హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు విక్రయాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంచి జోరు మీదున్నాయి. 2017తో పోలిస్తే 2018లో అమ్మకాల్లో ఏకంగా 47 శాతం వృద్ధి నమోదయింది. అమ్మకాల్లో వృద్ధి పరంగా తెలుగు రాష్ట్రాలు దేశంలో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 2017లో 1.96 కోట్ల టన్నుల సిమెంటు అమ్ముడైంది. 2018లో ఇది సరాసరి 2.89 కోట్ల టన్నులకు ఎగసింది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో వ్యక్తిగత గృహాల నిర్మాణం అనూహ్యంగా పెరుగుతోందని, ప్రభుత్వ ప్రాజెక్టులైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరంతో పాటు ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం తోడవడంతో ఇక్కడ సిమెంటు వినియోగం పెరిగిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
టాప్‌లో సౌత్..
2019లోనూ తెలుగు రాష్ట్రాల్లో రెండంకెల వృద్ధి కొనసాగుతుందని భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి అంచనా వేశారు. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని, మున్సిపాలిటీలు పెరగడం, అందుకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పనతో సిమెంటు డిమాండ్ పెరిగిందని ‘యార్డ్స్ అండ్ ఫీట్’ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ డైరెక్టర్ కలిశెట్టి నాయుడు అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా చూస్తే 22 శాతం డిమాండ్ వృద్ధితో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో నిలిచాయి. ఇక్కడ అమ్మకాలు 6.48 కోట్ల టన్నుల నుంచి 7.93 కోట్ల టన్నులకు చేరాయి. అయితే దేశవ్యాప్తంగా చూసినపుడు మాత్రం సిమెంటు విక్రయాల్లో 2018లో వృద్ధి రేటు 8 శాతంగానే నమోదైంది. మొత్తం విక్రయాలు 30 కోట్ల టన్నులుగా నమోదయ్యాయి. భారత్‌లో సుమారు 80 బ్రాండ్లు పోటీపడుతుండగా వీటిలో పెద్ద బ్రాండ్లు 25–30 దాకా ఉంటాయి.
ధరలు ఇక్కడే తక్కువ..
ఇతర మార్కెట్లతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే సిమెంటు ధరలు తక్కువని చెప్పొచ్చు. ఇక్కడ బ్రాండును బట్టి బస్తా సిమెంటు ధర ప్రస్తుతం రూ.300 నుంచి రూ.350 మధ్య పలుకుతోంది. కర్ణాటకలో ఇది రూ.320–380 ఉండగా, తమిళనాడులో రూ.350–400, కేరళలో రూ.380–420 మధ్య ఉంది. గతేడాది పెట్‌కోక్, ఇంధన ధరలు పెరిగినప్పటికీ విక్రయ ధరను దక్షిణాది కంపెనీలు పెంచలేదు. దీనికి కారణం డిమాండ్‌ను మించి సరఫరా ఉండడంతో పాటు కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉండటమేనని పరిశ్రమ వర్గాలు చెప్పాయి. మొత్తం డిమాండ్‌లో వ్యక్తిగత గృహాలకు వాడుతున్న సిమెంటు వాటా అత్యధికంగా 55 శాతం ఉంటోంది.
కొనసాగితేనే లాభాలు..
స్టాక్ మార్కెట్ పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉండటంతో 2018లో చాలా సిమెంటు కంపెనీల షేర్లు పడిపోయాయి. పలు సిమెంట్ కంపెనీల ఫలితాలు నిరాశపరచటం, కొన్ని కంపెనీలు నష్టాలు చవిచూడటం దీనికి తోడయింది. తయారీ వ్యయాలు 10–15 శాతం పెరిగి మరీ భారం కావడంతో ఇటీవలే కంపెనీలు సిమెంటు రకాన్నిబట్టి బస్తాపైన ధర రూ.25–50 రేటు పెంచాయి. ధరలు ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నాయని, సిమెంటు కంపెనీలకు 2019 కలిసి వస్తుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది. ప్రస్తుత ధరలు ఇలాగే కొనసాగితే నష్టాల నుంచి గట్టెక్కుతామని కంపెనీలు భావిస్తున్నాయి. కంపెనీల షేర్ల ధరలు గతేడాది గరిష్టంతో పోలిస్తే ప్రస్తుతం ఎలా ఉన్నాయన్నది గమనిస్తే... పరిస్థితి తేలిగ్గానే అర్థమవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ‘సిమెంటు’ జోరు
Published Fri, Feb 22 2019 4:05 AM | Last Updated on Fri, Feb 22 2019 4:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment