దక్షిణాదిలో సిమెంటు విక్రయాల జోరు | no not banned effect in Cement sales in india | Sakshi
Sakshi News home page

దక్షిణాదిలో సిమెంటు విక్రయాల జోరు

Published Wed, Jan 11 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

దక్షిణాదిలో సిమెంటు విక్రయాల జోరు

దక్షిణాదిలో సిమెంటు విక్రయాల జోరు

నవంబర్, డిసెంబర్‌ అమ్మకాల్లో వృద్ధి
పెద్ద నోట్ల రద్దు ప్రభావం లేదు
దాదాపు స్థిరంగా ఉన్న సిమెంటు ధరలు


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో
ఒకట్రెండు రాష్ట్రాల్లో మినహా పెద్ద నోట్ల రద్దు ప్రభావం సిమెంటు పరిశ్రమపై ఏమాత్రం లేదు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలు పెరుగుతుండడం ఇందుకు నిదర్శనమని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వస్తుడటంతో సిమెంటు విక్రయాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిమెంటు ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి.

రద్దు ప్రభావమే లేదు..
పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌) కారణంగా అమ్మకాలు భారీగా పడిపోవచ్చని, ధరల్లో క్షీణతకు ఆస్కారం ఉండొచ్చని సిమెంటు పరిశ్రమ తొలుత భావించింది. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడం కంపెనీలకు ఆశ్చర్యం కలిగించింది. దేశవ్యాప్తంగా చూస్తే ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల్లో స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. ఈ తగ్గుదల కూడా గుజరాత్‌కు మాత్రమే పరిమితమైంది. సిమెంటు ధరల్లో 3–5 రూపాయలు మాత్రమే సవరణ జరి గింది. దక్షిణాది రాష్ట్రాల్లో డీమో నిటైజేషన్‌ ప్రభావం ఏమాత్రం పడలేదు. పైగా 2015తో పోలిస్తే 2016లో విక్రయాలు పెరగడం గమనార్హం.

పెరిగిన అమ్మకాలు..
దక్షిణాది రాష్ట్రాల్లో 2015 నవంబరులో 40 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. అదే ఏడాది డిసెంబరులో 48 లక్షల టన్నులకు ఎగిశాయి. ఇక 2016 వచ్చేసరికి విక్రయాల్లో భారీ పెరుగుదల కనిపించింది. అక్టోబరులో 51 లక్షల టన్నులు నమోదయ్యాయి. నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడింది. దీని ప్రభావం దాదాపు అన్ని రంగాల లావాదేవీలపైనా పడింది. వాస్తవానికి నవంబరులో అమ్మకాలు ఎలా ఉంటాయోనని సిమెంటు కంపెనీలు ఆందోళన చెందాయి. అందరి అంచనాలు తలకిందులయ్యాయి. నవంబరులో కూడా 51 లక్షల టన్నుల సేల్స్‌ జరిగాయి. డిసెంబరులో విక్రయాలు కాస్త పెరిగి 52 లక్షల టన్నులకు చేరాయి.  ఇక సిమెంటు విక్రయాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ వృద్ధిలో ఉన్నాయి. 2016లో అక్టోబరులో 15 లక్షల టన్నులు, నవంబరులో 15, డిసెంబరులో 16 లక్షల టన్నులు జరిగాయి.

ఆగని నిర్మాణాలు..: వాస్తవానికి ఇల్లు కట్టుకోవడానికి అత్యధికులు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. నిర్మాణానికి కావాల్సిన నిధుల కొరత ఉండదు. ఇలా రుణం తీసుకున్న వినియోగదారుకు ఖచ్చితంగా బ్యాంకు ఖాతా ఉంటుంది. వీరివద్ద చెక్కు బుక్, డెబిట్‌/క్రెడిట్‌ కార్డు సైతం ఉంటుంది కాబట్టి చెల్లింపులకు అడ్డంకులు లేవని కంపెనీలు అంటున్నాయి.  నిర్మాణ రంగంలో డీమోనిటైజేషన్‌ ప్రభావం లేదని, నవంబరు, డిసెంబరు సిమెంటు అమ్మకాలను చూస్తే ఇది అవగతమవుతుందని ప్రముఖ కంపెనీకి చెందిన ఉన్నతాధికారి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో అన్నారు.

వడ్డీ రేట్లూ తక్కువే..
సిమెంటు ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 2016 జనవరిలో బస్తా ధర బ్రాండ్, రకాన్నిబట్టి రూ.320–355 మధ్య పలికింది. ఇప్పుడిది రూ.300–330 మధ్య ఉంది. విజయవాడలో రూ.300–335, విశాఖపట్నంలో రూ.320–350 మధ్య పలుకుతోంది. బ్యాంకులు ఒకదాని వెంట ఒకటి పోటీగా గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించడంతో కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతోందని ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద రుణం తీసుకునే వారికి వడ్డీలో 4 శాతం వరకు సబ్సిడీని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా నిర్మాణ రంగానికి కలసి వచ్చే అంశాలని అన్నారు. సాధారణంగా ఇంటి నిర్మాణానికి జనవరి–జూన్‌ అనువైనవి. పైగా హైదరాబాద్‌లో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు బస్తాకు రూ.20–25 తక్కువగా ధర పలుకుతోంది. మరోవైపు వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఇంకేముంది సొంతింటి కల నిజం చేసుకోవడానికి సరైన సమయం వచ్చిందని సిమెంటు సంస్థలు అంటున్నాయి.

ధరలు పెరిగే అవకాశం..
డీజిల్‌ ధర కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తోంది. కోల్‌ సైతం అదే దారిలో నడుస్తోంది. దిగుమతి అవుతున్న పెట్‌ కోక్‌ ధర 2016 ఏప్రిల్‌లో 40 డాలర్లుంటే, ఇప్పుడు 70 డాలర్లకు ఎగసింది. వెరశి తయారీ వ్యయం ఒక బస్తాకు రూ.10 దాకా అధికమైందని ఒక కంపెనీ డైరెక్టర్‌ వెల్లడించారు. తయారీ వ్యయం పెరిగితే తుది ఉత్పాదన ధరను సవరించాల్సిందేనని, అలా కాని పక్షంలో నష్టాలను చవిచూడాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ధర స్వల్పంగా పెరిగే చాన్స్‌ ఉందన్నారు. దక్షిణాది కంపెనీల ప్లాంట్ల వినియోగం 50–60 శాతముందని వివరించారు.

ఏపీ, తెలంగాణలో ఇలా...
ఒక్క ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టులకుగాను 30 లక్షల టన్నుల సిమెంటు అవసరమనేది కంపెనీల అంచనా. బలహీన వర్గాల ఇళ్లకు రూ.230, కాం క్రీటు రోడ్లకు రూ.240, పోలవరం ప్రాజెక్టుకు రూ.250లకు సిమెంటు సరఫరాకు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

తెలంగాణ పరిస్థితి: డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై  ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్‌ చేస్తోంది. వీటి నిర్మాణానికి అవసరమైన సిమెంటుకై ఒక్కో బస్తాకు కంపెనీలకు రూ.230 ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ఇళ్లకు వచ్చే మూడేళ్లలో 27 లక్షల టన్నుల సిమెంటు అవసరం అవుతుందని అంచనా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement