టన్నులు.
Comments
Please login to add a commentAdd a comment