Cement sales
-
సిమెంట్ అమ్మకాల్లో బలమైన వృద్ధి
న్యూఢిల్లీ: సిమెంట్ అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 9–10 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. మౌలిక సదుపాయాలు, పట్టణ గృహాల రంగాల నుండి డిమాండ్ ఇందుకు కారణమని తెలిపింది. ‘ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (ఏప్రిల్–సెపె్టంబర్) పరిశ్రమ విక్రయాలు 12 శాతం అధికం అయ్యాయి. మొత్తం పంటల ఉత్పత్తిపై సాధారణం కంటే తక్కువ రుతుపవనాల కారణంగా వ్యవసాయ ఆదాయాలపై, అలాగే కొన్ని మార్కెట్లలో గ్రామీణ గృహాల డిమాండ్‌పై ప్రతికూల ప్రభావంతో అక్టోబర్–మార్చి కాలంలో మితమైన వృద్ధి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా కొనసాగుతున్న ఇన్ఫ్రా ప్రాజెక్టులకు నిధుల విడుదల మందగించవచ్చు. దీని ప్రభావంతో రెండవ అర్ధ భాగంలో సిమెంట్ విక్రయాల పరిమాణం తగ్గవచ్చు. సిమెంట్ పరిశ్రమ నిర్వహణ లాభాలు ప్రస్తుత ఆర్థిక సంంత్సరంలో 260–310 బేసిస్ పాయింట్లు పెరిగి 16–16.5 శాతానికి మెరుగుపడతాయని అంచనా’ అని ఇక్రా వివరించింది. 63–70 మెట్రిక్ టన్నులు.. ‘పునరుత్పాదక ఇంధన వనరులపై సిమెంట్ పరిశ్రమ ఆసక్తి పెరిగింది. అధిక ధరలో లభించే థర్మల్ పవర్, విద్యుత్ అవసరాల కోసం గ్రిడ్‌పై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉంది. తద్వారా నిర్వహణ ఖర్చులు 15–18 శాతం తగ్గుతాయని అంచనా. ఆరోగ్యకర డిమాండ్ అవకాశాలతో సిమెంట్ పరిశ్రమ సామర్థ్య విస్తరణను కొనసాగిస్తుంది. 2025 మార్చి నాటికి సిమెంట్ పరిశ్రమలో 63–70 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం తోడవుతుందని అంచనా. ఇందులో దాదాపు 33–37 మిలియన్ మెట్రిక్ టన్నులు 2024 మార్చి నాటికి జతకూడనుంది. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం. తూర్పు, మధ్య భారత ప్రాంతాల్లో అధిక విస్తరణ జరుగనుంది. 2022–23లో పరిశ్రమకు 27 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం తోడైంది’ అని ఇక్రా వివరించింది. సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) ప్రకారం భారత్‌లో సిమెంట్ కంపెనీల స్థాపిత సామర్థ్యం మొత్తం 541 మిలియన్ టన్నులు. -
ఇండియా సిమెంట్స్...
ఇండియా సిమెంట్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.5.07 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5.03 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఇండియా సిమెంట్స్ తెలిపింది. సిమెంట్ అమ్మకాలు తగ్గినా, వ్యయాలు తగ్గడం, రియలైజేషనన్లు మెరుగుపడటం వల్ల నిర్వహణ పనితీరు ఒకింత మెరుగుపడిందని కంపెనీ ఎమ్డీ ఎన్. శ్రీనివాసన్ పేర్కొన్నారు. కార్యకలాపాల ఆదాయం రూ.1,430 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.1,269 కోట్లకు తగ్గిందని తెలిపారు. మొత్తం వ్యయాలు రూ.1,439 కోట్ల నుంచి రూ.1,271 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. గత క్యూ2లో 30.77 లక్షల టన్నులుగా ఉన్న సిమెంట్, క్లింకర్ అమ్మకాలు ఈ క్యూ2లో 26.67 లక్షల టన్నులకు తగ్గాయని తెలిపారు. మధ్య ప్రదేశ్‌లో కొత్త ప్లాంట్... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో సిమెంట్‌కు డిమాండ్ బాగా తగ్గిందని, ఫలితంగా దక్షిణ భారత్‌లోనే డిమాండ్ తగ్గిందని శ్రీనివాసన్ వివరించారు. మధ్య ప్రదేశ్‌లో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో సిమెంట్‌కు డిమాండ్ పుంజుకోగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీఎస్ఈలో ఇండియా సిమెంట్స్ షేర్ 1 శాతం నష్టంతో రూ.84 వద్ద ముగిసింది. -
తెలుగు రాష్ట్రాల్లో ‘సిమెంటు’ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు విక్రయాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంచి జోరు మీదున్నాయి. 2017తో పోలిస్తే 2018లో అమ్మకాల్లో ఏకంగా 47 శాతం వృద్ధి నమోదయింది. అమ్మకాల్లో వృద్ధి పరంగా తెలుగు రాష్ట్రాలు దేశంలో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 2017లో 1.96 కోట్ల టన్నుల సిమెంటు అమ్ముడైంది. 2018లో ఇది సరాసరి 2.89 కోట్ల టన్నులకు ఎగసింది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో వ్యక్తిగత గృహాల నిర్మాణం అనూహ్యంగా పెరుగుతోందని, ప్రభుత్వ ప్రాజెక్టులైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరంతో పాటు ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం తోడవడంతో ఇక్కడ సిమెంటు వినియోగం పెరిగిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. టాప్‌లో సౌత్.. 2019లోనూ తెలుగు రాష్ట్రాల్లో రెండంకెల వృద్ధి కొనసాగుతుందని భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి అంచనా వేశారు. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని, మున్సిపాలిటీలు పెరగడం, అందుకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పనతో సిమెంటు డిమాండ్ పెరిగిందని ‘యార్డ్స్ అండ్ ఫీట్’ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ డైరెక్టర్ కలిశెట్టి నాయుడు అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా చూస్తే 22 శాతం డిమాండ్ వృద్ధితో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో నిలిచాయి. ఇక్కడ అమ్మకాలు 6.48 కోట్ల టన్నుల నుంచి 7.93 కోట్ల టన్నులకు చేరాయి. అయితే దేశవ్యాప్తంగా చూసినపుడు మాత్రం సిమెంటు విక్రయాల్లో 2018లో వృద్ధి రేటు 8 శాతంగానే నమోదైంది. మొత్తం విక్రయాలు 30 కోట్ల టన్నులుగా నమోదయ్యాయి. భారత్‌లో సుమారు 80 బ్రాండ్లు పోటీపడుతుండగా వీటిలో పెద్ద బ్రాండ్లు 25–30 దాకా ఉంటాయి. ధరలు ఇక్కడే తక్కువ.. ఇతర మార్కెట్లతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే సిమెంటు ధరలు తక్కువని చెప్పొచ్చు. ఇక్కడ బ్రాండును బట్టి బస్తా సిమెంటు ధర ప్రస్తుతం రూ.300 నుంచి రూ.350 మధ్య పలుకుతోంది. కర్ణాటకలో ఇది రూ.320–380 ఉండగా, తమిళనాడులో రూ.350–400, కేరళలో రూ.380–420 మధ్య ఉంది. గతేడాది పెట్‌కోక్, ఇంధన ధరలు పెరిగినప్పటికీ విక్రయ ధరను దక్షిణాది కంపెనీలు పెంచలేదు. దీనికి కారణం డిమాండ్‌ను మించి సరఫరా ఉండడంతో పాటు కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉండటమేనని పరిశ్రమ వర్గాలు చెప్పాయి. మొత్తం డిమాండ్‌లో వ్యక్తిగత గృహాలకు వాడుతున్న సిమెంటు వాటా అత్యధికంగా 55 శాతం ఉంటోంది. కొనసాగితేనే లాభాలు.. స్టాక్ మార్కెట్ పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉండటంతో 2018లో చాలా సిమెంటు కంపెనీల షేర్లు పడిపోయాయి. పలు సిమెంట్ కంపెనీల ఫలితాలు నిరాశపరచటం, కొన్ని కంపెనీలు నష్టాలు చవిచూడటం దీనికి తోడయింది. తయారీ వ్యయాలు 10–15 శాతం పెరిగి మరీ భారం కావడంతో ఇటీవలే కంపెనీలు సిమెంటు రకాన్నిబట్టి బస్తాపైన ధర రూ.25–50 రేటు పెంచాయి. ధరలు ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నాయని, సిమెంటు కంపెనీలకు 2019 కలిసి వస్తుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది. ప్రస్తుత ధరలు ఇలాగే కొనసాగితే నష్టాల నుంచి గట్టెక్కుతామని కంపెనీలు భావిస్తున్నాయి. కంపెనీల షేర్ల ధరలు గతేడాది గరిష్టంతో పోలిస్తే ప్రస్తుతం ఎలా ఉన్నాయన్నది గమనిస్తే... పరిస్థితి తేలిగ్గానే అర్థమవుతుంది. -
దక్షిణాదిలో సిమెంటు విక్రయాల జోరు
• నవంబర్, డిసెంబర్ అమ్మకాల్లో వృద్ధి • పెద్ద నోట్ల రద్దు ప్రభావం లేదు • దాదాపు స్థిరంగా ఉన్న సిమెంటు ధరలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ఒకట్రెండు రాష్ట్రాల్లో మినహా పెద్ద నోట్ల రద్దు ప్రభావం సిమెంటు పరిశ్రమపై ఏమాత్రం లేదు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలు పెరుగుతుండడం ఇందుకు నిదర్శనమని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వస్తుడటంతో సిమెంటు విక్రయాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిమెంటు ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. రద్దు ప్రభావమే లేదు.. పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) కారణంగా అమ్మకాలు భారీగా పడిపోవచ్చని, ధరల్లో క్షీణతకు ఆస్కారం ఉండొచ్చని సిమెంటు పరిశ్రమ తొలుత భావించింది. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడం కంపెనీలకు ఆశ్చర్యం కలిగించింది. దేశవ్యాప్తంగా చూస్తే ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల్లో స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. ఈ తగ్గుదల కూడా గుజరాత్‌కు మాత్రమే పరిమితమైంది. సిమెంటు ధరల్లో 3–5 రూపాయలు మాత్రమే సవరణ జరి గింది. దక్షిణాది రాష్ట్రాల్లో డీమో నిటైజేషన్ ప్రభావం ఏమాత్రం పడలేదు. పైగా 2015తో పోలిస్తే 2016లో విక్రయాలు పెరగడం గమనార్హం. పెరిగిన అమ్మకాలు.. దక్షిణాది రాష్ట్రాల్లో 2015 నవంబరులో 40 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. అదే ఏడాది డిసెంబరులో 48 లక్షల టన్నులకు ఎగిశాయి. ఇక 2016 వచ్చేసరికి విక్రయాల్లో భారీ పెరుగుదల కనిపించింది. అక్టోబరులో 51 లక్షల టన్నులు నమోదయ్యాయి. నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడింది. దీని ప్రభావం దాదాపు అన్ని రంగాల లావాదేవీలపైనా పడింది. వాస్తవానికి నవంబరులో అమ్మకాలు ఎలా ఉంటాయోనని సిమెంటు కంపెనీలు ఆందోళన చెందాయి. అందరి అంచనాలు తలకిందులయ్యాయి. నవంబరులో కూడా 51 లక్షల టన్నుల సేల్స్ జరిగాయి. డిసెంబరులో విక్రయాలు కాస్త పెరిగి 52 లక్షల టన్నులకు చేరాయి. ఇక సిమెంటు విక్రయాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ వృద్ధిలో ఉన్నాయి. 2016లో అక్టోబరులో 15 లక్షల టన్నులు, నవంబరులో 15, డిసెంబరులో 16 లక్షల టన్నులు జరిగాయి. ఆగని నిర్మాణాలు..: వాస్తవానికి ఇల్లు కట్టుకోవడానికి అత్యధికులు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. నిర్మాణానికి కావాల్సిన నిధుల కొరత ఉండదు. ఇలా రుణం తీసుకున్న వినియోగదారుకు ఖచ్చితంగా బ్యాంకు ఖాతా ఉంటుంది. వీరివద్ద చెక్కు బుక్, డెబిట్/క్రెడిట్ కార్డు సైతం ఉంటుంది కాబట్టి చెల్లింపులకు అడ్డంకులు లేవని కంపెనీలు అంటున్నాయి. నిర్మాణ రంగంలో డీమోనిటైజేషన్ ప్రభావం లేదని, నవంబరు, డిసెంబరు సిమెంటు అమ్మకాలను చూస్తే ఇది అవగతమవుతుందని ప్రముఖ కంపెనీకి చెందిన ఉన్నతాధికారి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో అన్నారు. వడ్డీ రేట్లూ తక్కువే.. సిమెంటు ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 2016 జనవరిలో బస్తా ధర బ్రాండ్, రకాన్నిబట్టి రూ.320–355 మధ్య పలికింది. ఇప్పుడిది రూ.300–330 మధ్య ఉంది. విజయవాడలో రూ.300–335, విశాఖపట్నంలో రూ.320–350 మధ్య పలుకుతోంది. బ్యాంకులు ఒకదాని వెంట ఒకటి పోటీగా గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించడంతో కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతోందని ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రుణం తీసుకునే వారికి వడ్డీలో 4 శాతం వరకు సబ్సిడీని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా నిర్మాణ రంగానికి కలసి వచ్చే అంశాలని అన్నారు. సాధారణంగా ఇంటి నిర్మాణానికి జనవరి–జూన్ అనువైనవి. పైగా హైదరాబాద్‌లో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు బస్తాకు రూ.20–25 తక్కువగా ధర పలుకుతోంది. మరోవైపు వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఇంకేముంది సొంతింటి కల నిజం చేసుకోవడానికి సరైన సమయం వచ్చిందని సిమెంటు సంస్థలు అంటున్నాయి. ధరలు పెరిగే అవకాశం.. డీజిల్ ధర కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తోంది. కోల్ సైతం అదే దారిలో నడుస్తోంది. దిగుమతి అవుతున్న పెట్ కోక్ ధర 2016 ఏప్రిల్‌లో 40 డాలర్లుంటే, ఇప్పుడు 70 డాలర్లకు ఎగసింది. వెరశి తయారీ వ్యయం ఒక బస్తాకు రూ.10 దాకా అధికమైందని ఒక కంపెనీ డైరెక్టర్ వెల్లడించారు. తయారీ వ్యయం పెరిగితే తుది ఉత్పాదన ధరను సవరించాల్సిందేనని, అలా కాని పక్షంలో నష్టాలను చవిచూడాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ధర స్వల్పంగా పెరిగే చాన్స్ ఉందన్నారు. దక్షిణాది కంపెనీల ప్లాంట్ల వినియోగం 50–60 శాతముందని వివరించారు. ఏపీ, తెలంగాణలో ఇలా... ఒక్క ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టులకుగాను 30 లక్షల టన్నుల సిమెంటు అవసరమనేది కంపెనీల అంచనా. బలహీన వర్గాల ఇళ్లకు రూ.230, కాం క్రీటు రోడ్లకు రూ.240, పోలవరం ప్రాజెక్టుకు రూ.250లకు సిమెంటు సరఫరాకు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెలంగాణ పరిస్థితి: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తోంది. వీటి నిర్మాణానికి అవసరమైన సిమెంటుకై ఒక్కో బస్తాకు కంపెనీలకు రూ.230 ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ఇళ్లకు వచ్చే మూడేళ్లలో 27 లక్షల టన్నుల సిమెంటు అవసరం అవుతుందని అంచనా. -
సిమెంటుకు మంచి రోజులు
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన నిర్మాణ పనులు - 10 శాతం పెరిగిన ప్లాంట్ల వినియోగం - 2015-16లో పరిశ్రమ వృద్ధి 7 శాతం: ఇక్రా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు విక్రయాలు దేశవ్యాప్తంగా పుంజుకున్నాయి. మౌలిక రంగం, పెట్టుబడులతోపాటు మొత్తంగా ఎకానమీ రికవరీ ఇందుకు కారణమని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మార్కెట్లో స్తబ్దత తొలగిపోవడంతో నిర్మాణ రంగంలో కదలిక వచ్చిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ రియల్టీ రంగంలో కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయని చెబుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్ల వినియోగం 2014తో పోలిస్తే ప్రస్తుతం 10 శాతం పెరిగింది. ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టులు మొదలు కానున్నాయి కాబట్టి మంచి రోజులు రానున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా 2015-16లో దేశవ్యాప్తంగా సిమెంటు పరిశ్రమ 6.8-7 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఇక్రా వెల్లడించింది. ప్రభుత్వ ప్రాజెక్టులతో.. తెలంగాణలోని సిమెంటు ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం సుమారు 2.9 కోట్ల టన్నులు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 3.6 కోట్ల టన్నులు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 2014లో ప్లాంట్ల వినియోగం 40-50 శాతం మాత్రమే నమోదైంది. 2010-14 కాలంలో సంయుక్త రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అమ్మకాలు లేక సిమెంటు పరిశ్రమ నష్టాలను చవిచూసింది. సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రభుత్వ సంబంధిత నిర్మాణ పనుల వల్ల సిమెంటుకు గిరాకీ పెరుగుతుంది. అయితే 2013-14లో ఆ తరహా పనులేవీ జరగలేదు. కాగా, ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయి. సిమెంటు ప్లాంట్ల వినియోగం 10 శాతం పెరిగి ఇప్పుడు మొత్తం సామర్థ్యంలో 45-55 శాతానికి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పలు నిర్మాణ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు రెడీ అయ్యాయి. దీంతో సిమెంటుకు డిమాండ్ మరింత పెరగనుందని ప్రముఖ కంపెనీకి చెందిన ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో సిమెంటు వార్షిక వినియోగం 10 లక్షల టన్నులు అధికమవుతుందని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఇలా.. మహారాష్ట్రలో సిమెంటు ప్లాంట్ల వినియోగం 100 శాతం ఉంది. 2014లో 2.6 కోట్ల టన్నులు అమ్ముడైంది. 2015లో విక్రయాలు 2.8 కోట్ల టన్నులు ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. కర్ణాటకలో వినియోగం 1.5 కోట్ల టన్నుల నుంచి 1.6 కోట్ల టన్నులకు చేరనుంది. ఉత్తర, తూర్పు, పశ్చిమ భారత్‌లో ప్లాంట్ల వినియోగం 70-80 శాతం ఉందని కంపెనీలు చెబుతున్నాయి. గతేడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వినియోగం 1.7 కోట్ల టన్నులుంది. ఈ ఏడాది స్వల్ప వృద్ధి ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. అలాగే ఈ రెండు రాష్ట్రాల నుంచి పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశాలకు సిమెంటు సరఫరా అవుతోంది. కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి నెలా 1-2 లక్షల టన్నుల సిమెంటు, క్లింకర్‌ను శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్‌కు ఎగుమతి చేస్తున్నాయి. ఇక్కడే ధర తక్కువ.. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లోనే సిమెంటు ధర తక్కువగా ఉందని కంపెనీలు వెల్లడించాయి. హైదరాబాద్‌లో 50 కిలోల బస్తా ధర వేరియంట్‌నుబట్టి ప్రస్తుతం రూ.320-355 మధ్య ఉంది. వైజాగ్‌లో ఇది రూ.340-370 పలుకుతోంది. తమిళనాడులో రూ.385-405, బెంగళూరులో రూ.380-410, కేరళలో రూ.400-430 మధ్య ఉంది. అయితే వడ్డీరేట్లు తగ్గితే నిర్మాణ రంగం గణనీయంగా పుంజుకుంటుందని ఒక ప్రముఖ కంపెనీ డెరైక్టర్ తెలిపారు. 2014-15లో దేశంలో సిమెంటు ఉత్పత్తి 5.6 శాతం పెరిగింది. అంత క్రితం కాలంలో ఇది 3 శాతమే. -
సొంతిల్లు కలే!
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. పెళ్లిమాటెలా ఉన్నా రోజురోజుకు భవన నిర్మాణ సామగ్రి ధరలు చుక్కల నంటుతుండటంతో ఇల్లు కట్టే పరిస్థితి లేకుండా పోతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానేమిగిలిపోతోంది. భవన నిర్మాణం చేపట్టాలంటే పునాది వేసింది మొదలు ఇటుక,ఇసుక, ఇనుము, సిమెంటు తదితర సామగ్రి కొనాలంటే తడిచి మోపెడవు తోంది. దీంతో నిర్మాణ రంగం కూడా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.గత ఏడాది శరవేగంగా సాగిన పనులు ప్రస్తుతం మందగించాయి.ఫలితంగా కూలీలకూ ఉపాధి కరువైంది. సొంతింటి నిర్మాణం సామాన్యుడికి మరింత భారమైంది. భవన నిర్మాణ సామగ్రి ధరలు అమాంతంగా పెరిగి పోయా యి. జిల్లాలో రోజుకు దాదాపు 60 వేల బస్తాల సిమెంట్ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా గతంతో పోల్చితే బస్తాకు 70 రూపాయల భారం పడింది. కొందరు నేరుగా కంపెనీల నుంచి, మరికొందరు ప్రభుత్వ రంగ, నిర్మాణ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం 50 కేజీల సిమెంటు (సాధారణ ) బస్తా ధర రూ. 235 వరకు ఉండగా, తాజాగా రూ. 295కు చేరింది. అదే 53 గ్రేడ్ రకం, రూ. 240 నుంచి రూ. 305కు చేరడం గమనార్హం. కృతిమ కొరతే.... సిమెంటు పరిశ్రమలపై ప్రభుత్వానికి పట్టు లేకపోవడందో ధరలను అదుపు చేయలేకపోతుందని భవన నిర్మాణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ధరలను కంపెనీలు పెంచాయి. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేయడంలేదు. ఫలితంగా మార్కెట్లో సిమెంటు అమ్మకాల జోరు తగ్గింది. కృత్రిమ కొరత కారణంగా నిర్మాణాల సీజన్ కాకపోయినా సిమెంటు ధరలు అమాంతం పెరిగాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రుతుపవనాల రాకతో, వర్షాలు ప్రారంభం కానుండటంతో నిర్మాణాలు పెద్దగా జరగడం లేదు. మరో 7, 8 నెలలపాటు ఇదే పరిస్థితి ఉండే అవకావశం ఉంది. అమాంతం పెరిగిన ఇనుము ధర... గత ఏడాది టన్ను ఇనుము రూ. 42వేలు ఉంది. ప్రథమ, ద్వితీయ, ప్రథమ శ్రేణి రకాల ధరలు పెరిగి పోయాయి. నాణ్యత తక్కువగా ఉండే స్టీలు టన్ను ధర రూ. 47వేలు, మేలు రకం రూ. 54వేల వరకు ఉంది. గృహనిర్మాణాల్లో పిల్లర్లు, బెడ్లు, పైకప్పు నిర్మాణాలే కీలకం, వాటికి కంకర వినియోగం తప్పనిసరి. కంకర కోనుగోలు నిర్మాణదారులకు తలకు మించిన భారంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది యూనిట్ కంకరకు రూ.700 పెరిగింది. దీనికి తోడు కూలీ, రవాణా ఖర్చులు అదనంగా భారం తప్పడం లేదు. అదేవిధంగా ఇటీవల వరకు రూ.3800 పలికిన వెయ్యి ఇటుకలు ప్రస్తుతం రూ. 4,250 పలుకుతున్నాయి. నేనేమీ తక్కువ కాదన్నట్లు ఇసుక ధర చుక్కలనంటుతోంది. టన్ను రూ. 3వేల నుంచి రూ. 5వేల వరకు పలుకుతోంది. ఇందిరమ్మ పథకం ద్వారా ఇచ్చే డబ్బుకు ఇల్లు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో నిర్మాణం కోసం రుణం చేయాల్సిన పరిస్థితి నెలకొందని లబ్దిదారులు వాపోతున్నారు. వ్యాపారాలు వెలవెల.. విద్యుత్ కోత కారణంగా సిమెంటు ఉత్పత్తి కష్టమవుతోంది. దీంతో కంపెనీలు ధరలు పెంచాయి. విద్యుత్ కోతలు మార్చి నుంచి మొదలైన ధరల పెరుగుదల మాత్రం మే నెల నుంచి జరిగింది. కంపెనీలన్నీ పెంపు నిర్ణయం తీసుకున్నాయి. నెల రోజులుగా వ్యాపారం 60 శాతం మందగించింది. -పి. రవిచంద్రకుమార్, సిమెంటు వ్యాపారి కొత్తపనులు మొదలు కావడం లేదు భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి పోతుండటంతో కొత్త పనులు మొదలు కావడం లేదు. భవన నిర్మాణ పనుల్ని వృత్తిగా ఎంచుకున్న కూలీలకు ఉపాధి దొరకడం లేదు. ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. ఆర్థిక స్తోమత ఉన్నవారు మాత్రమే పనులు కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో పనులు లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. - ఊట్ల శివ, తాపి మేస్త్రీ